తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల అంతరంగం ఎలా ఉండాలి

Feb 22, 2025 - 19:02
Feb 22, 2025 - 19:04
 0  1

తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల అంతరంగం ఎలా ఉండాలి ?*ఉపాధి మాత్రమే కాదు సామాజిక మార్పుకు తోడ్పడే

భావజాలం, నైపుణ్యం పెంపొందించుకోవడమే ముఖ్యం.

--- వడ్డేపల్లి మల్లేశం 

  వ్యక్తి నిర్మాణంతో సంఘపటిష్టత తద్వారా భావి సవాళ్లను అధిగమించగలిగే మానవ వనరులను తయారు చేసుకోవడం ద్వారా జాతిని పటిష్టంతో పాటు వివిధ రంగాల నిపుణులను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ప్రాణం లేని వస్తువులు రెండవ, మూడవ శ్రేణి ముడి సరుకులు ఇతర నిత్యావసర నిర్మాణ వివిధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయడానికి కర్మాగారాలు కీలకం. ఇక్కడ ఆయా రంగాలకు సంబంధించిన నిపుణుల ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారంగా కార్యాచరణ ప్రారంభమై వస్తు ఉత్పత్తి సాధ్యమవుతుంది. అలాగే దేశానికి ఉపయోగపడే స్థాయిలో సామర్థ్యము కలిగిన వ్యక్తులను నిర్మాణం చేయడానికి మాత్రం అనేక అవకాశాలతో పాటు విద్యా వ్యవస్థ ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుకే సామాజికవేత్తలు నిపుణులను భిన్న రంగాలకు చెందిన వారితోపాటు ప్రతి వ్యక్తిని కూడా సమర్థవంతంగా తీర్చి దిడ్డడానికి తోడ్పడే వ్యవస్థ విద్యారంగమని విద్యాసంస్థలు మానవ వనరులను తగిన రీతిలో మలిచే పరిశ్రమలని వక్కాణిస్తూ ఉంటారు. ప్రతి పరిశ్రమ ద్వారా వ్యర్త జలాలు కలుషితాలు ఉత్పత్తి అవుతూ ఉంటే వాటిని తిరిగి పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా ఇటీవల కొనసాగుతున్న వేల కాలుష్యాన్ని కొంతవరకు అదుపుకు ప్రయత్నం జరుగుతున్నది.అయినప్పటికీ ఒక దశలో దుబారా పదార్థాలను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మండించడం ద్వారా

ఆ వస్తువులు చెత్తాచెదారం లేకుండా చేస్తున్నాము కావచ్చు కానీ మరొక రకంగా గాలి కాలుష్యం అవుతున్న విషయాన్ని గమనించాలి. అలాగే మానవ వనరులను తీర్చిదిద్దే కర్మగారాలైనటువంటి విద్యాసంస్థలు అవి ఏ స్థాయిలో ఉన్న మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. వివిధ స్థాయిలలో ఉండే విద్యార్థులు అధ్యయన అంశాలు పాఠ్యాంశాలను ఆకలింపు చేసుకునే క్రమంలో తేడాలు ఉంటాయి అంతేకాకుండా అంగవైకల్యము, మానసిక ఏకల్యము, పేదరికం వల్ల, కొన్ని రకాల వెనుకబాటు కారణంగా కూడా కొంతమంది చదువును సరైన స్థాయిలో అభ్యసించే అవకాశం లేకపోవచ్చు. విద్యాసంస్థలలో కూడా మౌలిక సౌకర్యాలు, అవకాశాలు, ప్రభుత్వ ద్వారా సరఫరా అయ్యేటటువంటి వస్తు సామాగ్రి,నిధులు సరైన స్థాయిలో అందుబాటులో లేని కారణంగా కూడా విద్యార్థుల యొక్క అభ్యసనంలో కొంత వెనుకబాటు రావడానికి కారణం అవుతున్నది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కొఠారి కమిషన్ తన నివేదికలో కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం నిధులను కేటాయించాలని 58 ఏళ్ల క్రితమే ప్రభుత్వాలకు సూచించినప్పటికీ సామాజిక స్పృహ లేని ప్రభుత్వాలు పాటించని కారణంగా కూడా సమాజానికి ప్రతిబింబమైనటువంటి పాఠశాలలు బోసిపోతున్నాయి. తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. ఆ రకంగా కూడా కొంతమంది చదువుకు దూరం అవుతున్న విషయాన్ని కూడా గమనించాలి. అలాంటివారికి అధ్యయనములో అవకాశం లేకపోవచ్చు కానీ పని అనుభవము ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడానికి అవసరమైనటువంటి సాధారణ పరిజ్ఞానాన్ని అందించడం సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా కొందరిని తీర్చిదిద్దడానికి వ్యర్థ జలా ల మాదిరిగా వ్యర్థం చేయకుండా ప్రధాన స్రవంతిలో కలుపుకుపోవడానికి ప్రభుత్వము విద్యావ్యవస్థతోపాటు ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే భిన్న మనస్తత్వాలు రకరకాల ఆర్థిక పరిస్థితులు మానసిక స్థాయిల లో ఉన్నటువంటి విద్యార్థులను ఆకలింపు చేసుకొని వారి కనుగుణంగా చర్యలను తీసుకోవడానికి బోధనా అభ్యసన ప్రక్రియను కొనసాగించడానికి ఉపాధ్యాయ బృందం తమదైన శైలిలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రకటించవలసి ఉంటుంది.

