తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలి
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
తక్కువ సాగు భూమిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను మహిళా రైతులను సాగు చేసే విధంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శక్తిలో పాడి గేదెలు, చేపల పెంపకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆక్వా మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొరమేను చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా రైతులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,మిల్క్ యూనిట్లు, పెరటి కోళ్లు పెంపకం,చేపల పెంపకం, పుట్టగొడుగుల నిర్వహణ వంటి వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ప్రభుత్వం వీటి విషయంలో మహిళలను మరింతగా ప్రోత్సహిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని అన్నారు. మహిళా రైతులు తక్కువ సాగు భూమిలో తక్కువ పెట్టుబడులతో మునగ, అజోల్ల, వెదురు,ఆక్వాసిస్టం, తేనె, బాతుల పెంపకం వంటివి చేపట్టి అధిక ఆదాయాన్ని పొందాలని అన్నారు. జిల్లాలో రైతులను వ్యవసాయ పరంగా ప్రోత్సహించేందుకు సరికొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. మహిళారైతులు కూడా వ్యవసాయ సాగులో సరికొత్తగా ఆలోచన చేయాలని చెప్పారు. పంటలకు విపరీతమైన పెట్టుబడులు పెట్టి నష్టపోయే బదులు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విద్యాచందన,లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి, నాబార్డు,వ్యవసాయ శాఖ, ఆర్టికల్చర్ అధికారులతో పాటు,సెర్ప్ డిపిఎంలు, మండల సమైక్య అధ్యక్షురాళ్లు, మహిళా రైతులు పాల్గొన్నారు....