ఉచిత వాగ్దానాలను సుప్రీంకోర్టు తప్పు పట్టడాన్ని ఎలా చూడాలి?

Mar 8, 2025 - 11:16
 0  1

ఉచిత వాగ్దానాలను సుప్రీంకోర్టు తప్పు పట్టడాన్ని ఎలా చూడాలి? సమానత్వ సాధన, పేదరిక నిర్మూలనకు ఉచితాలు కాక ప్రత్యామ్నాయం లేదా? అసమానత అంతరాలను ప్రభుత్వాలు గాలికి వదిలి నటించడాన్ని వ్యతిరేకించాల్సిందే.* రాజ్యాంగ పలాలు సమoగా అందడానికి పోరుబాట తప్పదు.

***********************************

--వడ్డేపల్లి మల్లేశం 9014206412 

---15...02...2025*****************

ఇటీవలి కాలంలో కొన్ని స్వచ్ఛంద ప్రజా సంఘాలతో పాటు న్యాయవ్యవస్థ కూడా ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్దానాలను తప్పుపడుతున్న సందర్భాలను మనం గమనించవచ్చు. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు నిజంగా అసమానతలు అంతరాలను తగ్గించేవి కావు అవి ప్రజలను యాచకులుగా బానిసలుగా మార్చే దుష్టపన్నాగాలు అని గుర్తించాలి. పెట్టుబడి దారి, భూస్వామ్య, పారిశ్రామిక విధానాలను ప్రభుత్వాలే పెంచి పోషిస్తూ అసమానతలు అంతరాలను సృష్టిస్తూ పేదరికంలో ప్రజలను కొనసాగే విధంగా పరిస్థితులు కల్పించి సానుభూతిని పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నట్లుగా న్యాయ వ్యవస్థతోపాటు ప్రజాసంఘాలు అఖిలపక్షాలు అందరం కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. పేదరికం నిరుద్యోగము ఆకలి చావులు ఆత్మహత్యలు దోపిడీ, పీడన వంచన ఇవన్నీ ఈ దేశంలో అంతం కావాల్సిందే అయితే ఉచితాల రూపంలో యాచకులను బానిసలను తయారు చేసే విధానంలో మాత్రం కాదు. ఆ విధానాలను వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉంది ఇదే విషయంపైన ఇటీవల 11 ఫిబ్రవరి 2025 రోజున సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన హెచ్చరికను గమనించడం అవసరం. 

     సుప్రీంకోర్టు తప్పు పట్టిన కోణం

************************

ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజల్లో కష్టపడి పనిచేసే తత్వం సన్నగిల్లుతుందని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలోనైతే కూలీలు దొరకడం లేదని స్వయంగా తీర్పులో పాల్గొన్నటువంటి న్యాయమూర్తి గారలు ప్రకటించడాన్ని l మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉచితాలు దేశాభివృద్ధికి సరైనవి కావు అని హెచ్చరిస్తూనే మరింత లోతుగా వెళ్లదల్చుకోలేదు అని ఈ అంశంపై తీర్పులో పాల్గొన్న జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మాసిహ గార్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉచిత పథకాల పైన తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేయడాన్ని గమనిస్తూనే శ్రామికతత్వం నశిస్తుందని దేశాభివృద్ధిలో పాల్గొనలేక పోతున్నారని వాదించడాన్ని కొంతవరకు సమర్థించవచ్చు కానీ అదే సందర్భంలో ఈ దేశ సంపద ప్రజలందరికీ సమానంగా చెందాల్సి ఉన్న ఆదేశిక సూత్రాల్లో ప్రాథమిక హక్కులలో సంపద కొద్దిమంది చేతుల్లో పోగు పడకూడదు అని ఆదేశాలు ఉన్నప్పటికీ సగం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో ఉండడం సరైనది కాదు కదా! దీనికి కూడా సర్వోన్నత న్యాయస్థానం దారి చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల సందర్భంగా లబ్ధి పొందడానికి రాజకీయ పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టడం పూర్తిగా సమర్థనీ యం అయితే దానికి ప్రత్యామ్నాయాన్ని సూచించవలసిన బాధ్యత కూడా సర్వోన్నత న్యాయస్థానం పైన ఉన్నది అని ప్రజలు ప్రజాస్వామికవాదులు భావిస్తున్నారు.

