మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా?

స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛగా ఎవరి ఒత్తిడి లేకుండా మానవత్వ విలువలతో తోటి మనిషిని మనిషిగా చూసి కుల మత వర్ణ వివక్షత లేకుండా తన జీవన విధానాన్ని ఇతరులకు హక్కులకు భంగం కలగనట్టి పరిస్థితులలో జీవించడమే స్వాతంత్రం వచ్చినట్టు లెక్క
"మహిళలు అర్థరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే ఎటువంటి సంకోచం లేకుండా, స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్లు లెక్క" అని మహాత్మా గాంధీ అన్నారు
ప్రస్తుతం అర్ధరాత్రి కాదు పగటి పూట తిరగడానికి మహిళలకు భద్రత లేదు ఏ వైపు నుండి ఏ మగ మృగము కాటేస్తుందో, ఏ వైపు నుండి దుండగులు వచ్చి అత్యాచారం చేస్తారో ఏ సమయాన కిడ్నాప్ చేస్తారో అనే భయంతో "దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు" గా మహిళ బతుకుతున్నది. స్వాతంత్ర్యం కేవలం కొందరికే వచ్చింది. తెల్లవారి నుండి నల్ల వారి చేతిలోకి వచ్చింది అంతే తప్ప సాధారణ ప్రజానీకానికి ఒరిగిందేమి లేదు. వారి బ్రతుకులు మారింది లేదు వారి కష్టాలను దోచుకునే వర్గ ప్రయోజనాలకే ఈ స్వాతంత్రం పనికి వస్తున్నది. ఇప్పటి ప్రభుత్వాల కన్నా తెల్లవారి ప్రభుత్వమే బాగుండేది. తెల్లవారి ప్రభుత్వంలో చాలా మూఢాచారాలు నిర్మూలించబడ్డాయి. కానీ మన ప్రభుత్వం మత మౌౌఢ్యంలోకి, మూఢాచారాలలోకి నెట్టేస్తున్నారు.
దేశభక్తి అంటే..........
దేశమునందు భక్తిని చూపెట్టడం భక్తి అంటే దేవుని యందు చూపెట్టు భక్తి కాదు. దేశంలోని ప్రజల మీద చూపెట్టే భక్తి ప్రజా సంక్షేమానికై పాటు పడే తపన ఆరాటం అని అర్థం. దేశంలో అనేక రకాలుగా దేశభక్తి ప్రకటించుకుంటారు కొందరు పేదవారికి దానధర్మాలు చేస్తారు కొందరు పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ ఇస్తుంటారు
కొందరు వృద్ధులకై వృద్ధాశ్రమాలు నెలకొల్పుతారు కొందరు అన్నదానం చేస్తుంటారు ఇది కూడా దేశభక్తి కిందికే వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు అర్థాలు మారిపోతున్నాయి. తమ డాంబికాన్ని చూపెట్టడానికి చేయడం జరుగుతుంది. ఒక్కోసారి అపాత్ర దానం కూడా అవుతుంది. ఏది ఏమైనను ప్రజా సంక్షేమమే ప్రధానం. పేదలకు మూడు పూటలా తిండి, ఒంటినిండా బట్టలు, నివాసయోగ్యమైన ఇల్లు, వైద్యం, విద్య ఇవి సమకూరితే చాలు.
స్వాతంత్ర్య దినము నాడు,గణతంత్ర దినము నాడు నీటుగా బట్టలు వేసుకొని అంగీకి జెండా బొమ్మ తగిలించి జెండాకు వందనం చేయగానే గొప్ప దేశభక్తులమై పోయామని మురిసిపోతున్నాం సంబరపడి పోతున్నాం. కానీ మన పక్కనే ఉన్న, మన తోటి మనిషి, చింపిరి జుట్టుతో, మాసిన తలతో, చిరిగి మాసిపోయిన బట్టలతో, ఉన్న మనిషిని చూసి చూడనట్టుగా వెళ్లిపోయే మనుషులు ఉన్న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఎలా నమ్మమంటారు అన్నమో రామచంద్రా! అని అల్లాడుతుంటే మనకు దేశభక్తి ఉందని అనుకోవడం పెద్ద పొరపాటు.
దేశంలో అందరూ బాగుండాలి. ప్రతి మనిషికి ప్రాథమిక అవసరాలు అయిన కూాడు, గుడ్డ,నివాసం, ఆరోగ్యం, విద్య అందాలి. అప్పుడే మనం దేశభక్తి చూపుతున్నామని అర్థం, ప్రతి మనిషి ప్రశ్నించడం నేర్చుకోవాలి ప్రతి మనిషి సమస్యను విశ్లేషించడం నేర్చుకొని తన ధర్మాన్ని తాను నిర్వర్తించే విధంగా ప్రతి మనిషి ఆలోచించాలి.ఈ దేశంలో పుట్టినందుకు ప్రతివారికి అన్నింటి పై అధికారం ఉంది. సహజ వనరులపై అధికారం ఉంది.తాను బతకడానికి హక్కు ఉన్నది. ఎక్కడనైనా మాట్లాడడానికి ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి కానీ పేదతనం చేత కొందరు మాట్లాడ లేకుండా ఉన్నారు. పేదతనం పోవాలి .అందరూ అక్షరాస్యులు కావాలి.
