ఎస్ఐఆర్కు ఆగస్టు 10 వరకు గడువు పొడిగింపు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విజయానికి రాజకీయ పార్టీల సహకారం కీలకం
జోగులాంబ గద్వాల 4 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు విజయవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భారత ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 10 వరకు పొడిగించిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 5,03,859 ఎన్యూమరేషన్ ఫారాల్లో 4,38,852 (87.10 శాతం) ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు.మరో 63,488 (12.60 శాతం) యూఈఎఫ్లు,1,519 (0.30 శాతం) ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.మిగిలిన డిజిటలైజేషన్ను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. గైర్హాజరు,వలస వెళ్లిన, మృతి చెందిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా ధృవీకరించాలన్నారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లాలో ఎస్ఐర్ కార్యక్రమం సజావుగా కొనసాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.తమ పరిశీలనలో గుర్తించిన పలు అంశాలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి,కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో గద్వాల తహసిల్దార్ హరికృష్ణ,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.