ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు జారీ.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.
జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని, వ్యాధుల గుర్తింపు, చికిత్స, ఫాలోఅప్కు హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు జోగులాంబ గద్వాల జిల్లా విద్య, వైద్య శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్డులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తరగతి, పాఠశాల/హాస్టల్, విద్యార్థి ఐడీ, ఆధార్ వివరాలు, తల్లిదండ్రుల పేరు, మొబైల్ నంబరు, చిరునామా, తదితర వివరాలను నమోదు చేస్తారన్నారు. సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్యాధికారి, ఏఎన్ఎం వివరాలను కూడా పొందుపరుస్తారని పేర్కొన్నారు. దీంతో విద్యార్థికి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ఒకే కార్డులో అందుబాటులో ఉంటుందని వివరించారు.
విద్యార్థులకు నిర్వహించే ఆరోగ్య పరీక్షల వివరాలను తేదీల వారీగా నమోదు చేసుకునేలా కార్డులో ప్రత్యేక పట్టికను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షల్లో గుర్తించిన లక్షణాలు, అందించిన చికిత్స, అవసరమైతే రిఫరల్, ఫాలోఅప్ వివరాలను కార్డులో నమోదు చేస్తారన్నారు. రక్తహీనత, గుండె సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, నరాల సంబంధిత వ్యాధులు, మధుమేహం, మూర్ఛ, పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక అంశాలను కార్డులో చేర్చామన్నారు. విద్యార్థుల్లో దంత సమస్యలను కూడా ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. దంత క్షయం, దంతాలపై పేరుకుపోయే మలినాలు, చిగుళ్ల సమస్యలు, దంతాల కదలిక, వంటి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ కార్యక్రమంలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, పండ్లు, కూరగాయలు, పోషకాహారం తీసుకోవడం, అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలను తగ్గించడం వంటి అంశాలను నిపుణులచే తరచూ వివరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సరైన పద్ధతిలో చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చనే విషయాలను కూడా విద్యార్థులకు తెలియజేస్తారన్నారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా విద్యార్థుల శారీరక ఆరోగ్యంతో పాటు ఆరోగ్య విద్య, పోషకాహారం, పాఠశాల ఆరోగ్య సేవలు, మానసిక, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి సకాలంలో వైద్యం అందించడం ద్వారా భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఇతర ప్రాంతాల అధికార యంత్రాంగానికి స్ఫూర్తినిచ్చేలా నిర్వహించడానికి సరైన ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. ‘ఆరోగ్యవంతమైన విద్యార్థే.. ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది’ అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.