జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి తోడ్పాటు.
మౌలిక వసతులు, టీచర్ల కొరత లేకుండా చర్యలు.
స్ఫూర్తి తరగతులతో వంద శాతం ఉత్తీర్ణతకు అవకాశం.
హెల్త్ కార్డులతో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా స్థాయి ఉత్తమ గురువులకు ఘన సన్మానం.
జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- విద్యాభివృద్ధిలో వెనుకబడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఇతర అతిధులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రసంగించారు. ప్రపంచంలో ప్రస్తుతం అనేక రంగాల్లో ఎంతో వేగవంతంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను వినియోగించి విద్యార్థులకు అత్యుత్తమ బోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదివరకు ఫిన్లాండ్ దేశంలో విద్యా వ్యవస్థ అధ్యయనానికి జిల్లా కలెక్టర్ తో పాటు కొంత మంది ఉపాధ్యాయులు అక్కడ పర్యటించడం జరిగిందని గుర్తు చేశారు. స్ఫూర్తి కార్యక్రమంతో జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాక మెరుగైన మార్కులు పొందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే గాక టీచర్ల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ నివారించడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో గతంలో సాగునీటి వసతులు లేక చాలా కుటుంబాలు ఉపాధి కోసం వలసలు వెళ్లే వారని, ప్రస్తుతం అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి పంపించడం తగదని, విద్య తోనే ఉన్నత రంగాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంటుందని సూచించారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో కూడా విద్యార్థులకు బోధించేందుకు చాలామంది ఉపాధ్యాయులు నిబద్ధతతో పని చేస్తున్నారని ప్రశంసించారు. జిల్లాలో నర్సింగ్, మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయని, భవిష్యత్తులో అనేక ఉన్నత విద్యాసంస్థలను కూడా నెలకొల్పి జిల్లాను విద్యారంగంలో శిఖర స్థాయిలో నిలబెట్టేందుకు తన వంతుగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్వత్ గద్వాల ఖ్యాతి నిలబెట్టేందుకు ఉపాధ్యాయులందరూ తోడ్పాటు అందించాలని కోరుతూ ప్రతి గురువుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించాలంటే ఆరోగ్యం ఎంతో ప్రధానమని పేర్కొంటూ రెసిడెన్షియల్, కేజీబీవీ, హై స్కూల్, వసతి గృహాల్లో చదువుకునే జిల్లాలోని సుమారు 40,000 మంది విద్యార్థులకు హెల్త్ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్డులతో వివిధ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు అవసరమైన చికిత్సను అందజేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులను చదువుతోపాటు నైతిక విలువలు పెంపొందించుకునేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. మెరుగైన విద్యా బోధనకు ఎఫ్ఎల్ఎన్ ఎక్స్ ఎల్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని, ఏఐ వంటి సాంకేతికతను కూడా ఉపయోగించి బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో 125 మంది విద్యావలంటీర్లను నియమించామన్నారు. మరుగుదొడ్లు, ప్రహరీలు, ఇతర మరమ్మత్తుల పనులతో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్ఫూర్తి పేరుతో జిల్లాలోని ఎస్ఎస్ సి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యారంగానికి సంబంధించి అన్ని అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి ప్రభుత్వం నిర్దేశించిన వివిధ పారామీటర్స్ లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధిస్తే జిల్లా విద్యారంగంలో టాప్ టెన్ స్థానంలో ఉంటుందన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పని చేసి విద్యారంగ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ తరగతులను కూడా ప్రవేశపెట్టడంతో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు చదువుపరంగా దృఢమైన పునాదులు వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు వినయంతో కూడిన విద్యను, నైతిక విలువలను బోధించాలన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి గురువును గౌరవించుకునే ప్రత్యేక రోజని అభివర్ణించారు. పాఠశాలల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర వాల్మీకి బోయ కార్పోరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ వెనుకబడ్డ గట్టు మండలంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రిజర్వాయర్లను నిర్మించుకోవడంతో రైతులకు సాగునీటికి ఇబ్బంది లేదని, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని, చదువుతోనే ప్రగతి సాధించవచ్చని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మెరుగైన సమాజ నిర్మాణానికి కృషి చేసినట్లు అవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఇతర అతిథిలతో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలభవన్ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్ఫూర్తి కార్యక్రమానికి సంబంధించిన లోగోను, పోస్టర్లను అతిధులు ఆవిష్కరించారు. అలాగే హెల్త్ కార్డులను విడుదల చేసి పలువురు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరినీ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి, డిఈవో విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.