చిన్నారులపై కార్పొరేట్ ఒత్తిడి, తల్లిదండ్రులు చదువు పేరుతో పిడిస్తే రక్షించేది ఎవరు.?
పుస్తకాల బరువు మోత దీర్ఘకాలం వారి భవిష్యత్తుకు వాత.
కమిటీలు ఎన్ని చెప్పినా బరువు మరింత పెరుగుతూనే ఉన్నది.
సృజనాత్మకత, ప్రతిభ స్థానంలో పుస్తకాల చదువు బట్టి పద్ధతి చోటు చేసుకోవడం దారుణం
--- వడ్డేపల్లి మల్లేశం
వ్యక్తిలోని అంతర్గత శక్తులను వెలికి తీసేది విద్య అని విద్యకు సమగ్రమైన నిర్వచనం మేధావులు అందిస్తే విద్య యొక్క మూలాలు చేదు కానీ పండు తీపి అని అరిస్టాటిల్ వ్యాఖ్యానించడం దాని ప్రాధాన్యతను మరింత తెలియజేస్తున్నది. "ప్రపంచాన్ని మార్చడానికి మనం ఉపయోగించగలిగిన అత్యంత శక్తివంతమైన సాధనం విద్య" అని దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా ఇచ్చిన నిర్వచనం వ్యవస్థను మార్చడానికి విద్య ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతున్నది. జ్ఞానాన్ని, అవగాహనను, విచక్షణను, మేధస్సును పెంపొందించి అనుమానాలను నివృత్తి చేసి స్పష్టమైన వైఖరులను నేర్పగలిగే విద్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కావడం విచారకరం . ఉపాధ్యాయుల అనుభవాలు జ్ఞాపకాలు, పరిశీలనలు, పరిశోధనలకు తోడుగా పుస్తక జ్ఞానాన్ని అన్వాయి0 చుకునే క్రమంలో విద్యార్థులకు నూతన పరికల్పనలకు అవకాశం ఇచ్చే కృషి జరుగుతుంది. ఉపాధ్యాయుని యొక్క బోధన విద్యార్థుల యొక్క అభ్యసనము రెండింటి యొక్క సమన్వయం ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థుల ఎదుగుదల సాధ్యమవుతుంది అందుకే ఉపాధ్యాయులు బోధిస్తారు అనడం కంటే బోధనాభ్యసన ప్రక్రియ అని చెప్పుకోవడం విద్యార్థి కేంద్రంగా గల విద్యకు తార్కాణంగా భావించాలి. సృజనాత్మకత సాధించి , విలువలను ప్రతిష్టించి , సంపూర్ణ మానవునిగా తీర్చి దిద్దవలసిన విద్య పుస్తకాలకు పరిమితం కావడంతో ఆధునిక కాలంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యలో పుస్తకాల బరువు ప్రధాన పాత్ర వహిస్తున్నది . చదువు, బోధనాభ్యసన ప్రక్రియ అంటే కేవలం పుస్తకాలు , నోటుబుక్కులు, ఇతర స్టేషనరీ సామాగ్రి అనే నిర్వచనంలో ఆధునిక చదువులు కొనసాగుతుంటే పిల్లల వయసుకు మించిన స్థాయిలో బరువు వారి అనారోగ్యానికి కారణం అవుతున్న విషయం అనేక కమిటీలు వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం అదుపు చేయలేదు .ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు తమ ఆలోచనలు మార్చుకోలేదు. చాలా కాలం క్రితమే పుస్తకాల బరువులు తగ్గించడం ద్వారా పిల్లల్లోపల స్వయం వికాసాన్ని ప్రోత్సహించాలని , అనారోగ్యం బారిన పడకుండా చూడాలని, వీపు భుజం నొప్పులు రాకుండా ఉల్లాసంగా గడపగలిగే వాతావరణాన్ని కల్పించాలని యశ్పాల్ కమిటీ సిఫారసు చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా అమలుకు నోచుకోలేదు. భారతదేశంలో మొదలియార్ కొటారి వంటి అనేక కమిటీలు నిర్మాణాత్మక సూచనలు చేసిన పట్టించుకోని ప్రభుత్వాలు
విద్యా రంగాన్ని బ్రష్టు పట్టించినవి అనడంలో సందేహం లేదు . సమానత్వం, స్వేచ్ఛ, విశాల దృక్పథాన్ని అలవరచవలసిన విద్య కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టి అధిక నిధులను కేటాయించడం ద్వారా సమాజాన్ని శక్తివంతం చేయాలని కోటారి కమిషన్ సూచిస్తే కులాల వారి మతాల వారి పాఠశాలలు నెలకొల్పి ఆ ఆశయానికి తూట్లు పొడిచిన సంగతి వేరే చెప్పినక్కరలేదు.
పుస్తకాల మోత కాదు--- జ్ఞాన సంపద , వికాసం ముఖ్యం:-
చిన్న వయసులోనే పిల్లలకు అపారమైన జ్ఞానం రావాలని, మార్కులు ర్యాంకులు సాధించాలని, ఉద్యోగాల వేటలో ముందుండాలని అందుకు పుస్తకాలతో కుస్తీ పట్టడ మే సాధనమని నమ్మిన కార్పొరేట్ పాఠశాలలతో పాటు తల్లిదండ్రుల యొక్క అవగాహన రాహిత్యం అతి ఉత్సాహం కూడా పిల్లల పాలిట శాపంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. మించిన పుస్తకాల మోత చిన్న వయసులోనే పిల్లలపై అనారోగ్య గాయాలకు దారి తీయగా బట్టి పట్టే విధానంతో కేవలం జ్ఞానం పెరుగుతున్నదే తప్ప సృజనాత్మకత, వైఖరులు , అభిరుచులు, ఆలోచనలు, ధోరణులు, సర్వతో ముఖ వికాసం అంతగా సాధ్యం కావడం లేదు . విద్య యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని ఎంచుకున్న తీరులోనే దోషం ఉంది కనుక పునరాలోచన చేసుకొని పునర్నిర్వచించు కోవాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది. ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు ఆధునిక టెక్నాలజీ ,ఉపాధ్యాయుని యొక్క జీవిత అనుభవాలు జ్ఞాపకాలు, సామాజిక పరిశీలన ఇతివృత్తంగా బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగితే పుస్తకాల మోతను తగ్గించవచ్చు .ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు పిల్లల పైన ఒత్తిడిని పరిమితం చేయడానికి అవకాశం ఉన్నది . స్వేచ్ఛగా స్వతంత్రంగా తన ఆలోచన ధోరణికి అనుగుణంగా సహజ న్యాయ సూత్రాలకు సహజ వాతావరణంలో ప్రకృతి నుండి సేకరించే జ్ఞానము విద్యా అపారమైనటువంటిది. పుస్తకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన ప్రకృతి పరిశీలన క్షేత్ర పర్యటనలు కుంటుపడుతున్న విషయం తెలియనిదా?
ప్రభుత్వ రంగంలో పూర్తి స్వేచ్ఛ వాతావరణంలో కొనసాగవలసిన విద్య ప్రభుత్వ బాధ్యతారాహిత్యం నిర్లక్ష్యం కారణంగా 60 శాతానికి పైగా ప్రైవేట్ రంగంలోనే కొనసాగుతూ ఉంటే ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి కార్పొరేట్ శక్తులతో చేయి కలిపి ఫీజుల పైన నియంత్రణ చేయకపోగా బోధనా అభ్యసన ప్రక్రియలోని అశాస్త్రీయ విధానాన్ని కూడా అడ్డుకోకపోవడం దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలోని బోధనా అభ్యసన ప్రక్రియ పైన పరిశీలన చేసి సృజనాత్మకతకు పెద్దపీట వేసే కొరకు ప్రత్యేక కమిటీని వేసి అమలు చేసినట్లయితే బాగుంటుంది. తరగతి గదిలో చర్చలు, అభిప్రాయాల ప్రకటన, పాఠ్యాంశాలపై విద్యార్థులచే ప్రశ్నలను గుర్తింప చేయడం, ప్రతి పాఠశాలలోనూ విద్యార్థుల వికాస కేంద్రాలను ప్రారంభించడం, క్షేత్ర పర్యటనలతో పాటు సమాజంలోని భిన్న వాతావరనాన్ని సందర్శింప చేయడం ద్వారా విద్యార్థులలో స్వయం ప్రతిపత్తిని సాధించవచ్చు . ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాలను కొంతవరకైనా కొనసాగిస్తూ ఉంటే ప్రైవేట్ పాఠశాలలు కేవలం మార్కులు, ర్యాంకులు, జవాబు పత్రాల పూర్తి , బట్టి విధానానికే ప్రాధాన్యత ఇవ్వడం వలన లక్షలాది రూపాయల ఫీజులను చెల్లించి తమ పిల్లలను యంత్రాలుగా మార్చుకుంటున్న విషయాన్ని తల్లిదండ్రులు ఇప్పటికీ గ్రహించకపోతే ఎలా? పుస్తకాలే చదువు, నోటుబుక్కులో రాసిందే చదువు, పరీక్షల్లో రాసిందే చదువు, పుస్తకాల బరువే చదువు అనే భావన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉన్నంతకాలం ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ విద్యా లక్ష్యాలను సాధించడం దుర్లభం . పుస్తకాల మోత ప్రైవేటుతో పాటు ప్రభుత్వ రంగంలోనూ మరి కొంత తగ్గించడం ద్వారా పిల్లల స్వయం వికాస పద్ధతులకు అవకాశం ఇవ్వడం ద్వారా మాత్రమే వారిని బావి జీవిత సవాళ్లను అధిగమించే విధంగా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది . "ప్రశ్నలకు జవాబులు చెప్పడం నేటి అవసరం విధానం కావచ్చు కానీ వ్యక్తి స్వయం నిర్ణయాలు తీసుకొని సవాళ్లను అధిగమించే స్థాయిలో ఎదగడం అనేది రేపటి అవసరం ." ఈ రెండింటిని సమన్వయం చేయడం ద్వారా మాత్రమే విద్యకు సార్థకత లభిస్తుంది. అందుకే శారీరక మానసిక ఆధ్యాత్మిక సామాజిక శక్తులను వెలికి తీయడమే విద్య అని గాంధీ ఇచ్చిన నిర్వచనాన్ని కూడా ఇక్కడ పరిశీలించడం ముదావహం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)