చదువు వచ్చిన వాళ్ళు పుస్తకాలు సాహిత్యం చదవడం లేదు

Sep 13, 2024 - 09:36
Sep 25, 2024 - 15:04
 0  11

చదువు రాని వాళ్ళు, శ్రమజీవులు  ఉత్పత్తిలో భాగస్వాములు కావడం వల్ల  చొరవ చూపలేకపోతున్నారు ."* సాహిత్య అధ్యయనము పరిశీలన పరిశోధనతోనే సామాజిక మార్పు సాధ్యం.
ఈ సంఘర్షణ కొనసాగవలసిందేనా ?*
---*************
---- వడ్డేపల్లి మల్లేశం 

----సామాజిక మార్పుకు దోహదపడని ఏ అంశమైనా  నిరర్థకం  ఈ విషయాన్ని  మానవ జీవితానికి అన్వయించుకున్నప్పుడు  మనం చేసే ప్రతి పనిలో నవ్యత నాణ్యత తో పాటు సామాజిక చింతన  అంతిమంగా సమసమాజ ఉన్నతికి దారి తీయగలిగిన పరిస్థితులు కనిపించాలి.  మొక్కుబడి వ్యాపకాల వలన అనేకమంది తమ జీవితాలను కొనసాగిస్తూ లక్ష్యం, ఆదర్శం, ఆకాంక్షలు, ఆచరణ లేకుండా  కాలం గడుపుతున్న తీరు  ఆలోచిస్తే ఆందోళన కలగక మానదు . వృత్తులు ప్రవృత్తులు  సమాంతరంగా  కొనసాగవలసిందే వీటికి అదనంగా  వీలైన మేరకు సమయాన్ని కేటాయించుకుని  సామాజిక మార్పుకు దోహదపడే విధంగా మన కార్యక్రమాలను రూపొందించుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తి పైన ఉన్నది.  కొందరు స్తబ్దంగా, కొందరు మానసిక వికలాంగులుగా,  మరికొందరు అచేతనంగా , ఇంకొందరు బాధ్యతారాహిత్యంతోపాటు  సమాజం పట్ల వ్యతిరేక దృక్పథంతో  ఉంటున్న కారణంగా ఈ వ్యవస్థ ఊహించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. తద్వారా  సమాజం ఎదుగుదలకు అనేక ఆటంకాలు చోటు చేసుకుంటున్నాయి.  శ్రమ చేసి ఉత్పత్తులు పెంచే వాళ్ళు సే వారంగంలో పనిచేసే వాళ్లు  తమ ఆలోచనతో  నూతన పరికల్పనలకు శ్రీకారం చుట్టే వాళ్ళతో పాటు  అదనంగా శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక సాహిత్య రంగాలను  పరిపుష్టి చేయవలసిన బాధ్యత కూడా సమాజంలోని భిన్న వర్గాల పైన ఉన్నది.  దీనికి అక్షరం ఆయుధమైతే  ఆ ఆయుధంతో  అన్వేషణ ప్రారంభించి  ప్రాపంచిక దృక్పథంతో  విషయ పరిజ్ఞానాన్ని విస్తృతంగా సo పాధించవలసిన అవసరం ఉంది.  సాధించిన విజ్ఞానాన్ని  రంగాల నిపుణులు తమకు నచ్చిన రీతిలో  ఎన్నుకున్న  అంశానికి అనుబంధంగా  వినియోగించుకొని  కొత్త అంశాలు సూత్రీకరణలు ప్రతిపాదనలకు  ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా  భిన్న రంగాలనుసామాజిక బాధ్యతతో పరిపుష్టి చేయడం వలన ఈ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతున్నది  .
