బంగారు తెలంగాణ భ్రమలో ఆగమైన పాఠశాల విద్యను ముందుగా చక్కదిద్దాలి

Mar 30, 2024 - 23:22
 0  1

బంగారు తెలంగాణ భ్రమలో  ఆగమైన పాఠశాల విద్యను  ముందుగా చక్కదిద్దాలి .

పేదరికం కారణంగా  అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులను  ప్రభుత్వం ఆదుకోవాలి .

ప్రైవేట్ రంగంలో విద్య  ప్రభుత్వ రంగాన్ని మించి పోవడం అంటే  గత ప్రభుత్వ లోపమే కదా కారణం  .!*

-----వడ్డేపల్లి మల్లేశం 

ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 70 శాతం ఉన్న ప్రభుత్వ విద్యా రంగం  పాఠశాల స్థాయిలో 49 శాతానికి చేరుకోవడం అబ్బురపరిచే విషయం . ఉమ్మడి రాష్ట్రంలో  చంద్రబాబు నాయుడు కాలంలో విద్యారంగానికి 17% నిధులు కేటాయిస్తే  తెలంగాణ ఏర్పడే నాడు 11% నిధులతో  ఉన్న బడ్జెట్  పదేళ్ల తొలి తెలంగాణ ప్రభుత్వ కాలంలో 6 శాత0 దాటకపోవడం  విడ్డూరం కాక మరేమిటి ? తెలంగాణలో రెండవ ప్రభుత్వమైన  కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా  గతం కంటే ఒక్క శాతం మాత్రమే పెంచడం  అసంబద్ధమైన విషయం . ప్రస్తుతం 49 శాతం ప్రభుత్వ రంగం ఉంటే 51% విద్యార్థులు  ప్రైవేటు విద్యారంగంలో విద్యను అభ్యసిస్తూ ఉంటే  గత  టిఆర్ఎస్ ప్రభుత్వం 6000 పాఠశాలలను విద్యార్థులు లేరనే సాకుతో మూసివేతకు గురిచేసినప్పుడు  గ్రామీణ ప్రాంతాలలోనూ  అలాగే పట్టణ ప్రాంతాలలోనూ  ఎంతో మందికి దూరమైతే ప్రైవేట్ పాఠశాలలే కదా గతి  ! భారతదేశంలో ఆకలితో ఒక్క కుక్క కూడా అలమటించి చావకూడదని వివేకానందుడు  ఆశిస్తే  పేదరికం పేరుతో  ఏ ఒక్కరికి కూడా విద్యను నిరాకరించకూడదని  ప్రస్తుత ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్థితులు రావడం అంటే  గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్రోహం కాక మరేమిటి ? పైగా బంగారు తెలంగాణ నినాదం పేరుతో  తెలంగాణ సెంటిమెంటు  పైననే పరిపాలన చేసినటువంటి బారాస ప్రభుత్వం  నిజ జీవితంలో ప్రజల జీవితాలలో వెలుగులు నింప లేకపోవడం,  పైగా అవినీతి  భూకబ్జాలు భూదందాలు  ప్రజా ప్రతినిధులు అధికారుల స్థాయిలో విచ్చలవిడి నేరాలను  చూస్తున్నామంటే  సాధించుకున్న తెలంగాణ ఎంత నీచ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 
       గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా అనేక పాఠశాలలు మూసివేతకు గురికావడం ,పట్టణ ప్రాంతాలలో అందుబాటులో లేకపోవడం,  ఉన్న ప్రభుత్వ పాఠశాలలు  ఉదాసీనంగా సిబ్బంది,అరకొరవసతులమధ్యన నిర్లిప్తంగా నడుస్తూ ఉంటే  అనివార్యమైన పరిస్థితులలో  పేదరికం  స్వారీ చేస్తున్నా కూడా  ప్రైవేటు పాఠశాలల  తలుపు తడుతున్నటువంటి అనేక సామాన్య పేద వర్గాల పిల్లలకు  పెరుగుతున్న అప్పులు మరింత భారం అవుతుంటే  ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవలసిన అవసరం అనివార్యంగా ఏర్పడినది . విద్య వైద్యాన్ని ఉచితమైన రీతిలో నాణ్యమైన పద్ధతిలో  ప్రజలకు అందించవలసిన బాధ్యత గల ప్రభుత్వాలు  స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు  ఉచితంగా అందిస్తామని ఏ పార్టీ కూడా ప్రకటించకపోవడం,  కంటి తుడుపు చర్యలు తీసుకోవడాన్ని మనం గమనించినప్పుడు  ఢిల్లీ గోవా కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో  బడ్జెట్లో ఎక్కువ నిధులను కేటాయించి కొంత మెరుగైన పరిస్థితులను కల్పించిన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అట్టడుగున తెలంగాణ ఉండడాన్ని గుర్తించవచ్చు.  2018- 20 ప్రాంతంలో    రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్  నగరంలో ప్రైవేటు పాఠశాల  విద్య పైన ఆందోళన చెందిన తల్లిదండ్రుల సంఘాలు  ఫీజు నియంత్రణ చేపట్టాలని,  నాణ్యమైన విద్య అందించాలని, పేద ప్రజలకు ఆర్థిక సహకారం అందించాలని చేసిన విజ్ఞప్తిని  ఆనాటి ప్రభుత్వం తుంగలో తొక్కి  ఏర్పాటు చేసినటువంటి తిరుపతిరావు కమిషన్  కూడా ఏటా 10 శాతం పీజు పెంచుకోవచ్చునని  సిఫారసు చేయడం అంటే అర్థం చేసుకోవచ్చు . ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసినప్పటికీ  ఎలాంటి సిఫారసులు చేయకుండానే ఆ ప్రభుత్వం కూలిపోవడం,  ఏనాడు కూడా విద్యారంగం పైన గత ప్రభుత్వం సమీక్ష చేయని కారణంగా  అల్పాదాయ వర్గాలు  అప్పుల పాలైనా కూడా ప్రైవేటు పాఠశాలల్లోకి తమ పిల్లలను పంపించి  చదివించే క్రమంలో మరింత పేదరికంలోకి జారుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి.  రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇంటర్మీడియట్  ఆపై విద్యారంగాన్ని  ప్రభుత్వ రంగంలో కొనసాగించకపోయిన  ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పేరుతో  కొంత పేద వర్గాలకు విద్యను ఉచితంగా అందించిన విషయాన్ని గమనించవచ్చు.  ఆ రకంగా  పేద విద్యార్థులకు రావలసినటువంటి రియంబర్స్మెంట్  ఉపకార వేతనాల బకాయిలను కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 5000 కోట్లు చెల్లించక దాటవేసిన ధోరణి  పేద విద్యార్థుల పట్ల కక్ష సాధింపు కాక మరేమిటి ?
        కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సిన కార్యక్రమం:-
*****
  ప్రభుత్వ రంగంలో విద్యను బలోపేతం చేయడానికి మెరుగైన చర్యలు చేపట్టాలి.  విద్యకు బడ్జెట్లో కనీసం  15% నిధులను కేటాయించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి . మూసివేతకు గురైన పాఠశాలలను తిరిగి తెరిపించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి.  పట్టణ ప్రాంతాలతో సహా ప్రైవేటు పాఠశాలల విద్యను  ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంతవరకు  ఆ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేదవర్గాల పిల్లలకు ఫీజులను ప్రభుత్వమే భరించాలి.  అధిక ఫీజులను  ఇతరత్రా అనేక రకాల ప్రైవేట్ పాఠశాలల దోపిడిని వెంటనే ప్రభుత్వం అరికట్టి  తల్లిదండ్రులు విద్యార్థులకు స్వేచ్ఛను అందించాలి.  ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించి  నాణ్యమైన విద్యను అందించడానికి పూనుకున్నప్పుడు,  మొత్తం విద్యారంగం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగినప్పుడు  తారతమ్యాలు తలెత్తే అవకాశం ఉండదు పైగా పేద కుటుంబాలకు  ఫీజుల భారం తప్పుతుంది  .తమ అల్పాదాయములో కనీసం 40 శాతాన్ని  పేద కుటుంబాలు విద్యకు కేటాయిస్తున్న తీరును గమనిస్తే  పేద వర్గాలకు ప్రభుత్వం ఏం చేస్తున్నదో  ఎందుకోసం ఓటు వేసి గెలిపించాలో ప్రభుత్వాలే ఆలోచించుకోవాలి . పూర్తిస్థాయిలో విద్యారంగం ప్రక్షాళన అయ్యేలోపు  ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి విధానాన్ని  కాల పరిమితిలో నిర్ణయించి  పేద వర్గాల ఫీజులను ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేయడంతో పాటు  దోపిడిని అరికట్టాలి.  ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే  ప్రజలందరికీ ఒకే  విధమైన  నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం  ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే క్రమంలో ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పించి,  మెరుగైన వసతు లను కల్పించడంతోపాటు  చిత్తశుద్ధిని ప్రదర్శించిన కారణంగా ప్రైవేటు పాఠశాలల లోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోకి రావడాన్నీ మనం గమనించవచ్చు. ఆ రకంగా  క్రమంగా ప్రభుత్వ రంగం బలపడి  భిన్నత్వం లేకుండా అందరికీ ఒకే రకమైన విద్య అందించడానికి అవకాశం దక్కుతుంది ఆ కృషి తెలంగాణ రాష్ట్రంలో జరగాలి . ఇప్పటివరకు విద్యారంగం పైన ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించకపోవడంతో  గత ప్రభుత్వ హయాములో ధ్వంసం అయినటువంటి పాఠశాల విద్య  దారి తెన్నులేని పద్ధతిలో కొనసాగడం  అత్యంత విచారకరం . దానికి వెంటనే అడ్డుకట్ట వేసి  ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులను కేటాయించడం ద్వారా  పేదల భారాన్ని మోయడానికి , ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి, ఉపాధ్యాయ బోధనేతర సిబ్బందిని  సంపూర్ణంగా  నియామకం చేయడానికి,  క్షేత్రస్థాయిలో పార్ట్ టైం స్లీపర్లు   ఆఫీస్ సబార్డినేట్  రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్  వంటి పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయడం,  జిల్లా విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారులతో పాటు పర్యవేక్షణ అధికారుల  పోస్టులను భర్తీ చేయడంతో  నాణ్యమైన విద్య అందడంతో పాటు  బోధన బోధ నేతర సిబ్బందితోపాటు పాఠశాలల నిర్వహణపైన పూర్తి అజమాయిషీ చేయడానికి అవకాశం ఉంటుంది .నిఘా ,  సిబ్బంది లేకుండా  లక్ష్యాన్ని సాధించడం అసంభవం.  అదే సందర్భంలో స్పష్టమైన విధాన ప్రకటన చేయకుండా కూడా  ప్రభుత్వం నుండి పేదవర్గాలు అతిగా ఆశించడం అత్యాశ అవుతుంది.  ఈ కార్య భారాన్ని  పూర్తి చేయవలసిన బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ముందుగా విద్యారంగానికి  ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా  చురుకైన పాత్ర పోషించి గత ప్రభుత్వ  ధోరణి పైన  కఠిన మార్పులకు శ్రీకారం చుట్టాలి.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ,  రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333