ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకునే సంఘవిద్రోహక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం

ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Sep 6, 2024 - 18:31
 0  1
ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకునే సంఘవిద్రోహక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం

నిన్న కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు ఆదివాసీ సాయుధ సభ్యులు చనిపోయారు. వీరి చావుకి  మావోయిస్టు కేంద్ర మరియు రాష్ట్ర నాయకులే కారణమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తమ కార్యాలయం నుండి ఈ రోజు ఒక ప్రకటనను విడుదల చేశారు.మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు చత్తీస్గడ్ రాష్ట్రంలోని సురక్షిత ప్రాంతంలో తలదాచుకుంటూ అమాయకులైన క్రింది స్థాయి కేడర్ ను ప్రగతి పథంలో ముందున్న తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి పావులుగా వాడుకుంటున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల సంక్షేమం,అభివృద్ధి కొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను పొందుతూ ఆదివాసీ ప్రజలు ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు.బలవంతపు వసూల్లే లక్ష్యంగా చేసుకుని నిషేధిత మావోయిస్టు పార్టీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని తెలిపారు.కాలం చెల్లిన సిద్ధాంతాలతో  అమాయకులైన క్రింది స్థాయి కేడర్ ను రెచ్చగొడుతూ వారి చేతికి ఆయుధాలను ఇచ్చి పోలీసుల పైకి ఉసిగోల్పి వారి ప్రాణాలను కోల్పోయే విధంగా చేస్తున్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు అమాయకులైన ఆదివాసీ ప్రజలకు అందకుండా చేస్తూ,నిషేధిత సిపిఐ మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారన్నారు.విద్య,వైద్యం,రవాణా వంటి సౌకర్యాలకు వారిని దూరం చేస్తూ,అమాయక ఆదివాసీ యువతీయువకులను బలవంతంగా తమ పార్టీలోనికి చేర్చుకొని వారి చేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ,వారి అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేస్తున్నారని తెలియజేసారు.ఆదివాసీ ప్రజల అభివృద్ధికి దోహదపడే ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తమ స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు క్రింది స్థాయి కేడర్ ను చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలిపారు.

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించి,వారికి జీవనోపాధిని కల్పించే బాధ్యత పోలీస్ శాఖ తీసుకుంటుందని తెలిపారు.ప్రజలు తిరస్కరించిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితాన్ని గడపాలని కోరారు.

కేంద్ర కమిటీ సభ్యుడికి 25 లక్షల రూపాయలు,రాష్ట్ర కమిటీ సభ్యుడికి 20 లక్షల రూపాయలు, జిల్లా కమిటీ సభ్యుడికి 8 లక్షల రూపాయలు,ఏరియా కమిటీ సభ్యుడికి 4 లక్షల రూపాయలను ప్రభుత్వం పునరావాస సహాయం కింద ప్రకటించడం జరిగింది.లొంగిపోయిన వారికి సత్వరమే ఇట్టి నగదును అందజేసి,వారికి ఉపాధి అవకాశాలను కల్పించి,సమాజంలో గౌరవంగా జీవించే విధంగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఈ సందర్బంగా ఎస్పీ తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333