సేంద్రీయ వ్యవసాయంతో ప్రయోజనాలు

భారత్లో కొంతకాలంగా ఆ వైపుగా జరుగుతున్న కృషి .
ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం పైన పెరిగిన అవగాహన నేపథ్యంలో ప్రభుత్వాలపై పెరిగిన బాధ్యత.
సేంద్రియ వ్యవసాయానికి చిరునామాగా మారిన కేరళ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి 2010లో ప్రత్యేక విధానాన్ని ప్రకటించగా ఇటీవల మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది . రాబోయే ఐదేళ్లలో ఐదువేల హెక్టార్లలో సేంద్రియ సాగును విస్తరించడం లక్ష్యంగా పెట్టుకోగా ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ పరిధిలోని 10 శాతం పంట భూమిని సేంద్రీయ సాగుకు కేటాయించాలని కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారతదేశంలోని ఇతర అన్ని రాష్ట్రాలకు కనువిప్పు కలగాలి .ఆ కృషి నిరంతరం కొనసాగిన కారణంగా 2017లో 7355 హెక్టార్లు ఉన్నటువంటి సేంద్రీయ వ్యవసాయ భూమి 2022 నాటికి 73,543 హెక్టార్ల కు పెరిగింది. అంటే కేరళ చేస్తున్న కృషిని ఆచరించడం అన్ని రాష్ట్రాల బాధ్యత అని తెలుసుకుంటే మంచిది. ఏదిఏమైనా దేశంలో సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రయోజనాలను కూడా చర్చించుకోవడం అవసరం .
సేంద్రియ వ్యవసాయం ఎదుర్కొంటున్న సమస్యలు- ప్రయోజనాలు- నిర్వచనం :-
రసాయన ఎరువులు పురుగు మందులకు భిన్నంగా స్థానికంగా ఉండే వనరులు, ప్రకృతి, జంతుజాలం, పశుపక్షాదుల నుండి వచ్చే పదార్థములతో కూడిన స్వదేశీ పద్ధతిలో చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం లేదా సహజ వ్యవసాయం అంటారు .ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అనుసరిస్తున్న ఈ పద్ధతిలో వాతావరణ మార్పులకు అనుగుణంగా మలుచుకోవడం, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం , వ్యవసాయ ఉత్పాదకతను రైతు ఆదాయాలను గణనీయంగా పెంచడం వంటి లక్ష్యాలు దీనిలోని అంతర్భాగాలుగా వున్నాయి. గత సంవత్సరం సేంద్రియ వ్యవసాయాన్ని జాతీయస్థాయిలో విస్తృత ప్రచారాన్ని తీసుకురావడానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం పైన జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తున్నది. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృత పరచడం వలన భూసారం నేల యొక్క నీటి నిలువ సామర్థ్యంతో పాటు కరువు పరిస్థితులకు తట్టుకునే శక్తి పెరుగుతుంది .అధిక భారంతో పాటు రసాయన ఎ రువులు పురుగుమందుల పైన ఆధారపడవలసి రానందున రైతులకు పని భారం తప్పుతుంది . తద్వారా నదులు చెరువులు, కాలువల్లో కాలుష్యం తగ్గడంతో పాటు ప్రతికూల ప్రభావాన్ని కూడా తట్టుకొని పంటలు పండే ఆస్కారం ఉంటుంది . పరపరాగ సంపర్కం ఫలదీకరణానికి సంబంధించి ప్రకృతిలోనీ జీవరాశి ముఖ్యంగా తేనెటీగలు పక్షులు, సీతాకోకచిలుకలు భూమిలోని వాన పాములు ఇతరత్రా జీవరాశి కి ఎలాంటి నష్టం వాటిల్లదు. ఎరువుల వాడకంతో పోల్చుకున్నప్పుడు సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులలో విటమిన్లు ఖనిజలవణాలు వంటి పోషక విలువలు ఘనంగా ఆహారము ద్వారా అందే అవకాశం ఉన్నది. రైతు ఉత్పత్తులకు అధిక గిరాకీ ఉండడంతో అన్నదాతలు లాభాల బాటన పయనించే అవకాశం ఉంటుంది. అయితే సేంద్రియ వ్యవసాయం అమలు చేసే క్రమంలో కొన్ని నిబంధనలు మార్గదర్శకాల ప్రకారంగా అమలు పరచాలని, అందుకు కొంత రైతులకు అవగాహన పెంపొందించాలని వ్యవసాయ రంగ నిపుణులు చేస్తున్న సూచన తొలి దశలో రైతులకు కొంత ఇబ్బంది కావచ్చు.
2020లో ప్రపంచవ్యాప్తంగా పట్టిపీడించిన కోవిడ్ లో భాగంగా భారతదేశంలో ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలలో పోషకాహారం పైన అవగాహన పెరిగిన విషయం కాదనలేము. అదే సందర్భములో సేంద్రియ ఆహార పదార్థాల యొక్క గిరాకీ భారీగా పెరగడంతో పాటు ప్రభుత్వాలు కూడా కొంత తమ బాధ్యతను గుర్తించినట్లుగా భావించవచ్చు. అయితే నేమి 2028 వరకు చౌక ధర దుకాణాల ద్వారా బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించి అదే పోషకాహారమని చేతులు దులుపుకుంటే సరిపోదు .అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం గా 2022లో ఇండియాలో సుమారు 91 లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం సాగవుతున్నట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి . వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2022- 23లో భారతదేశంలో 29 లక్షల మెట్రికె టన్నుల సేంద్రియ ఉత్పత్తులను రైతులు పండించినట్లు తెలుస్తుంది . ఉత్పత్తి అయినప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి కూడా తప్పదు కదా ! సేంద్రియ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ పెరుగుతున్న దృష్ట్యా ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా దేశీయంగా ప్రజలకు పోషక విలువలు అందించడంతోపాటు కొంతవరకు చౌకగా ఆహార ధాన్యాలను అందించడానికి అవకాశం ఉంటుంది . ఇదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు సేంద్రీయ వ్యవసాయ మనుగడకు పలు చర్యలు తీసుకోవడంతో పాటు అన్నదాతల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వాల కార్యాచరణ ఉండాలి . అదే సందర్భంలో ఏ రకాల ఆహార పంటలు పండించాలో ప్రభుత్వం సూచించడం ద్వారా దేశంలో కొరత ఉన్న ఆహార పదార్థాలను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది.తద్వారా దిగుమతి భారం తగ్గించుకోవచ్చు. ఏ ఉత్పత్తి అయినా సేంద్రియ పద్ధతిలో కొనసాగాలన్నదే మనందరి ఆశయం కావాలి.అందుకు అందరం అవైపుగా ఆలోచన చేయాలి.
---- వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటుపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)