యువతలో అసమ్మతి ఉప్పొంగితే ఆపడం ఎవరి తరము కాదు
అవును నిజమని ఇటీవల సంఘటనలు రుజువు చేస్తున్నాయి.హక్కులకై కల బడుతూ బాధ్యతలకు నిలబడితే విజయమే
--- వడ్డేపల్లి మల్లేశం
హక్కులకై కల బడి బాధ్యతలకు నిలబడాలి అనే పోరాట స్ఫూర్తిని మానవీయ ఆలోచనను విస్తృతం చేసే కార్మిక వర్గ దృక్పథానికి సంబంధించిన నినాదం ప్రపంచవ్యాప్తంగా ఏ నాడో ఉద్భవించింది. "ప్రపంచ కార్మికులారా ఏకంకండి" అనే నినాదం ఆ స్ఫూర్తి నుండి వెలుగు చూసినదే. అంటే"" మానవాళికి హక్కులు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని, ఆ హక్కులను ప్రభుత్వం నుండి చట్టబద్ధంగా పొందాలని, అదే సందర్భంలో మన బాధ్యతలను కూడా సామాజిక స్పృహతో నిర్వహించాలని అర్థాన్ని ఈ నినాదం ఇస్తుంది. స్వార్థ ప్రయోజనం మాత్రమే కాదు బాధ్యతలను కూడా గుర్తింపచేసే ఈ సూక్తి నినాదం సర్వత్ర అమలు కాకపోవడం, పౌర సమాజం కూడా ఆచరణకు వచ్చేసరికి నిర్లక్ష్యం వహించడం, ఇదే అదనగా భావిస్తున్నటువంటి పాలకవర్గాలు ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునే క్రమంలో ఉచితాలు తాయిలాలు వాగ్దానాలను సృష్టించి ప్రజలను మరింత బలహీనులను చేసిన కారణంగానే విద్యా వైద్యం ఉపాధి వంటి ప్రధానమైన ప్రజల డిమాండ్లు కనుమరుగైనాయి. " ప్రస్తుతం అన్ని రకాల హామీలు వాగ్దానాలను ప్రజలు వదలి భూమి ఉపాధి విద్య వైద్యం సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రధానంగా డిమాండ్ చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. సుమారు 8 దశాబ్దాలుగా భారతదేశంలో చట్టసభల్లో ప్రజల సమస్యలను ప్రతిపక్షాలు ప్రస్తావించడం పాలక పక్షాలు మొక్కుబడి చట్టాలతో కాలయాపన చేయడం హామీలు వాగ్దానాలతో దశాబ్దాలు గడిచిపోయిన కారణంగా ఇప్పటికీ ప్రధానమైన డిమాండ్లు ఏవి పరిష్కరించబడలేదు. భూమిలేని నిరుపేదలు కోట్లాదిమంది ఉపాధి ఉద్యోగాలు లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న వారికి అంతే లేదు. పేదరికం వెక్కిరిస్తూ సుమారు 20 శాతం దాకా ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అనే కేంద్ర ప్రభుత్వ హామీ కలగానే మిగిలిపోయింది, ప్రజల అకౌంట్లో 15 లక్షల చొప్పున వేస్తామని ఇచ్చిన హామీ నీరుగారిపోయింది. ప్రకటనలో మాత్రం ప్రపంచంలో భారతదేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తున్నది అనే మాట పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా అనేక సమస్యలతో అతరాకుతులమవుతున్న భారతావనిని చూస్తే అర్థమవుతుంది. దీనికి తోడు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో తప్పులకు పాల్పడడం, జరిగిన పొరపాట్లను అంగీకరించకపోవడం, ప్రశ్నించి, ప్రతిఘటించి తమ హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులు కర్షకులు చేతివృత్తుల వాళ్ళు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు, విద్యార్థులు కాంట్రాక్టర్లు తదితర వర్గాల పోరాటాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడంతో పాటు దేశంలోని వేలాది కారాగారాలలో కోట్లాదిమంది విచారణ ఖైదీలు గానే దశాబ్దాలు గడుపుతున్నారంటే ఈ నిండు వాస్తవాలను దాచి పేరుకు మూడవ ఆర్థిక వ్యవస్థ అంటే అంగీకరించేది ఎలా? ప్రపంచంలోనే భారతదేశంలో యువత ఎక్కువగా ఉందనే మాట గత పది సంవత్సరాలుగా నినదించబడుతున్న తరుణంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగిన నీట్ పరీక్ష తదనంతర ఫలితాల క్రమంలో ఉద్భవించిన ప్రజా ఉద్యమాలు కొత్త రూపును సంతరించుకున్న విషయం, నిరాశ స్పృహలతో కొట్టుమిట్టాడుతున్నయువత, ప్రజానీకానికి కొంత ఊరట కలిగిస్తున్నాయనటంలో సందేహం లేదు అని సామాజిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ పేరున
