ఉపాధ్యాయులు రావడం లేదని విద్యార్థుల ఆందోళన..
జోగులాంబ గద్వాల 24 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నా.. ఉపాధ్యాయులు లేక బోధన సక్రమంగా సాగడం లేదని సోమవారం ధరూర్ మండలం ఓబులోనిపల్లి గ్రామం మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు.వివరాల్లోకి వెళితే ధరూర్ మండలం ఓబులోనిపల్లి మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 100 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 100 మంది విద్యార్థులకు హెచ్ఎంతో పాటు మరో ఉపాధ్యాయుడు ఉన్నాడు. కొన్ని నెలలుగా హెచ్ఎం లీవ్ లోకి వెళ్లడంతో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడితో గత విద్యా సంవత్సరం విద్యార్థుల చదువులు అంతంతే ముందుకు సాగినాయి.
గతంలోనే ఉపాధ్యాయుల సమస్యల పై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు. ఫలితంగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమై పదిరోజులకు కావొస్తున్న ఒక ఉపాధ్యాయుడితోనే పాఠాలు బోధిస్తున్నారు. ఆ ఒక్క ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోతే తమ పిల్లల చదువులు ఎలా సాగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు బడులు మానేసి పత్తి చేనులో పనికివెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.