     తీర్పు లోని కీలక అంశాలు

**************************

పట్టణ ప్రాంతాలలోని నిరాశ్రయులకు ఆశ్రయము కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన సందర్భంగా పై ధర్మాసనం కష్టపడి పని చేయకుండా పరాన జీవులుగా మారడాన్ని సమర్థించలేము కదా అని వ్యాఖ్యానించింది. ఉచిత పథకాలు ఇచ్చే బదులు సంబంధిత వర్గాలకు అదే స్థాయిలో మరో రూపంలో ప్రయోజనాలు కల్పించాలి అప్పుడు ఉచిత పథకాల లబ్ధిదారులంతా దేశాభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములు అవుతారు కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది కేవలం ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు ప్రకటించే పథకాలతో పనిచేయడానికి ప్రజలు ఇష్టపడడం లేదు ఉచిత రేషన్ ఉచిత నగదు బదిలీ పూర్తిగా సోమరిపోతులను తయారు చేస్తున్నది అని తీర్పు ఇస్తూనే అటార్నీ జనరల్ కోరిన ప్రకారంగా ఇల్లు లేని వాళ్లకు ఆశ్రయము కల్పించాల్సిందే.. అదే సమయంలో ప్రభుత్వాలు పట్టణ గ్రామీణ ప్రాంతా పేదరిక నిర్మూలన కార్యక్రమాలను ఇందుకోసం కొనసాగిస్తున్నట్లు అటార్నీ జనరల్ చెప్పగా 77 సంవత్సరాలుగా ఇంకా కొనసాగాల్సిందేనా అని సర్వోన్నత న్యాయస్థానం అటార్నీ జనరల్ కు వేసిన ప్రశ్న పైన మనం చర్చించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది.

    ప్రభుత్వాలదే కీలక బాధ్యత తప్పుడు నిర్ణయాలతో అసమానతలు అంతరాలు:-

*********--****************

  దేశంలో కొనసాగుతున్న పేదరికం రాజకీయ పార్టీలు సాగిస్తున్న విష ప్రచారం అటార్నీ జనరల్ కోరుతున్న అంశాల్లోని వాస్తవాలు సమీక్షించుకున్న తర్వాత గుడ్డిగా ఉచితాలు వాగ్దానాలు వద్దంటే సరిపోదు ఈ దేశ సంపద ప్రజలందరికీ సమానంగా అందాలి కానీ కొద్దిమంది మాత్రమే అక్రమంగా మెక్కు తుంటే మిగతావాళ్లు బానిసలుగా బతకడాన్ని సహించలేము కదా!అందుకు తగిన మార్గాలను ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రజలు ప్రజాసంఘాలు విప్లవకారులు మేధావుల పైన ఉన్నది ఆ నిర్ణయం సుప్రీంకోర్టును ప్రభావితం చేస్తే బాగుంటుందేమో!

      దేశంలో విద్య వైద్యము సామాజిక న్యాయము మొత్తం డబ్బు మయం అయిపోయింది ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఉచిత విద్య ఉచిత వైద్యం గాలికి వదిలి పెట్టుబడిదారీ వర్గాలను ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్న కారణంగా సామాన్య పేదరిక మధ్యతరగతి ప్రజల ఆదాయము అంతా ఆ రెండు రంగాలకే ఖర్చవుతుంటే ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితులకు పాలకుల 77 ఏళ్ల పాలన కారణం కాదా? 40 శాతం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో ఉంటే ఏనాడు కూడా చట్టం న్యాయం సర్వోన్నత న్యాయస్థానాలు ప్రభుత్వాలను మందలించలేదు. రాజ్యాంగ పీఠికలో రాసుకున్నటువంటి సామ్యవాద స్థాపనకు దేశం ఆమడ దూరంలో ఉంది అనే సోయి పాలకులకు ఎందుకు లేదు? ఈ విషయం పైన సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడు ఎందుకు చర్చించలేదు అని సామాన్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా జోక్యం చేసుకొని ఆ సంపదను ప్రజల పరం చేయాలని కోరుతున్నారు. 90% పేద వర్గాలకు కేవలం బడ్జెట్లో 10 శాతం కూడా ఖర్చు చేయలేని దయనియస్థితి ఈ దేశంలో కొనసాగుతుంటే 

