జిల్లా ఆస్పత్రిలో ఉచిత సర్వైకల్ స్క్రీనింగ్ పరీక్షలు
జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల : జిల్లా ఆస్పత్రిలో మహిళలకు ఉచిత సర్వైకల్ స్క్రీనింగ్ పరీక్షలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు 144 మంది మహిళలు ఈ పరీక్ష చేయించుకోగా, ఐదుగురికి పాజిటివ్, పది మందికి అబ్నార్మల్ గా తేలడంతో వారిని హయ్యర్ సెంటర్ కు రిఫర్ చేశారు.
ఆస్పత్రిలోని రూమ్ నెంబర్ 11లో ఈ పరీక్షలు చేస్తున్నారు. పరీక్ష చేయించుకున్న ప్రతి ఒక్కరికీ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్ కోరారు. ఆశా కార్యకర్తలు గ్రామాల్లోని మహిళలను జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి స్క్రీనింగ్ చేయించాలని సూచించారు.