ఉచిత విద్య, వైద్యం ఏ పార్టీ ఎజెండాలో లేకపోవడం సిగ్గుచేటు
తాత్కాలిక ప్రలోభాలు, వాగ్దానాలు, మద్యం డబ్బుకు
ప్రజలు బానిసలు అయితే రాజ్యాంగ బద్ధహక్కులను
కోల్పోయినట్లే. ప్రలోభాలపై ఈసీ ఉక్కు పాదం మోపాలి.
న్యాయవ్యవస్థ ఒక్కడుగు ముందుకేసి కొరడా జులిపించాలి.
పరిపాలన అంటే వేతనాలు పెన్షన్లు ఇవ్వడం, శాంతి భద్రతలను కాపాడడం , భవనాలు రవాణా సౌకర్యాలు, కార్యాలయాల నిర్వహణ , అసెంబ్లీ పార్లమెంటు సచివాలయాలు, ప్రాజెక్టులు కాలువల నిర్వహణ మాత్రమే కాదు. "దేశ ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుకునే క్రమంలో ప్రజల ఆకాంక్షలను ఆశయాలను డిమాండ్లను పరిష్కరించడం ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవడమే పరిపాలన అవుతుంది". "ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, కొనుగోలు శక్తిని తారా స్థాయికి తీసుకువెళ్లి దేశ సంపదను ప్రజలందరికీ సమానంగా పంచడం, అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన వంచన లేనటువంటి సృద్భావ పూర్త వాతావరణం లో
ప్రజల ఆరోగ్యాలకు భరోసానిస్తూ, భద్రతకు పూర్తి బాధ్యత వహించగలిగే సామాజిక కర్తవ్యాన్ని నిర్వహించే యంత్రాంగమే ప్రభుత్వం" . కానీ నేటి ప్రభుత్వాల పుట్టుకనే అవినీతిలో ప్రారంభం కావడంతో తిరిగి అధికారానికి వచ్చిన తర్వాత అవినీతిపరులకు రక్షణ కోసం, పెట్టుబడిదారుల భద్రత కోసం, నేరస్తుల ప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కనుకనే లోక్సభలో 83% రాజ్యసభలో 36% మంది నేరచరిత్ర ఉన్న సభ్యులు ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు ఎన్నికల్లో అభ్యర్థిత్వం ప్రారంభమైన నుండి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసే లోగా దేశ పరిపాలన యావత్తు ఎన్నికల సంఘం ఆధీనంలోనే ఉంటుంది .అలాంటప్పుడు ఎన్నికల కోడ్ అంటూ ప్రత్యేక నిబంధన ఉల్లంఘిస్తే ప్రత్యేక శిక్షలు ఏ నలేని అధికారాలు ఎన్నికల సంఘానికి ఉన్నప్పటికీ అధికార పార్టీ పట్ల ఒక తీరు, ప్రతిపక్షాల పట్ల మరొక తీరు వ్యవహరిస్తున్న కారణంగా ఎన్నికల్లో పెట్టుబడిదారులు మాత్రమే గెలుపొందుతున్నారు. పేద నీతివంతమైన వర్గాలకు అవకాశం లేకుండా పోతున్నది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆధిపత్య వర్గాలకు మాత్రమే టికెట్లను కేటాయించడం కూడా ఇందుకు మరొక కారణం. అందుకే దళిత అట్టడుగు బీసీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించాలని వ స్తున్న డిమాండ్ను కుల గణన చేయాలని చేస్తున్న పోరాటాన్ని కేంద్రం గత పదిహేళ్లుగా విస్మరించిన కారణంగా కొన్ని వర్గాలు మాత్రమే చట్టసభల్లో అధికార యంత్రాంగంలో పీఠం ఎక్కడం మిగతా వాళ్ళు చట్టసభల గడప దాటకుండా యాచకులుగా బానిసలుగా మారిపోవడాన్ని మనం గమనిస్తున్నాము .
రాజకీయ పార్టీల భరతం పట్టాలి :-
1966 లో కోటా రీ కమిషన్ విద్యకు కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్రప్రభుత్వం 30 శాతం కేటాయించాలని , కామన్ స్కూల్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులలో సమతా భావాన్ని తీసుకురావాలని చేసిన సూచన 60 ఏళ్ల తర్వాత కూడా అమలుకు నోచుకోకపోవడం ఈ దేశ పాలకుల యొక్క నిర్లక్ష్యం అహంకారం కాక మరేమిటి? విద్యా వైద్యం వంటి రెండు అంశాలకే ప్రజల యొక్క కొనుగోలు శక్తి భారీగా ఖర్చు చేస్తున్న కారణంగా అల్పాదాయ మధ్య తరగతి వర్గాలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలను మనం గమనించవచ్చు. చిత్తశుద్ధి లేని నిర్లక్ష్య పద్ధతులలో వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ఇంకా ప్రైవేటుపరం చేస్తున్నాయి తప్ప విద్య వైద్య రంగాలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం లేదు. " కనీసం ఇప్పటివరకు భారతదేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో పాటు కాంగ్రెస్ కూటమి కూడా విద్య వైద్యం సామాజిక న్యాయం తమ ఎజెండా అని నాణ్యమైన రీతిలో ఉచితంగా ప్రజలకు అందిస్తామని భరోసా పిలుపు ఇవ్వకపోవడం, ప్రకటించకపోవడం, మేనిఫెస్టోలో పెట్టకపోవడం సిగ్గుచేటు ". ప్రధానమైన ఈ మూడు రంగాలకు బదులు తాయిలాలు, ఉచితాలు, రాయితీలు, వాగ్దానాలు హామీల పేరుతో ప్రజలను తాత్కాలికంగా భ్రమలకు గురి చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు కూడా ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడంతోనే కాలం గడిచిపోతున్నది కానీ ప్రతిపక్షాలు కూడా నిర్మాణాత్మకమైన ప్రభుత్వం కావాలని కోరుకోవడం లేదు. విద్యా వైద్య రంగాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడం, ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం తమ బాధ్యత అని గుర్తించక పోగా తక్షణమే ఓటర్లు సంతృప్తి పడే వరాలు కురిపించడానికి అలవాటు పడిన రాజకీయ పార్టీల పైన ఎన్నికల సంఘం తన కోడు నిబంధనలలో ఉన్నటువంటి పరిమితి మేరకు ఉచితలపైన అదుపు చేయాలి. ప్రకటించిన రాజకీయ పార్టీలపై కేసులు పెట్టడంతో పాటు అభ్యర్థిని పోటీకి అనర్హునిగా ప్రకటించి ఇసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి.
