కేబీఆర్ ఉద్యానవనంలో నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు ఒకటి బయటపడింది
జూబ్లీహిల్స్ : కేబీఆర్ ఉద్యానవనంలో నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు ఒకటి బయటపడింది. ఉద్యానంలో నడకకు వచ్చే పలువురు అటుగా సాగుతున్న క్రమంలో దీనిని గుర్తించారు. సంబంధిత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. నిజాం తన కార్లు, ట్రక్కులు ఇతర మోటారు యంత్రాలలో ఇంధనం నింపేందుకు దీనిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. రాజు అల్లూరి అనే వ్యక్తి ఈ పెట్రోల్ పంపు చిత్రాలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లూ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్ పంపు వేసవి కావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది. గత సంపదకు ఇదే సాక్ష్యం అంటూ రాజు అల్లూరి తన ఖాతాలో పేర్కొన్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ కనిపించడంతో ఇప్పుడు ఇక్కడి పెట్రోల్ పంపును చూడటానికి నడకదారులు ఆసక్తి చూపుతున్నారు.