     పైన తెలియజేసిన కృషి అంతా ఒక పార్శ్వం మాత్రమే.  ముఖ్యంగా సాహిత్య సామాజిక సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్న వాళ్లు  తమ అనుభవాలు పరిశీలనా పరిశోధన క్షేత్ర పర్యటనల ద్వారా  సృష్టించిన సాహిత్యము పుస్తకాలు పత్రికలు వివిధ   ప్రక్రియలలో నిక్షిప్తమైన సారాంశాన్ని  సమాజంలోని చదువుకున్న భిన్న వర్గాలు నిరంతరము అధ్యయనం చేయడం ద్వారా  పాఠకులుగా మహాపాటకులుగా ఎదిగి తాము కూడా రచయితలుగా మారినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ మరింత వేగంగా  పురోగమిoచే ఆస్కారం ఉంటుంది. అక్షరాస్యత కలిగిన వాళ్లు మాత్రమే చదవడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ చదువుకున్న వాళ్లు కూడా చదవడానికి సిద్ధపడకపోవడం, బద్ధకము, నిర్లక్ష్యము,  బాధ్యతారాహిత్యం వలన ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని చదువుతున్న వారి శాతం సుమారుగా 10% కూడా దాటడం లేదని భాషావేత్తలు  సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి సమాజంలోని భిన్న వర్గాలు గమనించాలి .దీనిని సీరియస్ గా తీసుకొని  చదవడానికి ప్రయత్నం చేయాలి  .రచయితలుగా రాసిన సాహిత్యాన్ని చదవడం ద్వారా  ప్రజలు పాఠకులు వివిధ వర్గాల వాళ్ళు చైతన్యమై తమ అనుభవాలు జ్ఞాపకాలను సమాజంలో భిన్న పరిస్థితులలో క్షేత్రస్థాయిలో  వ్యక్తం చేయడానికి చర్చల్లో పాల్గొనడానికి  ఇతరులకు అందజేయడానికి అవకాశం ఉంటుంది.  .అందుకే "పత్రికొక్కటు న్న పదివేల సైన్యంబు పత్రిక ఒక్కటున్న మిత్రకోటి పత్రిక లేకున్న ప్రజకు రక్ష లేదు నవయుగాల బాట నా ర్ల మాట" అని  ప్రముఖ పత్రిక రచయిత నార్ల వెంకటేశ్వరరావు ఏనాడో చేసిన హెచ్చరిక  మనందరినీ నిరంతరం తట్టి లేపవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.  వెసులుబాటు, అవకాశం, ఆదాయం   అంతకుమించి సంపన్న వర్గాలకు చెందినటువంటి  విద్యావంతులే సాహిత్యాన్ని పుస్తకాలను అధ్యయనం చేయడానికి సిద్ధంగా లేకపోవడం  నిర్లక్ష్యం వహించడం బాధ్యతారాహిత్యమే .ఇది ఒక రకంగా జాతికి జరుగుతున్న ద్రోహం గా భావించవలసిన అవసరం ఉంటుంది  .తల్లిదండ్రులు చదవడంతో పాటు తమ పిల్లలకు కూడా సాధారణ పరిజ్ఞానాన్ని అందించడానికి సాహిత్యానికి సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను  చదివే అలవాటును పెంపొందించడం ద్వారా  పాఠ్యాంశాలతో పాటు సహా పాట్య అంశాలను కూడా  నేర్పినట్లైతే తమ బావి జీవితములో సవాళ్లను అధిగమించడానికి అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని ప్రతిభను  పెంపొందించుకునే అవకాశం ఉంటుంది .
        ఈ సంఘర్షణ తొలగేది ఎలా?