ఉపాధిగా చూడవద్దు! సామాజిక చింతన, విప్లవాత్మక భావజాలం, ప్రశ్నించే ధోరణి అద్భుతాలు సృష్టిస్తాయి:-

తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల అంతరంగం కీలకమైన అంశం ఉపాధ్యాయ బాధ్యత అనేది ఒక ఉద్యోగంగా, ఉపాధిగా, బతుకుదెరువుగా భావిస్తే ప్రయోజనం శూన్యం అవుతుంది .అయితే నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన సిలబస్ ద్వారా పరీక్షించి ఉపాధ్యాయ ఎంపికను చేస్తున్నారు కానీ అది అకాడమిగ్గా పాఠ్యాంశాల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. ఉపాధ్యాయుల అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనధోరణి, సమయస్ఫూర్తి, ప్రజా సంబంధాలు, సామాజిక చింతన, మార్పునుకోరే భావజాలం, నైపుణ్యాలు, వైఖర్లను నిర్మించే దృఢ సంకల్పము, కార్యదీక్ష ఇవన్నీ అదనంగా ఉపాధ్యాయులు సమకూర్చుకోవలసి ఉంటుంది. వీటిని పెంపొందించుకొనకుండా అభ్యసన అంశాలు పాఠ్యాంశాలు అధ్యయనము ద్వారా మాత్రమే రేపటి సవాళ్లను అధిగమించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం అసంభవం అవుతుంది". అందుకోసం "ఉపాధ్యాయులు తమ అంతరంగాన్ని తాము ఎంచుకున్న ఆదర్శ ధోరణికి అనుగుణంగా నిర్మించుకోవాలి. సమాజాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న సందర్భంలో అందుకు విఘాతం కలిగించే శక్తులు విద్యారంగాన్ని ఆటంకపరుస్తుంటాయి. రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కూడా పాఠశాలల్లో మత దొరనులను చొప్పించి శాస్త్రీయ వైఖరులను ఆలోచన ధోరణిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ తన పటిష్టమైనటువంటి ఆలోచన సరళిని ఏమాత్రం కోల్పోకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం వ్యవస్థను రూపొందించే క్రమంలో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక శైలిని, సామాజిక పోకడలను కూడా విద్యార్థులకు పరిచయం చేయవలసి ఉంటుంది. "భవిష్యత్తు సవాలను అధిగమించే విధంగా వారిని తయారు చేయాలనుకున్నప్పుడు సంఘర్షణలను నివారించే సాధకులుగా విద్యార్థులను చూడాలనుకుంటే ప్రశ్నించి, ప్రతిఘటించి, తమ హక్కులను సాధించుకునే విధంగా ప్రజలకు తమ మద్దతును తెలపడానికి పాఠశాల పునాది కావలసి ఉంటుంది". శాస్త్రీయ వైఖరికి భిన్నంగా, పురోగా మి ఆలోచనలకు దూరంగా, మార్పును వ్యతిరేకించే వ్యక్తులుగా, వ్యవస్థ పట్ల నిర్లిప్త కలిగిన వాళ్లు గ నుక ఉపాధ్యాయులుగా కొనసాగితే విద్యా లక్ష్యాలను సాధించలేము. విద్యా లక్ష్యాలు జాతీయ ప్రయోజనాలలో భాగమైనప్పుడు దేశాభివృద్ధికి దోహదపడే బదులు తిరోగమన మార్గంలో పయనిస్తే అందుకు ఉపాధ్యాయులు కూడా తమ వంతు బాధ్యత వహించవలసి ఉంటుంది. తన అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా, కుటిల కుచ్చిత అభిప్రాయాలను కలిగి ఉంటే, మార్పును వ్యతిరేకించే వాళ్ళు అయితే ఉపాధ్యాయులుగా