హక్కులకై కల పడాలి బాధ్యతలకు నిలబడాలి :-
ఉద్యమ ఉద్యోగ వర్గాల నినాదమైనటువంటి హక్కులకై కల బడు బాధ్యతలకు నిలబడు అనే నినాదాన్ని పునికి పుచ్చుకొని ప్రజలు ఓటర్లు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుల కోసం పోరాడాలి. ఉద్యమాల ద్వారానైనా ప్రభుత్వం మెడల్వంచి తమ డిమాండ్లను సాధించుకోవాలి కానీ యాచిస్తే బానిసలుగా మిగిలిపోతే రాజకీయ పార్టీలు స్వా రీ చేస్తాయని తెలుసుకోకపోతే ఎలా? ఇదే సందర్భంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రస్తావిస్తూ "భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కును కల్పించడం ద్వారా అందరూ సమానం అనే అర్హతను సాధించి పెట్టాను. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా శాసనకర్తగా మారిపోతావా లేకుంటే అమ్ముకోవడం ద్వారా బానిసగా మిగిలిపోతావా తేల్చుకోవాల్సింది ప్రజలే" అని చేసిన హెచ్చరిక ఈనాటిది కాదు. అయినా అదే పరంపర కొనసాగుతూ ప్రస్తుతం అవినీతి తారాస్థాయికి చేరుకోవడాన్ని గమనించవచ్చు ఇంకా రాజకీయ పార్టీలు కులాల వారీగా మతాలవారీగా ప్రాంతాలవారీగా ఉద్యోగుల వారీగా సభలు సమావేశాలు పెడుతున్నవి ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ ప్రకారం నిషేధమే. అయినా ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది కోటి డాలర్ల ప్రశ్న. ఎన్నికల సంఘానికి ప్రత్యేక చట్టం అంటూ ఉండాల్సిన అవసరం లేదు ఉన్న అధికారాలు నిబంధనలను సరిగా ఉపయోగిస్తే ప్రభుత్వాన్ని కూడా గడగడ లాడించవచ్చు .అవినీతిపైన ఉక్కు పాదం మోపవచ్చు . స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం ఎవ్వరికీ భయపడకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది .ఇక ఇదే సందర్భంలో న్యాయవ్యవస్థ కూడా చొరవ చూపి రాజకీయ పార్టీల యొక్క తాత్కాలిక ప్రయోజనాలు ప్రలోభాలను ప్రకటించకుండా శాశ్వతమైన అభివృద్ధిని నిర్వచించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు జాతి సంపదను ప్రజలందరికీ అందించగలిగే సమసమాజ స్థాపన వైపుగా పరిపాలనను నడిపించే క్రమములో తప్పుడు మార్గాలకు పాల్పడుతున్న రాజకీయ పార్టీల పైన కొరడా గెలిపించాలి .అనర్హులుగా ప్రకటించాలి కోట్ల రూపాయల జరిమానా విధించాలి. నేరస్తులుగా చిత్రీకరించి జైల్లో పెట్టాలి .ఇదే సందర్భంలో ప్రజలు ఓటర్లు కూడా తాత్కాలిక ప్రలోభాలకు బానిసలు కాకుండా తమ హక్కుల కోసం పోరాడే క్రమంలో రాజకీయ పార్టీల పైన స్వారీ చేయగలగాలి .రాజకీయ పార్టీలు ప్రకటించే థాయిలాలకు ఆశపడి తలవంచి మోకరిల్లి బానిసలుగా బ్రతకడానికి ఇష్టపడితే ఎవ్వరు కూడా చేయగలిగింది ఏమీ లేదు.. ఇక తేల్చుకోవాల్సింది చైతన్యం కలిగి పాలకులను ఎన్నుకోగలిగినటువంటి ఓటు హక్కు ఉన్న ప్రజలు మాత్రమే. ఇప్పటికీ ప్రజలు విద్యా,వైద్యం, సామాజిక న్యాయాన్ని ఉచితంగా నాణ్యమైన రీతిలో అందించాలని డిమాండ్ చేయగలిగితే, ఏ ప్రలోభాలకు కూడా ఆశపడకుండా తృణీకరించగలిగితే విజయం ప్రజలదే . ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలకు అప్పుడు కాలం చెల్లితుంది. మానవాభివృద్ధి, కనీస జీవన ప్రమాణాల పెంపదల, సమానత్వం వంటి అంశాలు రాబోయే కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా ఉండే ఆస్కారం వస్తుంది. ఆ మార్పు కోసమే నేటి మన పోరాటం కొనసాగాలి సాధించేదాకా ఆగకూడదు మన ఆరాటం .
----- వడ్డేపల్లి మల్లేశం
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)