"పేదవాడి కోపం పెదవికి చేటు"ఇది అక్షరాలా నిజం పేదవాడు మాట్లాడితే కసురుకుంటారు. కోప్పడతారు. నీకేం తెలుసు అంటారు. నీకేం తెలియదు పో అంటారు. ఈ దేశానికి ఇంకా పూర్తి స్వాతంత్ర్యం రాలేదు. రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే వచ్చింది. ఇంకా సామాజిక సమానత్వం, సామాజిక బానిసత్వం వదలలేదు. వేల ఏళ్ల నాటి భావ బానిసత్వం ఇంకా చాలామంది మెదళ్ళలో గూడు కట్టుకొని ఉన్నది. చాలా ఊళ్ల లో కుల వివక్ష, మత వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దళితుడు ప్రజానాయకుడిగా ఎన్నికైనా అగ్రకులాల సరసన కార్యాలయాల్లో కూర్చోవడానికి ఇంకా అభ్యంతరాలు వస్తున్నాయి. అగ్రకులాల వారు తమ పక్కన కూర్చోవడానికి ఒప్పుకోవడం లేదు.
ఎంత చిన్న గ్రామమైతే అన్ని మూఢనమ్మకాలు అంత కుల వివక్ష ఉంది. గ్రామాల్లో మత విపక్ష కన్నా కుల వివక్ష అత్యధికంగా ఉంది. అగ్రవర్ణాలకు దళితులంటే చిన్న చూపు. దళితులపై దాడి చేయడం వారిని అవమానించడం చాలా గ్రామాల్లో నిత్య కృత్యంగా మారింది.
ఇంకా దుర్మార్గమైన విషయమేమిటంటే దళిత అమ్మాయిని దేవుని పేరుతో దేవుడికి పెళ్లి చేసి ఊరు మీద వదిలేస్తారు ఇదంతా కేవలం అగ్రవర్ణాల వారి కామ వాంఛ తీర్చుకోవడానికి అన్నది అందరికీ తెలిసిన సత్యం .
రిజర్వేషన్లు లేని వాళ్లంతా రిజర్వేషన్లు ఉన్న వారి మీద పడి ఏడుస్తారు. ఉన్న ఉద్యోగాలన్ని వారికి పోతున్నాయి నాకు ఏది ఉద్యోగాలు రావడంలేదని అంటుంటారు. కానీ అది నిజం కాదు
బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం 10 సంవత్సరాలకు మాత్రమే రిజర్వేషన్లు పెట్టారు.
అది ఆర్థిక స్వతంత్రంతోపాటు సామాజిక న్యాయాన్ని కూడా వాంఛించి రాజ్యాంగాన్ని తయారు చేశారు కానీ నాయకుల కుళ్ళు,
కుట్ర, కుతంత్రాల కారణంగా 10 ఏళ్ల వరకు కూడా ఆర్థిక సామాజిక న్యాయం సాధించలేకపోవడం వల్ల దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు దాటినా కానీ ఇంకా నిమ్న కులాల ఆర్థిక స్వాతంత్ర్యం సామాజిక న్యాయం మెరుగుపడలేదు.యధాతధ పరిస్థితి కొనసాగుతూనే ఉన్నది .
అట్టి వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇది చాలా విచారించదగ్గ విషయం రాను రాను దళితుల్లో నిరాసక్తత నిరాశలు అలుముకుంటున్నాయి. తమకు న్యాయం జరగడంలేదని
కుమిలి పోతున్నారు.ఒకవేళ ఒకరో ఇద్దరో దళితులు ఐఏఎస్ ఐపీఎస్ అయితే వారు కూడా అగ్రవర్ణాల చంక కిందికే వెళ్తున్నారు. కానీ తమ జాతిని,తమ కులాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించడం లేదు చట్టసభల్లో ఎస్సీలకు ఎస్టీలకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తారు వారు మంత్రులు కూడా అవుతారు కానీ వారు కూడా అగ్రవర్ణాధిపత్యమే కోరుకుంటున్నారు.
తాడిత,పీడిత,అణగారిన ప్రజలందరూ ఏకం కావాలి. తమ హక్కులను ప్రశ్నించుకొని ప్రభుత్వం నుండి తీసుకోవాలి తన బాధ్యత నెరవేర్చాలి. హేతుబద్ధమైన ఆలోచనతో,అదే సమయంలో సమాజం పట్ల తన బాధ్యతను కూడా నిర్వర్తించాలి. అప్పుడే సమ సమాజం మనం కోరుకున్న సమాజం, పేదలు లేని సమాజం ఏర్పడుతుంది. .............
అడియాల శంకర్, అధ్యక్షులు,
తెలంగాణ హేతువాద సంఘం.