పేదరికం నిరుద్యోగం తాండవించకుండా ఎలా ఉంటుంది? వాళ్ల జనాభా దామాషాలో బడ్జెట్లో నిధులు కేటాయించాలి కదా 60 శాతం ఉన్న బీసీలకు 5-10 శాతం కూడా కేటాయించడం లేదు అంటే పాలకులు ఎంత ద్రోహం చేస్తున్నట్లు? చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వాల యొక్క ఈ ద్రోహాన్ని అరికట్టకుండా ఉచితాలను ప్రచారం చేసుకుంటూ రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి. ఈ కీలేరిగి వాత పెట్టకుండా న్యాయవ్యవస్థ పాలకులనువిమర్శిస్తే సరిపోదు.ఉక్కు పాదంమోపితే కానీ సమానత్వం సాధ్యం కాదు. అవును యాచకులు బానిసలుగా మార్చడానికి ఉచితాలు తా యిలాలు అవసరం లేదు దాన్ని ప్రజలు కూడా అంగీకరించరు. కానీ దేశ సంపదలో మా వాటా ఏమిటో మాకు తేల్చాలి అని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకుండా చూస్తూ ఉంటే నిలదీసే ప్రతిఘటించే ఉద్యమాలు రాక మానవు కదా! ప్రశ్నించిన పాపానికి నిర్బంధము అణచివేతతో ఉద్యమకారులు, మేధావులు, సంపాదకులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులను దేశద్రోహులుగా ముద్ర వేస్తూ ఉంటే ఈ పరిస్థితులను గాలికి వదిలి కేవలం ఉచితాలు సరైనవి కావు అనే చర్చ దగ్గర మనం ఆగిపోతే ప్రయోజనం శూన్యం.

      ప్రజలు ఏనాడు ఉచితాలు ఇవ్వమని బానిసలుగా బతుకుతామని యాచకులుగా జీవిస్తామని అడగలేదు. రాజ్యాంగపరంగా తమకు రావలసిన వాటా కోసం డిమాండ్ చేస్తున్నారు దానిని మరిచిపోయే విధంగా ప్రజలను మ భ్యపెడుతున్న పాలకుల పైన తగిన చర్య తీసుకోవడం తక్షణ కర్తవ్యం ఇదే సందర్భంలో కేవలం ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందించగలిగితే పేదరికం నిరుద్యోగం ఆకలి చావులు ఆత్మహత్యలు అన్నీ కూడా సమసి పోతాయి. ప్రజలు హాయిగా జీవిస్తారు, అది రాజ్యాంగబద్ధంగా కొనసాగాలి,ఇదే ప్రత్యామ్నాయ రూపంలో ప్రజలకు ప్రభుత్వాలు అందించవలసినటువంటి విధానం ఇప్పటివరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో ఉచిత విద్య ఉచిత వైద్యం అని ప్రకటించలేదు చాలా సిగ్గుచేటు! ఇప్పటికైనా ప్రకటించే విధంగా సర్వోన్నత న్యాయస్థానం ఒత్తిడి చేయాలి.ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఉచితా లను రద్దు చేయగలము ఆ స్థానంలో సగౌరవంగా ఆత్మగౌరవంతోనే ప్రజలు బ్రతికే జీవన విధానాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333