వన మహోత్సవ లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలి 

Aug 24, 2026 - 19:45
Aug 24, 2026 - 19:46
 0  5
వన మహోత్సవ లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలి 

రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

నేడు (మంగళవారం, 25 ఆగస్టు )జిల్లావ్యాప్తంగా భారీగా సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలి

మొక్కల సంరక్షణ మనుగడపై ప్రత్యేక దృష్టి సారించాలి

ములుగు, 24 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- వన మహోత్సవంలో భాగంగా జిల్లాలకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.సోమవారం వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, డిఎఫ్ఓ వికాస్ మీనా తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా  16.06 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 9.06 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు.

రేపు వన మహోత్సవంలో భాగంగా అన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు.ఇటీవల కురుస్తున్న వర్షాలు రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అనుకూల వాతావరణాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. ప్రతి మండలం, గ్రామం పట్టణ ప్రాంతానికి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.అంగన్‌వాడీ టీచర్లు స్వయం సహాయక సంఘాల మహిళలు ఎన్‌ఎస్‌ఎస్‌ ఎన్‌సీసీ విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా ఆహ్వానించి, కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని మొక్కల మనుగడను ప్రతిరోజూ పర్యవేక్షించాలని చనిపోయిన మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలను నాటాలని ఆదేశించారు. నాణ్యమైన మొక్కలను మాత్రమే నాటాలని అవసరమైన మొక్కలను సకాలంలో తరలించాలని సూచించారు.

అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి మొక్కలు నాటాలని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్రీని ప్రోత్సహించాలని అన్నారు. దేవాలయాలు, పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల్లో కూడా ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని సూచించారు. బ్లాక్ ప్లాంటేషన్ ప్రాంతాల్లో నీటి సౌకర్యం కల్పించాలని వన మహోత్సవ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి, మీడియాను కూడా భాగస్వామ్యం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేసి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డి ఆర్ డి ఓ రవీందర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333