సుప్రీం చొరవ సరే! భావితరాల బతుకు కోసం పాలకులు చర్యలు చేపట్టకపోతే నిష్ప్రయోజనమే!
విద్యా లక్ష్యాలకు గండి కొడుతున్న ర్యాంకులు, మార్కులు విద్యాసంస్థలు తల్లిదండ్రుల ఒత్తిడి.* విద్యార్థుల ఆత్మహత్యల నివారించలేమా?
**************
-- వడ్డేపల్లి మల్లేశం 90142206412
---29....07....2025*********-
సృజనాత్మకత, నైపుణ్యాలు, ప్రశ్నించే శక్తిని పెంచడంతోపాటు జ్ఞానాన్ని వికసింప చేయడం ఆసరాగా సమగ్ర వికాసాన్ని పెంపొందించేది నిజమైన విద్య అని మనం నిర్వచించుకుంటే దానికి భిన్నంగా నేడు భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న విద్యా విధానం భావి సవాళ్లను అధిగమించడానికి ఏమాత్రం ఉపయోగపడకపోగా పిరికివాళ్లను తయారు చేయడంతో పాటు ఆత్మ నూనతకు గురిచేసి ఆత్మహత్యలకు పురుకొ ల్పడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమే. కులమత లింగ వివక్షతలు విద్యాసంస్థల్లో రెచ్చిపోతూ ఉంటే ర్యాగింగ్ వంటి ఆ శాస్త్రీయ కు సంస్కారాయుతమైనటువంటి కార్యకలాపాలు కూడా కొందరిని బలి తీసుకున్న సందర్భాలు మనకు తెలుసు. విద్యను అభ్యసించే విద్యార్థుల ఇస్టా ఇష్టాలతో సంబంధం లేని, ప్రతిభకు ప్రాధాన్యత నివ్వని విద్యా వ్యవస్థలో మార్కులు ర్యాంకులే ప్రాధాన్యత సంతరించుకుంటే జీవితంలో ఏ రకంగాను ఉపయోగపడకపోగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి విద్యార్థులు ఆత్మహత్యలకు పురికొలపే విద్యావ్యవస్థను రూపు కల్పన చేసే పాలకులు విధాన నిర్ణయకర్తలు బాధ్యులు కావలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. జీవితానికి అనుబంధం లేని పాఠ్యప్రణాళికలు, ప్రతిభ సృజనాత్మకతకు స్థానము లేని పాఠ్యాంశాలు, బట్టి పద్ధతిలో కొనసాగే పరీక్షల విధానం విద్యార్థులను మరింత నిరాశ నిస్పృహల్లోకి నెట్టి వేస్తున్నాయని మనం అంగీకరించి తీరాలి. సవరించుకోడానికి ప్రయత్నం వెంటనే ప్రారంభించాలి.
భవిష్యత్తు దీపాలను ఆర్పి వేద్దామా?
***********
రైతులు కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు పేదలు అన్యాయానికి గురవుతున్నటువంటి సబ్బండ వర్గాల వాళ్ళ మాదిరిగానే విద్యార్థులు కూడా బలవన్ మరణాలకు పాల్పడడం భారతదేశంలో అత్యంత విచారకరం. తరచుగా రైతుల ఆత్మహత్యలు అంటూ ప్రస్తావించే తరుణంలో అంతకు మించిన స్థాయిలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బావి భారతాన్ని చేజేతులా చీకట్లోకి నెట్టి వేయడమే. 2015 నుండి 2025 మధ్యన గత పదిఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు బలవన్ మరణాలకు పాల్పడినట్లు గణాంకాలు తెలియజేస్తుంటే
భావి భారత పౌరుల మృత్యు ఘోష పాలకులతో సహా ఎవరికి పట్టకపోవడం పట్ల పార్లమెంటరీ స్థాయి సంఘం ఆవేదన వ్యక్తం చేయడం ఒక అంశం కాగా ఈ మరణాల వలన ఆయా కుటుంబాలకే కాదు దేశ అభివృద్ధికి ప్రజాస్వామ్య మను గడకు కూడా తీరని నష్టంగా భావించవలసినటువంటి అవసరం ఉంది. దేశ భవిష్యత్తుకు ఉజ్వల కాంతిని అందించగలిగిన దారి దీపాలుగా చలామణి అవుతున్నటువంటి విద్యార్థి లోకం అర్ధాంతరంగా కనుమరుగు కావడం వెనుక గల కారణాలను పరిశీలించకపోతే ఎలా? భారతదేశంలోని 30 విశ్వ విద్యాలయాలలో గతంలో చేసిన ఒక సర్వే ప్రకారం గా ప్రతి పదిమందిలో ఒకరికి అంతకుముందు ఆత్మహత్య ఆలోచన వచ్చినట్లు వెల్లడైంది అంటే ఏదో రకంగా ఆత్మహత్య వైపు విద్యార్థులు ఆకర్షించబడడాన్ని మనం గమనించాల్సి ఉంది. మరో స్వచ్చంద సంస్థ అధ్యయనం ప్రకారం కూడా అన్ని వర్గాల ఆత్మహత్యలతో పోల్చుకున్నప్పుడు గత రెండు దశాబ్దాలలో విద్యార్థులవి అదనంగా రెండు రెట్లు అధికంగా నమోదయినట్లు తెలుస్తూ ఉంటే ఇలాగే వదిలి పెడదామా? నిర్లక్ష్యంగా మౌనంగా మిగిలి పోదామా? జాతికి ఎనలేని వారసత్వ సంపదగా భవిష్యత్తును శాసించగలిగే విద్యార్థి లోకం పిల్లలు ఈ రకంగా అర్ధాంతరంగా రాలిపోతే భవిష్యత్తులో నాయకులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, మేధావులు, బుద్ధి జీవుల సంఖ్య అన్ని రంగాల నిపుణుల అందుబాటు అంధకారంలోకి నెట్టి వేయబడినట్లే కదా!