పనికిరారు." అందుకే ఉపాధ్యాయ బాధ్యత అనేది సామర్థ్యానికి సామాజిక చింతనకు విప్లవాత్మక మార్పులను ఆశించే క్రమానికి సంబంధించినది కానీ బతుకు తెరువు కోసం కాదు. మూసధోరణిలో వ్యవహరించే వాళ్ళు విద్యారంగంలోకి వస్తే అంతే స్థాయిలో నష్టం కూడా చవి చూడవలసి ఉంటుంది. ప్రస్తుతము విద్యారంగం విఫలం కావడానికి ప్రభుత్వ బాధ్యత తో పాటు ఉపాధ్యాయుల యొక్క వ్యక్తిగత ఆలోచన సరళి సమయస్ఫూర్తికి సామాజిక పరిణతికి ప్రజా సంబంధాలకు అనుకూలంగా లేకపోవడం వల్లనే అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ వైపుగా అడుగులు వేస్తారు. ఉపాధి కావాలనుకుంటే ఇతర ఉద్యోగాలు పనిచేస్తాయి కానీ ఇతర ఉద్యోగాల మాదిరిగా సమయానికి వచ్చి రికార్డులను సరిచూసి పెండింగ్ పనులను పూర్తి చేసి రాత పని కి మాత్రమే పరిమితమైనట్లు చేస్తే విద్యారంగం నివ్వెర పోతుంది. ఆ స్థాయిలో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఆలోచించుకోవడం ద్వారా విద్యా లక్ష్యాల యొక్క సాధన ప్రాధాన్యతను గుర్తించి తమ భావజాలాన్ని ప దునైన కోణంలో నిర్మించుకుంటే ఎవరితోనైనా సవాలు విసరడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమాజాన్ని పాఠశాలలోకి పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్లి క్రమంలో అనేక సందర్భాలలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించవలసి ఉంటుంది. ఇదంతా పాఠ్యాంశాలలో కానీ శిక్షణలో కానీ ఉండకపోవచ్చు త మదైన శైలిలో సమయస్ఫూర్తితో వ్యవహరించవలసిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. ఈ సూచనలు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు మాత్రమే కాదు సుమా! కాలానుగుణంగా మార్పును ఆహ్వానించే ప్రతి ఒక్కరు, సర్వీసులో కొనసాగుతున్న వాళ్లు, అవసరమైతే సర్వీసు నుండి నిష్క్రమించి రిటైర్డ్ అయిన వాళ్లు కూడా తా ము ఎంచుకున్న రంగంలో లేదా తమకు నైపుణ్యం ఉన్న అంశంలో కృషి చేయడానికి అందరికీ పని చేస్తాయి." పోటీ ప్రపంచంలో అందుకోకపోతే అందనంత దూరంలో వెనుకబడి పోతాం అప్పుడు వ్యవస్థను నిర్వీర్యం చేసిన దోషులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రజల చెమటనువేతనరూపంలో పొందుతున్నవారిగా స్వార్థం, ఆదాయం కోసం బాధ్యతను మరిచి మొక్కుబడిగా వ్యవహారిస్తే సమాజం ముందు దొషులుగా మిగిలిపోయే ప్రమాదo వుంది. ప్రపంచంలో అన్ని రంగాల్లో టీచర్లు ప్రథమ స్థాయిలో నిలవడానికి కారణం ఉపాధ్యాయ వృత్తి,బాధ్యత, దాని ప్రాధాన్యత, సమాజం పైన చూపే ప్రభావం వల్లనే అని అర్థం చేసుకుంటే ఏ చిక్కు ఉండదు. సమాజానికి దారి చూపే స్థాయిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు వీలైన మేరకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండడం అవసరమని గుర్తిస్తే మంచిది."

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333