ఘనంగా బి ఎల్ ఓ లకు సన్మానం
తిరుమలగిరి 29 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు నమోదు, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడంలో బూత్ లెవల్ అధికారులు (బిఎల్వోలు) కీలక పాత్ర పోషిస్తున్నారని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ తిరుమణి యాదగిరి కొనియాడారు. మున్సిపాలిటీలోని మాలిపురం పరిధిలో గల 308 మరియు 309 పోలింగ్ బూతులలో బిఎల్వోలుగా విధులు నిర్వర్తించిన మద్దూరి ఉమేష్, చింతకాయల పరుశురాములు తమ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వార్డు కౌన్సిలర్ తిరుమణి యాదగిరి నివాసంలో వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి, సన్మానించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ యాదగిరి మాట్లాడుతూ.. ఎండనక, వాననక ప్రతి ఇంటికీ తిరుగుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలో బిఎల్వోలు చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ ఇలాగే బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు జంపాల భిక్షం, మామిడాల వెంకటేశ్వర్లు, ఈశ్వర చారి, సోమన్న తదితరులు పాల్గొని, విధులను విజయవంతంగా పూర్తి చేసిన బిఎల్వోలను అభినందించారు.