ఈ సంవత్సర ప్రారంభంలో దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షలో అనేక అవకతవకలు జరిగినాయి అని వాటిని రద్దు చేయాలని అందుకు బాధ్యుడైనటువంటి కేంద్ర విద్యామంత్రిని భర్త రఫ్ చేయాలని ప్రధాన డిమాండ్ తో జూలై 2026, 20వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగిన విషయం తెలుసు. యువతను ప్రధానంగా కాకురోచ్ లతో భారత సిజెఐ పోల్చినట్టు ఆ తర్వాత యువత తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే నేపముతో అదే కాక్రోచ్ పేరుతో జనతా పార్టీని ఇంస్టాగ్రామ్ లో ప్రారంభిస్తే కొద్ది రోజుల్లోనే అసమ్మతి కలిగిన లక్షలాదిమంది సభ్యులుగా చేరడం సమీకరించబడడం నిరసన ప్రదర్శన విజయవంతం చేయడం చకచకా సాగిపోయినాయి. ఒక దశలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వీరితో చర్చలు జరిపినప్పటికీ రాజీనామా తప్ప పరిష్కారం లేదని మొరాయిo చడంతో పార్లమెంట్ నడుస్తున్నటువంటి సమయములోనే కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఆ రకంగా ప్రధాన డిమాండ్ తో పాటు మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ యువత దేశంలో ఉన్నటువంటి అనేక ఆరోపణలు అవినీతి ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్రను పోషించడానికి ఉద్యమాలను ఆయుధంగా మలుచుకోవాలని సo సిద్ధమైన విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా దేశ ప్రజలందరిని పట్టిపీడిస్తున్న సమస్య విద్యా వైద్యం నాణ్యమైన స్థాయిలో ప్రభుత్వ రంగంలోనే నిర్వహించబడాలని పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాయని వాదన కూడా బలంగా ఆ పార్టీ దృష్టికి వచ్చినట్లు కొంతమంది ప్రజలు కూడా పార్టీకి ప్రాతినిధ్యం చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచన చేసినట్లు పత్రికల్లో వినబడింది కనబడింది. లక్షలాదిమంది అసమ్మతి నిరసనగళం ఎన్ని శక్తులున్న ప్రభుత్వం ముందు అయినా గెలిచి తీరుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ఎక్కు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో 15వ ఆగస్టు 2026 రోజున ఢిల్లీలోని ఎర్రకోట బురుజుల పై నుండి ప్రధానమంత్రి ఈ దేశంలో మావోయిస్టులను అంతం చేశామని ప్రస్తుతము మేధోపరమైనటువంటి నక్సల్స్ ఇవ్వాళ అసమ్మతి ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని ప్రస్తావిస్తూ వాళ్లను ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఉందని అలాంటి వాళ్లను దిమాగి నక్సల్స్ పేరుతో ప్రస్తావిస్తూ కఠినంగా వ్యాఖ్యానించడం, కేంద్ర ప్రభుత్వ ఆధిపత్య భావనకు నిదర్శనం కాగా అవును అసమ్మతి వాస్తవాలు, ప్రశ్న, ప్రతిఘటన తెలిపే ప్రతి వాళ్లు కూడా నక్సల్స్ అయితే మేము కూడా దిమాగి నక్సల్స్ మే అని మాజీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కేజ్రీవాల్ తో సహా అనేక మంది రాజకీయ నాయకులు మేధావులు ముందుకు వచ్చి ప్రభుత్వానికి సవాలు విసరడం కేంద్ర ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారింది. ఆలోచనకు ప్రశ్నకు ప్రతిఘటనకు తమ డిమాండ్ల సాధనకు పోరాటం చేయక ప్రతి రంగం కూడా సాధించుకున్న సందర్భం లేనేలేదు. అలాంటప్పుడు ప్రశ్నిస్తే నేరస్తులని ది మాగి నక్సలైట్లు అనే పేరుతో శిక్షించడానికి కేంద్రం పూనుకున్నదా? ఇదే వాస్తవం అయితే ప్రజల ఉనికి ప్రశ్నార్థకమేనా? ఎంతోమంది బుద్ధి జీవులు మేధావులను ఈ నేపముతో శిక్షించడానికి కేంద్ర ప్రభుత్వ పన్నాగమా అని మేధావులు ప్రశ్నిస్తూ ఉంటే ఆ వెనువెంటనే అసహనంతో ఉన్నటువంటి యువత ది మాగి నక్సల్స్ పార్టీ పేరుతో ఆవిరిభవించడం చక చకా సాగిపోయినాయి. ప్రజలను అమాయకులుగా బానిసలుగా యాచకులుగా మార్చిన పాలకుల యొక్క కుటిలపన్నాగాలను ఇంకా నా ఇకముందు సాగనివ్వం అనే నినాదంతో ఈ రెండు పార్టీలు కూడా సత్వరమే స్పందించడం సంతోషదాయకం. కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడమే కాదు అందుకు తగిన మూల్యం కూడా చెల్లించుకోవలసి ఉంటుందని మౌళిక డిమాండ్ కోసం ఈసారి పట్టుబట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ప్రధానంగా అసమానతలు అంతరాలు దోపిడీ పీడన వంచన అవమానాలు సంపద కేంద్రీకరణ వంటి వాటి వలన పేదరిక మరీ పెరిగి అన్నార్తులు శరణార్థులకు అంతే లేకుండా పోయింది. ఈ సందర్భంలో ప్రధానంగా సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఉపయోగకరమైనటువంటి విద్యా వైద్యం ప్రైవేట్ రంగంలోకి చేరిపోవడంతో ప్రజలు తమ కొనుగోలు శక్తిని కోల్పోయి మరి పేదరికంలోకి నెట్టు వేయబడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు మనకు తెలుసు. ఈ దుస్థితి నుండి రక్షించుకోవాలంటే అసమానతలు అంతరాలను తొలగించాలంటే సంపదను భూమిని అందరికీ సమానంగా పంచుకునే వ్యవస్థ రావాలంటే ప్రజలు ఆరోగ్యంగా చైతన్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అందుకు ప్రధాన కారకాలైనటువంటి ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రజలకు అందుబాటులోకి చట్టబద్ధంగా తీసుకువస్తే, బడ్జెట్లో కొటారి సూచించినట్లుగా హెచ్చు నిధులను కేటాయించగలిగితే, రాబోయే రోజుల్లో పేదరికాన్ని కొంతవరకైనా అధిగమించి మానవాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ దిమాగీ నక్సల్స్ పార్టీ ఇంకా చట్టబద్ధంగా చట్టపరిధిలో పోరాడుతున్నటువంటి యువత ప్రధానంగా ఈ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచి దేశవ్యాప్తంగా అవినీతికి ఆస్కారం లేనటువంటి నూతన వ్యవస్థను ఆవిర్భవింప చేసే క్రమంలో అంతిమంగా సమసమాజాన్ని స్థాపించే దిశగా కదలాలని ఈ ఉద్యమ పార్టీలు ప్రధానంగా యువత నాయకత్వంలో కొనసాగడాన్ని మరొక్కమారు యువతకు మరింత భవిష్యత్తు చేకూరాలని సామాజిక రాజకీయ నిపుణులు ఆశిస్తున్నారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలను యువతకు అందించకుండా నిర్వీర్యము చేస్తూ తమ పబ్బము గడుపుకోవడం వల్లనే నిరాశానిస్పృహలకు లోనైనటువంటి యువత ఈ ఉద్యమాన్ని చేపట్టిందని గుర్తించడం ఇప్పటికైనా పాలకులకు చాలా అవసరం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)