తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ సి.వి ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్.
జిల్లా పోలీస్ కార్యాలయం నుండి హాజరైన ఎస్పి నరసింహ
సైబర్ మోసాల నివారణ పట్ల తీసుకోవాల్సిన చర్యలు, సైబర్ మోసానికి గురైన డబ్బు బాధితుల అకౌంట్ లో రీఫండ్ చేయడం ముఖ్యాంశాలు గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిజిపి సి.వి ఆనంద్ రాష్ట్ర కార్యాలయం నుండి కమిషనర్లు, ఎస్పీల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించినారు. దీని ద్వారా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు త్వరగా నగదు రిఫాండ్ అయ్యేలా బ్యాంక్ అధికారులు, కోర్టు అధికారులతో సమన్వయంగా పని చేయాలి, సైబర్ మోసాలకు గురి కాకుండా ప్రజలను చైతన్య పరచాలి అన్నారు. గతంలో పోలీసు నక్సలిజం లాంటి అనేక సమస్యలను ఎదుర్కొని పని చేసినది, ప్రస్తుత సమాజంలో సైబర్ మోసాలు, డ్రగ్స్ వినియోగం, ఆహార పదార్థాల కల్తీ, రోడ్డు ప్రమాదాలు అనే సవాళ్లు ఉన్నాయి అన్నారు. వీటి నివారణకు పోలీసులు కలిసి కట్టుగా పని చేయాలని డిజిపి గారు అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా ఎస్పి నరసింహ హాజరయ్యారు. జిల్లాలో సైబర్ మోసాల నివారణకు, ప్రజలను చైతన్య పరచడానికి జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక ప్రణాళికను ఎస్పి గారు ఈ సందర్భంగా డిజిపి గారికి వివరించారు. జిల్లా వ్యాప్తంగా సైబర్ మోసాల పట్ల అత్యంత పటిష్టమైన నిఘా ఉంచామని ఆయన తెలిపారు. జిల్లాలో సైబర్ సెక్యూరిటీ టీం పని చేస్తుంది, ప్రతి పోలీసు స్టేషన్ నందు సైబర్ వారియర్ పోలీసులు పని చేస్తున్నారు అన్నారు.
అమాయక ప్రజలను మోసాలకు గురి చేసి ఆర్థిక నష్టం కలిగిస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలను మోసాలకు గురి చేసి ఆర్థిక నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని ఎస్పి హెచ్చరించారు.
సైబర్ మోసాల (Cyber Frauds) బారిన పడకుండా ఉండడానికి ప్రజలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు.
- అపరిచితులు గుర్తింపు వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటిపి, పిన్, సివివి నంబర్స్ చెప్పొద్దు.
- ఫోన్, మెయిల్ కు వచ్చే బ్లూ లింక్స్ అనుసరించి డబ్బులు చెల్లించవద్దు.
- తక్కువ పెట్టుబడికి ఎక్కువ డబ్బు వస్తుంది అంటే నమ్మవద్దు.
- అధికారుల, విఐపి ల ప్రొఫైల్ తో ఉండే సోషల్ మీడియా అకౌంట్స్ నుండి డబ్బు కావాలి, తక్కువ ధరకు ఫర్నిచర్, వాహనాలు ఉన్నాయి అని వచ్చే మెసేజ్ లు నమ్మవద్దు, డబ్బు కట్టవద్దు.
- బ్యాంక్ ఖాతా, సోషల్ మీడియా అకౌంటాకు విభిన్నమైన, కష్టమైన పాస్‌వర్డ్‌లను వాడాలి.
- అన్ని ముఖ్యమైన యాప్‌లకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఆన్ చేసుకోవాలి.
- మీ బ్యాంక్ పిన్ (PIN), పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పకూడదు.
- బ్యాంకు అధికారులు అని చెప్పినా ఓటీపీ (OTP) ఎవరికీ ఇవ్వకూడదు.
- ఎస్ఎంఎస్ (SMS), వాట్సాప్, ఈమెయిల్‌లలో వచ్చే లక్కీ డ్రా, ఉచిత ఆఫర్ల లింకులను అనుసరించవద్దు.
- తెలియని వారు చెప్పిన యాప్‌లను (ఉదాహరణకు AnyDesk, TeamViewer) ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకూడదు.
- డబ్బులు తీసుకోవడానికి క్యూఆర్ (QR) కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం డబ్బులు పంపడానికే స్కాన్ చేయాలి.
- బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉండే ఉచిత పబ్లిక్ వై-ఫైలను వాడుతూ డబ్బుల లావాదేవీలు చేయకూడదు.
- ఆధార్ నంబర్, పాన్ కార్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలను సోషల్ మీడియాలో పెట్టకూడదు.
- బిల్ కట్టలేదు, సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుంది, పార్సిల్‌లో డ్రగ్స్ దొరికాయి, అక్రమరవాణా లో మీ ఫోన్ నంబర్ దొరికింది అంటూ వచ్చే బెదిరింపు కాల్స్‌ను నమ్మి డబ్బులు పంపకూడదు.
- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వచ్చే అతి తక్కువ ధరల ప్రకటనలను చూసి ముందే డబ్బులు చెల్లించకూడదు.