శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Aug 4, 2026 - 20:41
Aug 4, 2026 - 20:42
 0  3
శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

తెలంగాణ వార్త ఆగస్టు 4 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం.

 ఆలయ ప్రాచీనతకు భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలి 

 భక్తులకు మెరుగైన దర్శన, మౌలిక వసతులు కల్పించేలా పనులు వేగవంతం చేయాలి 

వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో చేపడుతున్న పునర్నిర్మాణ, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట తో కలసి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న పునర్నిర్మాణ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ముందుగా జిల్లా కలెక్టర్ ఉత్తర ద్వార దర్శనం వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించిన డ్రాయింగ్స్‌ను పరిశీలిస్తూ నిర్మాణాల రూపకల్పన, పనుల నాణ్యత, అమలు తీరు, పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం నిర్మాణ పనులను ముక్కోటి ఏకాదశి నాటికి తప్పనిసరిగా పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బంది, యంత్రాలను వినియోగించి పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

అనంతరం తూర్పు వైపు నుంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పర్యటిస్తూ తూర్పు, దక్షిణ, పడమర వైపులా కొనసాగుతున్న పునర్నిర్మాణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రతి నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్స్‌ను పరిశీలిస్తూ అధికారులు, ఇంజినీర్లను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల రూపకల్పనలో ఆలయ ప్రాచీనతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

 ఆలయం నుంచి గోదావరి ఘాట్ వరకు ఉన్న మార్గాన్ని జిల్లా కలెక్టర్ కాలినడకన పరిశీలించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ మార్గంలో రాకపోకలు సాగించే నేపథ్యంలో రోడ్డు విస్తరణ, పాదచారుల మార్గాలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ వెలుగులు, భద్రతా ఏర్పాట్లు, సూచిక బోర్డులు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయం నుంచి ఘాట్ వరకు రోడ్డు విస్తరణ పనులను పుష్కరాల నాటికి పూర్తిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

అనంతరం చిత్రకూట మండపం వద్ద కొనసాగుతున్న తొలగింపు పనులను పరిశీలించారు. మండపంలోని పురాతన రాతి స్తంభాలు, శిల్ప సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా తొలగింపు ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రాతి స్తంభాలను గుర్తింపు సంఖ్యలతో నమోదు చేసి నిపుణుల పర్యవేక్షణలో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఈ తొలగింపు ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. పురాతన వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రతి పనిని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి చేరుకున్న జిల్లా కలెక్టర్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, జిల్లా కలెక్టర్ శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి ఆశీర్వదించారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు ఈ ఏడాది మార్చి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు .

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను పూర్తిచేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందన్నారు. అన్ని పనులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అవసరమైన పరిపాలనా, సాంకేతిక, ఆర్థిక చర్యలను సమన్వయంతో అమలు చేస్తున్నామని తెలిపారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా మరింత వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రోడ్లు & భవనాల శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాచీనత, ఆధ్యాత్మిక విశిష్టతకు భంగం కలగకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు, విశాలమైన రాకపోకల మార్గాలు, ఆధునిక మౌలిక వసతులు కల్పించి గోదావరి పుష్కరాల నాటికి అన్ని ప్రధాన పనులను పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ పర్యటనలో భద్రాచలం తాసిల్దార్ రవికుమార్, పంచాయతీ ఈవో, ఆర్ అండ్ బి శాఖ ఈఈ నాగేశ్వరరావు,దేవాదాయ శాఖ అధికారులు, రోడ్లు & భవనాల శాఖ ఇంజినీర్లు,  సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333