*********
  ఈ దేశంలో  ఉత్పత్తి ఎంత ముఖ్యమో అంతే స్థాయిలో  సేవా దృక్పథం తో పాటు  సామాజిక చింతనతో సమ సమాజ నిర్మాణం వైపు వ్యవస్థ నెట్టుకు రావడానికి  జరగవలసిన కృషి కూడా అంతే ముఖ్యం.  ఆ విషయంలో సాహిత్యం అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో  సాహిత్యాన్ని అధ్యయనం చేసే వాళ్లే కరువైనప్పుడు  దాని రుచి భావితరాలకు తెలియకపోతే  భవిష్యత్తు అంధకారమే కదా!  అధ్యయనము పరిశీలన  నిరంతరము జరగాల్సిన సందర్భంలో  విద్యావంతులు మేధో   రంగాలలో పనిచేస్తున్న వాళ్లే చదవడానికి బద్దకించి దూరంగా  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సందర్భంలో  నేడు మన ముందున్నటువంటి వివిధ రూపాలలో ఉన్న పుస్తక పరిజ్ఞానాన్ని భవిష్యత్తుకు అందించడానికి అవకాశం ఉండదు కదా!  ప్రస్తుత పాఠకులే రచయితలై భవిష్యత్తు తరాలకు తమ రచనలు అందించవలసిన బాధ్యతను కలిగి ఉండి  చదవడానికి  సిద్ధంగా లేక  దాటవేసే దో రని అవలంబించడం క్షమించరాని నేరం.  మరొకవైపు శ్రమజీవులు, కూలీలు ,కార్మికులు ,వలస జీవులు, రైతులు,  ఆదివాసీలు మెజారిటీ ప్రజానీకం  అక్షరాస్యతకు అంతో ఇంతో దూరమైనా...  ఉత్పత్తిలో మాత్రం భాగస్వాములై  సేవా రంగాన్ని పరిపుష్టి చేయడంతో పాటు మనకు తిండి పెడుతున్న సందర్భాన్ని  దేశ అభివృద్ధికి బాటలు వేస్తున్న విషయాన్ని మనం మరవకూడదు  .కానీ ఈ వర్గం  వెసులుబాటు లేక చదువు రాక  ప్రస్తుతం సాహిత్యాన్ని అధ్యయనం చేయలేకపోవడం జరుగుతున్న ఒక లోపం  అయినప్పటికీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు  చదవకపోవడం అవకాశము లేని వర్గాలు  చదువుకు దూరంగా ఉండడం  రెండింటి కారణంగా సాహిత్య అధ్యయనం క్రమంగా మరుగున పడిపోయే ప్రమాదం ఉన్నది .ఇది  భవిష్యత్తులో ఒక వర్గ సంఘర్షణకు సంక్లిష్టతకు  భవిష్యత్తు ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉన్నది.  ఈ పరిస్థితులను అధిగమించాలంటే ప్రస్తుతం పాఠశాల కళాశాల విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్న విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు  సాధారణ పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను విధిగా అధ్యయనం చేయించడం ముమ్మరం చేయాలి.  అదే సందర్భంలో గ్రామ గ్రామాన వీధి వీధిలో గ్రంథాలయాలను ప్రారంభించడం ద్వారా  యువత వృద్ధులు మధ్య వయస్సులో ఉన్న వారందరికీ కూడా  పుస్తకాల పఠనాన్ని  తప్పనిసరి చేసే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉన్నప్పుడు  ముమ్మరమైన అధ్యయనం సాధ్యమవుతుంది  .తద్వారా ఎక్కడికక్కడ చర్చలు సంప్రదింపులు  సమాలోచనలు సమీక్షలు అనుభవాలను పంచుకోవడం వంటి  తాత్విక  కార్యక్రమాల వలన  పుస్తకాలలో నిక్షిప్తమై ఉన్న సాహిత్యమంతా సమాజము నిండా విస్తరిల్లుతుంది. తద్వారా సమాజం అభివృద్ధి దిశగా వర్ధిల్లుతుంది.   ఈ రకమైన లోటు  భర్తీ చేసే క్రమంలో సాహిత్య అధ్యయనాన్ని కనీసం 75 శాతానికి పెంపొందించడం ద్వారా  వీధి వీధినా వాడ వాడలా రక రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచే బృహత్ కార్యక్రమానికి ప్రభుత్వం సామాజిక సంస్థలు  గ్రంథాలయ సంస్థ  విద్యావంతులు కృషి చల్పడం ద్వారా  పాఠకుల నోళ్ళల్లో సాహిత్యం నిరంతరం నానుతూ ఉండాలి . అప్పుడు కొత్త పలుకు ఉద్భవిస్తుంది ఆ పలుకు మార్పుకు దోహదపడుతుంది  అంధ విశ్వాసాలు  అనాగరికత  అస్పృశ్యత  మూఢాచారాల నుండి  ఈ సమాజాన్ని నిత్య నూతనమైన చైతన్యం వైపుగా  తీసుకు వెళ్ళవచ్చు  సూర్యోదయంతో  వెలుతురులోకి విశ్వం ప్రవేశించినట్టు  సాహిత్య అధ్యయనo ముమ్మరం చేయడం ద్వారా  మరో ప్రపంచం లోకి అడుగు పెట్టే అవకాశం తో పాటు  పీడన, వంచన, దోపిడీ, వివక్షత, అసమానతలు, అంతరాలను  చైతన్యవంతంగా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది .
( వ్యాసకర్త సామాజిక  సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచ యిత  ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333