సంతానలేమి సమస్యకు ఆధునిక వైద్యంతో పరిష్కారం
డాక్టర్ గరిమెళ్ల సీత
సూర్యాపేట:- మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి కారణంగా ప్రస్తుత సమాజంలో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయని, అయితే అత్యాధునిక వైద్య విధానాల ద్వారా ఈ సమస్యలను అధిగమించి సంతాన సాఫల్యత సాధించవచ్చని ప్రముఖ సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు డాక్టర్ గరిమెళ్ల సీత పేర్కొన్నారు. భూన్ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం విజయవంతమైన సందర్భంగా, పట్టణంలోని ట్రిపుల్ ఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంతాన సమస్యలతో బాధపడుతున్న నిరుపేద, మధ్యతరగతి దంపతులకు భరోసా కల్పించేందుకే ప్రత్యేకంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, ఎంతోమంది దంపతులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు, నిపుణుల ద్వారా అవగాహన, మార్గదర్శనం అందించామని ఆమె వివరించారు. సంతాన సమస్యలు ఉన్నవారు ఎలాంటి సంకోచం లేకుండా సరైన సమయంలో నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆమె సూచించారు. భూన్ ఐవిఎఫ్ ఎల్లప్పుడూ బాధితులకు మానసిక స్థైర్యాన్ని నింపుతూ, అధునాతన సాంకేతికతతో కూడిన నాణ్యమైన చికిత్సను అందుబాటు తక్కువ ఖర్చుతో అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వైద్య బృందానికి, సిబ్బందికి, సహకరించిన స్థానికులకు ఆమె అభినందనలు తెలియజేశారు. ఈ విజయోత్సవ సభలో వైద్య సిబ్బంది, చికిత్స ద్వారా లబ్ధి పొందిన పలువురు దంపతులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.