సుపరిపాలన వేదిక "ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ " ప్రజల మేనిఫెస్టోను పరిశీలిద్దాం

Feb 29, 2024 - 12:48
Mar 1, 2024 - 16:58
 0  8
సుపరిపాలన వేదిక "ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ " ప్రజల మేనిఫెస్టోను పరిశీలిద్దాం

 ప్రలోభాలతో కూడుకున్న రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను తిరస్కరిద్దాం.

తాత్కాలిక ప్రయోజనాలు వద్దు శాశ్వతమైన  అభివృద్ధి, సంక్షేమం,  విద్య వైద్యం,  మౌలిక అవసరాలు ముద్దు అని నినదిద్దాం.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా బారా సా  పార్టీ ప్రారంభించిన ఉచితాలు ప్రలోభాల మేనిఫెస్టో  ఆధారంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి  తాత్కాలిక ప్రయోజనాల కోసం  ఎన్నికల ప్రణాళికలు ప్రకటించి  అలవి గాని  అంకెల గారడీ మన ముందు పెట్టడం  గత నెల రోజులుగా మనం  గమనించే ఉన్నాం  .కొన్ని వర్గాల ప్రయోజనం కోసం మాత్రమే  అవకాశాలు ఉండి, ప్రధానమైనటువంటి రంగాలను విస్మరించి, విద్యా వైద్యాన్ని గాలికి వదిలి,  పేదరికం నిరుద్యోగం ఆకలి చావులు ఆత్మహత్యల వంటి మౌలిక అంశాలను పరిగణనలోకి తీసుకో ని కారణంగా  బారాస ప్రభుత్వం ప్రజల ముందు దోషిగా నిలబడవలసి వచ్చింది. అదే కోవలో ప్రకటించిన ఇతర రాజకీయ పార్టీలు కూడా  ప్రజా మేనిఫెస్టోను ప్రకటించక  ఆకర్షణ పథకాలను అమలు చేయడానికి సిద్ధపడితే ప్రజలు భవిష్యత్తులో తరిమికొడతారని గుర్తిస్తే మంచిది  .ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్  సుపరిపాలన వేదిక  పద్మనాభ రెడ్డి గారి  నాయకత్వంలో కొనసాగుతున్న స్వచ్ఛంద సంస్థ  ఇటీవల ప్రకటించిన ప్రజా మేనిఫెస్టోను  పరిశీలించి  అవగాహన చేసుకుని  రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను  బుట్ట దాఖలు చేసి ప్రధానమైన డిమాండ్ల  పరిష్కరించే పార్టీలకే ఓటు వేయడానికి  నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది . 30 నవంబర్ 2023న ఎన్నికలను పురస్కరించుకొని  ప్రజా మేనిఫెస్టోను ఒక్కసారి పరిశీలించి  పునరాలోచన చేద్దాం . తాత్కాలిక ప్రయోజనాలపై  తాయిలాల పైన మనకు ఉన్నటువంటి బ్రమలను తొలగించుకుందాం. 
   ప్రజా మేనిఫెస్టో లోని  అంశాలు  :-
************
---అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలంటే  ఉచిథా లకే ఐదు సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని మేధావులు అంచనా వేసిన తరుణంలో  ఇదంతా రాజకీయ పార్టీల యొక్క అల్ప బుద్ధిని , అధికార దాహాన్ని మాత్రమే సూచిస్తున్నదని గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో  ఈ వేదిక విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, మేధావులు, కార్మికులు, ప్రజాసంఘాలు   అన్ని వర్గాలతో చర్చించి  35 అంశాలతో కూడిన మేనిఫెస్టోను తయారు చేసినట్లుగా  సంస్థ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి గారి ప్రకటన ద్వారా తెలుస్తున్నది .
-- విద్యా వైద్య రంగాలకు బడ్జెట్లో 25% నిధులు కేటాయించి ఈ రెండు శాఖలను కూడా ప్రక్షాళన చేసి  పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి.
--  సంక్షేమ పథకాలకు అన్ని వర్గాలకు గాను 30% బడ్జెట్లో నిధులను కేటాయించాలి  .
---రాష్ట్ర ఆర్థిక సంఘం సూచించిన విధంగా గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలకు క్రమం తప్పకుండా నిధులను  జనాభా దామాషా, అవసరాలను బట్టి విడుదల చేయాలి .
--- పెట్రోల్ డీజిల్ పైన పన్ను తగ్గించాలి .
--- ఐదు ఎకరాలలోపు రైతులకు మాత్రమే రైతుబంధు రైతు బీమా పథకాన్ని అమలు చేయాలి రైతుకు ఉచిత విద్యుత్తు మూడు మోటార్ల వరకు మాత్రమే పరిమితం చేయాలి  .
--నకిలీ విత్తనాలు  ఎరువుల పైన కట్టడి చేయడంతో పాటు నూనె గింజలు చిరుధాన్యాలు  ఇతర అన్ని రకాల వాణిజ్య పంటల సాగుకు ప్రోత్సాహం కల్పించాలి.
--  రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మించిన అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల నాణ్యత అవినీతిపైన  ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీ విచారణ జరిపి  దోషులను శిక్షించాలి.
--  విద్యుత్ కంపెనీల పనితీరుపై శ్వేత పత్రం విడుదల చేయడంతో పాటు ప్రభుత్వ పరిధిలో పారదర్శకతను సాధించి   రాజకీయ ఉద్యోగ వర్గాల అవినీతిపై ఉక్కుపాదం మోపాలి.
--  కర్ణాటక రాష్ట్రం మాదిరిగా తెలంగాణలో పటిష్టమైన లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడం ద్వారా  అవినీతిని పూర్తిగా నిర్మూలించాలి.
--  కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడంతోపాటు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చెప్పిన పథకాలకు అయ్యే ఖర్చు  ఏ రూపంలో నిధులను సమీకరిస్తారో తెలియచేయాలి.
--  పోలీసు శాఖలో సంస్కరణలు చేపట్టాలి  పోలీసు విభాగం ప్రజల పక్షాన పని చేయాలి.
--  ఆహారము, తిను  బండారాలు  కల్తీ అవుతున్న సందర్భంలో  ప్రభుత్వం నిఘా వేసి  కఠినంగా శిక్షించాలి  .
--శాసనసభ్యులు మంత్రులు, ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం తమ ఆస్తి వివరాలు  బహిరంగంగా ప్రజలకు ప్రకటించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి  .
--పర్యావరణ పరిరక్షణ    లో భాగంగా అడవులను  రక్షించాలి  అడవుల నరికివేతను,  ప్రకృతి, గు ట్టల విధ్వంసాన్ని ఆపాలి.
--  వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సరైన మార్గదర్శకాల ప్రకారమే అమలు చేయాలి.
--  నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు  పార్టీ టిక్కెట్లను  నిరాకరించాలి .
-- ప్రభుత్వ భూములను ఇస్టా రాజ్యంగా  అమ్మడాన్ని నిషేధించాలి.
--  అన్ని రకాల వస్తువుల ధరలను నియంత్రించి పేదలకు అందుబాటులో ఉంచాలి .
-- ఉపాధి ఉద్యోగ అవకాశాలను  భర్తీ చేయడంతో పాటు  నైపుణ్యాన్ని పెంపొందించే కృషి జరగాలి.
--  గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డును  ఏర్పాటుచేసి వారి హక్కులను పరిరక్షించాలి.
      ఈ అంశాలతో విడుదల చేసిన ప్రజా మేనిఫెస్టోను  అమలు చేయాలంటే ఓటర్లు  నిజాయితీగా తమ ఓటు హక్కును పెద్ద మొత్తంలో  వినియోగించుకోవడం ద్వారా తమ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు.  రాజకీయ పార్టీలు చట్టాల పరిధిలో కాకుండా తమ  పాలనయే చట్టం అనే విధంగా భావిస్తున్న కారణంగా  ప్రజలు ఓడిపోతున్నారని  వివిధ తాయిలాలు  ప్రకటిస్తున్న మేనిఫెస్టోలకు ఎటువంటి చట్టబద్ధత లేదని, అవి చిత్తు కాగితాలతో సమానమని,  ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలతో పాటు  పోటీలో ఉన్న అభ్యర్థుల వ్యక్తిత్వం, సమర్థత , సేవా తత్పరత,  శీలా న్నీ దృష్టిలో ఉంచుకొని  అభ్యర్థులను గెలిపించాలని   అభ్యర్థుల గత చరిత్ర కూడా తెలుసుకొని ఓటు వేయాలని  మేధావులు సూచిస్తున్న అంశాలు  ప్రజలు పాటిస్తే మంచిది . "తాత్కాలిక ప్రయోజనాల వద్దు శాశ్వతమైన అభివృద్ధి సంక్షేమ ముద్దు" అనే భావన ప్రజలలో రానంతవరకు  రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలతో భ్రమలకు గురిచేస్తారు, డబ్బు మద్యంతో  బానిసలుగా తయారు చేసుకుంటారు అనేది నగ్నసత్యం.

--వడ్డేపల్లి మల్లేశం
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333