సమస్యల సుడిగుండంలో సూర్యాపేట మున్సిపాలిటీ - 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి

Aug 24, 2026 - 20:16
 0  2
సమస్యల సుడిగుండంలో సూర్యాపేట మున్సిపాలిటీ - 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి

కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ - కలెక్టర్ కు వినతి

సూర్యాపేట, ఆగస్టు 24 : సూర్యాపేట మున్సిపాలిటీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని, దాని అభివృద్ధికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ ను వెంటనే కేటాయించాలని ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 2 నుండి ఆగస్టు 20 వరకు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పాదయాత్రలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించాలని కోరుతూ ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ... పట్టణంలో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో అనేక వార్డుల్లో మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్గంధం వెదజల్లుతోందన్నారు. ఫాగింగ్ చేయకపోవడంతో ప్రజలు మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనేక వార్డుల్లో తాగునీరు, వాడకం నీరు సరిగా అందడం లేదని, చిన్న వ్యాపారులకు సరైన స్థలాలు లేక నష్టపోతున్నారని, వారికి స్థలాలు కేటాయించాలన్నారు. పట్టణం చుట్టూ నీటి వసతులు ఉన్నా వాటిని వినియోగంలోకి తేకపోవడంతో తాగు, సాగునీటికి ఇబ్బందులు వస్తున్నాయని, పట్టణ పరిసర చెరువులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి.
60 ఫీట్ రోడ్డు - కలెక్టరేట్ రోడ్డును కలుపుతూ హైటెక్ బస్ స్టాండ్ వద్ద అండర్ పాస్ నిర్మించాలి.
కొత్త బస్టాండ్ నుండి ఇమ్మాపురం ఫ్లైఓవర్ వరకు, గాంధీ బొమ్మ నుండి కుసుమవారి గూడెం వరకు రోడ్లను నాలుగు లైన్లుగా విస్తరించాలి.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.
అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.
ప్రజాధనంతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలి.

మున్సిపాలిటీ సిబ్బందికి, ప్రభుత్వ కార్యాలయాలకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని, వీధి లైట్లు, సీసీ రోడ్ల నిర్మాణంలో పారదర్శకత పాటించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నరసయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333