సుప్రీం చొరవను స్వాగతించాలి. అయితే పాలకుల కార్యాచరణ పైన ఇప్పటికీ అనుమానమే:-
***************
కారణాలు ఏవైనా ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత సంఖ్య భారీగా పెరగడాన్ని సామాజిక సమస్యగా భావించిన సుప్రీంకోర్టు గత సంవత్సరం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జాతీయ విపత్తు నుండి యువతను రక్షించడానికి దేశవ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ ను నియమించాలని సర్వోన్నత న్యాయస్థానం 2025 మార్చిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మానసిక దౌర్బల్యానికి గురవుతున్నటువంటి విద్యార్థుల మానసిక ప్రవృత్తికి తగిన పరిష్కారాలను వెతకడం ద్వారా నివేదికను తగిన ఆధారాలతో ప్రభుత్వానికి అందించడం ఆ టాస్క్ ఫోర్స్ ముందున్న కర్తవ్యం అని తెలుస్తుంది. ఒత్తిడితో కూడుకున్న చదువుల విష వలయం నుండి విద్యార్థి లోకాన్ని కాపాడడానికి కొన్ని కీలక మార్గదర్శకాలను కూడా విడుదల చేసిన సర్వోన్నత న్యాయస్థానం కార్యాచరణ వైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని చేసిన సూచనను పాలకులు తమ సామాజిక బాధ్యతగా అమలు చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకు? స్వప్రయోజనాల కోసమేనా? సుప్రీం సూచించిన కొన్ని కీలక అంశాలు...
--- అన్ని విద్యాసంస్థలలో నిపుణులైన సైకాలజిస్టులు కౌన్సిలర్లను ఏర్పాటు చేసి భరోసా కల్పించడం
-- ప్రతిభను గుర్తించడం అవసరమే కానీ వెనుకబడిన వారిని ఎగతాళి చేయకుండా సరైన ప్రోత్సాహాన్ని అందించే సమాంతర కృషి కొనసాగాలి.
-- మార్కులు ర్యాంకులకు పరిమితమయ్యే యాంత్రిక విద్య విధానాన్ని నిరసిస్తూనే చరిత్ర, సంస్కృతి, కళ లు, క్రీడలు, మానసిక స్థైర్యాన్ని ప్రోత్సహించడం.
-- ఆత్మహత్యలను నిరోధించే హెల్ప్ లైన్ నంబర్లను ప్రదర్శించడం ద్వారా ధైర్యాన్ని కల్పించడం
-- విద్యాసంస్థల తో పాటు అన్నివేళలా మత్తు మందులు డ్రగ్స్ నుండి దూరంగా ఉంచడం.
పిల్లల ఇస్టా ఇష్టాలపై ఆధారపడినటువంటి
చదువులను తల్లిదండ్రులు సమాజము ప్రభుత్వాలు ప్రోత్సహించడంతోపాటు జ్ఞాపక శక్తికి మాత్రమే పరిమితం కాకుండా నైపుణ్యాలను సృజనాత్మకతను ప్రతిభను పెంపొందించే అంశాలకు సిలబస్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సరైన పరిశోధనను నిర్వహించి సుప్రీంకోర్టు సూచించిన కీలక నిబంధనల నేపథ్యంలో కార్యాచరణను ప్రారంభించడం ద్వారా పిల్లలలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంతోపాటు జీవితం యొక్క లోతుపాతు లు, భవిష్యత్తు బాధ్యతలు, దేశ భవిష్యత్తులో పోషించవలసిన పాత్ర, భవిష్యత్తు తమదే అనే ఆలోచనను కలిగించే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం కూడా విద్యార్థి లోకాన్ని శక్తి యుక్తులు యుక్తిపరులుగా తీర్చిదిద్దడానికి బలవత్తర మైన శక్తిగా మార్చడానికి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడం సామాజిక బాధ్యతతో కూడుకున్న నిర్ణయం కాగా ప్రభుత్వాలు పాలనాపరమైన జాతి భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతగా యువతను కాపాడుకోవడంలో ముందు వరుసలో ఉండాలి. తమ శక్తి యుక్తులను దార పోయాలి యువతలో ఆత్మస్థైర్యాన్ని పెంచి పోషించడానికి చట్టబద్ధంగా కొనసాగుతున్న డ్రగ్స్ క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు, మద్యం వంటి వాటిని దృఢహస్తంతో అణచివేసినప్పుడు మాత్రమే యువతను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అ రసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )