వైద్యాన్ని యాంత్రికంగా కాకుండా మానవతా కోణాన్ని జత చేయాలి
వైద్యాన్ని యాంత్రికంగా కాకుండా మానవతా కోణాన్ని జత చేయాలి .* ప్రైవేట్తో పాటు ప్రభుత్వ వైద్య రంగంలో కూడా ధగా,దోపిడీ కొనసాగితే ఎలా*?* అందుకే కదా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రజలు డిమాండ్ చేసేది.*
*************************************
--- వడ్డేపల్లి మల్లేషము 9 0 1 4 2 0 6 4 1 2
----16...11...2024********************
భారతదేశంలో ప్రజలు విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని అది అత్యంత నాణ్యమైన స్థాయిలో సమగ్రంగా ఉండాలని అవినీతి మోసాలు దోపిడీకి తావులేని పద్ధతిలో కొనసాగాలని అనాదిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ పాలకులు ఈ రెండు రంగాలను మాత్రం కావాలని పక్కన పెట్టడం, ప్రైవేటుకు దారా దత్తం చేయడం, మొక్కుబడిగా ప్రభుత్వ రంగంలో నడపడాన్ని మనం గమనించవచ్చు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా ఒక దశలో" విద్య, వైద్యాన్ని పాలకులు ఉచితంగా నాణ్యమైన స్థాయిలో అందించడానికి ప్రయత్నం చేయరు కారణం ఏమిటంటే ఆరోగ్యంతో విజ్ఞానంతో చైతన్యవంతులైతే ప్రజలు పాలకుల యొక్క దుర్మార్గాలను ఎత్తిచూపుతారు ప్రతిఘటిస్తారని హెచ్చరించడం గమనార్హం. " అయినప్పటికీ భారత రాజ్యాంగంలో విద్యా వైద్యాన్ని ప్రజలకు నాణ్యమైన స్థాయిలో ఉచితంగా అందించాలని స్పష్టంగా ఆదేశించడం కూడా జరిగిన పాలకులు ఇప్పటికీ అంటీ ముట్టినట్లు వ్యవహరించడం బహుశా అందుకేనేమో! ప్రధానంగా వైద్యం ఆరోగ్యం అనేది అత్యంతమైన కీలక అంశం భారతదేశంలోని పేదరికం, నిరుద్యోగం, ఉపాధి లేమి వంటి కారణాల వలన సరైన పోషకాహారం అందకపోవడం చికిత్స చేసుకోవడానికి నిధులు లేకపోవడం తద్వారా అనారోగ్యాన్ని గాలికి వదలడం వలన అనేక కుటుంబాలలో ఇబ్బందులు తలెత్తి బక్క చిక్కిపోవడం, మృత్యువాత పడడం, ప్రైవేట్ రంగంలో ఖర్చులకు అప్పులు చేస్తున్న కారణంగా మరింత పేదరికంలోకి ఆ కుటుంబాలు జారుకోవడం వంటి ఘోరమైన పరిణామాలను మనం గమనించవచ్చు. ఇటీవల కాలంలో గమనించినప్పుడు అరకొర ప్రభుత్వ రంగంతో పాటు పూర్తిగా ప్రైవేటుపరమైన వైద్యం ప్రజల పాలిట మోసం ధగా దోపిడీ గా మారిందని ప్రజలు వాపోతుంటే ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని అందించడానికి అంతగా ప్రయత్నించకపోయినప్పటికీ ఏదో మూలన ఆసుపత్రులను ప్రారంభిస్తున్నట్లు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటిస్తుంటాయి కానీ అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోగా దాటవేసే ధోరణిని ని ప్రదర్శించడాన్ని గమనించినప్పుడు సంపన్న వర్గాలు ఏ రకంగా నైనా ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందగలరు కానీ పేద వర్గాలు మధ్యతరగతి సామాన్య ప్రజానీకం సంగతి ఏమిటి? అనేది ఇవాళ దేశంలో చర్చనీయాంశం అయినది. ఇది కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు అరకొర బడ్జెట్ నిధుల కారణంగా దేశవ్యాప్తంగా కూడా ప్రైవేట్ రంగానికి వైద్యాన్ని కట్టబెట్టి ప్రభుత్వం చోద్యం చూడడాన్ని మనం గమనించవచ్చు.
వైద్యులు యాంత్రికంగా కాకుండా మానవతా ధోరణితో వ్యవహరిస్తే బాగుండు ------- సామాన్య ప్రజల భావన:-
**********************************
ప్రభుత్వమా? ప్రయివేటా? సంభంధం లేకుండా వివిధ రాష్ట్రాలలో వైద్య ఆరోగ్య సౌకర్యాలు కొనసాగుతున్న తీరును పరిశీలించినప్పుడు కొన్నిచోట్ల వైద్యులు రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, చెప్పిన విషయాలు పూర్తిగా వినకపోవడం, సందేహాలు తీ ర్చకపోవడం, కసురుకోవడం వంటి లక్షణాల కారణంగా తాము సరైన స్థాయిలో చికిత్స పొందలేకపోతున్నామని రోగులకు చికిత్స కంటే వైద్యుని తీపి వచనాలు ముఖ్యమని నమ్మే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు ఇక ప్రభుత్వ రంగంలోని వైద్యశాలలో నైతే దాటేసే ధోరణి ప్రదర్శించడం,అవసరమైన చికిత్సలు చేయించుకోవడానికి రోగి ఇష్టపడిన ఆ సౌకర్యాలు అంత పెద్దగా అవసరం లేదని దాటవేయడం, అప్పుడు రోగులు అయోమయంలో పడిపోవడం వంటి సందర్భాలు మన దృష్టికి కూడా వస్తున్నవే కదా! ఏం చేయాలో అర్థం కాక ప్రైవేటు వైద్యశాలకు పోతే ఖర్చులకు డబ్బులు లేక బాధలు దిగమింగి ఆందోళనతో గడపడాన్ని కూడా మనం గమనించవచ్చు. కొన్నిచోట్ల వైద్యులు రోగి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని హృదయానికి దగ్గరగా ఆలోచించి సరైనటువంటి సలహా సూచనలు ఇవ్వడంతో పాటు తక్కువ ఖర్చుతో వైద్యానికి ఉన్నటువంటి దారులను కూడా తెలియజేసిన సందర్భాలు లేకపోలేదు. కానీ అలాంటివారు చాలా తక్కువ ముఖ్యంగా ఇలాంటి మానవతా ధోరణి ప్రభుత్వ ప్రైవేటు రంగాలలోని వైద్యశాలల్లో ఉన్నప్పుడు మాత్రమే ముఖ్యంగా పేద వర్గాలకు కొంతైనా సాంత్వన లభిస్తుంది. మందులు ఎలా వాడాలో? చికిత్స ఇంతటితో అయిపోయిందా? కొనసాగించాలా? ప్రభుత్వ వైద్యశాలల్లో సరైనటువంటి మందులు లేకపోతే బయట తీసుకోవడానికి అవకాశం ఉందా? లేదా అడగడానికి సంతోషించే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నప్పుడు ఇదంతా రోగులు గందరగోళంగా భావించే అవకాశం ఉన్నది. అందుకే వైద్యులు కిందిస్థాయి సిబ్బంది ప్రయోగశాలలోని ఉద్యోగులు కూడా పూర్తిస్థాయిలో రోగులకు తృప్తికరమైనటువంటి సమాధానాలు ఇవ్వడం ద్వారా సందేహాలను తీర్చడానికి ప్రయత్నం ఆదేశాలు జారీ చేయాలి. ఎందుకంటే ప్రైవేటు వైద్యశాలలోనైతే ఫీజులను చెల్లిస్తున్నారు ప్రభుత్వ వైద్యశాలలోనైతే ఈ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి వేతనాలు అంతా కూడా ప్రజల చెమట ద్వారా ఉత్పత్తి అయినటువంటి డబ్బే కదా! కొన్ని చోట్ల పని చేసినటువంటి వైద్యులు ప్రభుత్వ ప్రైవేటు ఏదైనా కూడా ఆ ప్రాంతాలలో ఒక ఆదర్శ వ్యక్తిగా గుర్తించబడిన సందర్భాలు కూడా అనేకం. ఎందుకంటే ప్రజలతో మమేకమై, అదే ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని, కష్టసుఖాలలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆలోచించేవాళ్లు, ఉచితంగా అవకాశం ఉన్న మేరకు చికిత్సను అందించడానికి ముందుకొచ్చే వాళ్ళు కూడా అనేకంగానే ఉన్నారు. ఆ రకంగా ప్రతి ఉద్యోగి వైద్యుడు కూడా యాంత్రిక ఆలోచనను వదిలి, స్వార్థపూరిత లక్షణాలను విడిచిపెట్టి, ప్రజా ప్రయోజనాన్ని సామాజిక చింతనతో చేస్తున్న వైద్య వృత్తికి మానవత కోణాన్ని జతచేసి తోటి మనిషిని సాటి మనిషిగా చూడాలి. మనిషిని మనిషిగా ప్రేమించాలి వైద్య సేవలందించడం నా బాధ్యత అని గుర్తించిన నాడు ఇలాంటి విమర్శలు రాకుండా ఉండే అవకాశం ఉన్నది. విమర్శించబడి ప్రజలకు దూరమవుదామా? ప్రజలతో గుర్తించబడి వైద్యానికి చేరువవుదామా? ఆలోచించుకోవాల్సింది వైద్య సిబ్బంది మాత్రమే.
వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?
------***********************
రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఈ హక్కును పొందడానికి ప్రజలు మౌలికంగా ఆలోచిస్తున్నప్పటికీ పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా అందని ద్రాక్షగా ప్రజలకు మిగిలిపోతున్నది.ప్రజలు ప్రభుత్వ నాణ్యమైన వైద్యంకోరితే కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలకు కూడా సుమారుగా 1-2 శాతం మధ్యన మాత్రమే వైద్య రంగానికి బడ్జెట్లో నిధులను కేటాయిస్తున్న కారణంగా ప్రభుత్వ వైద్యరంగం బలోపేతం కావడం లేదు అరకొర సౌకర్యాల కారణంగా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడానికి విసుగు చెంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్న కారణంగా తమ ఆదాయంలో 60-- 70 శాతాన్ని కోల్పోతూ పేదలు మరి పేదలు అవుతున్నారు. ప్రభుత్వ రంగంలోనైతే ఉద్యోగులు వైద్య సిబ్బందిని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడానికి, స్థానిక శాసనసభ్యుల నుండి మంత్రుల వరకు కూడా నిలదీయడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతోనే ప్రజలు ప్రభుత్వ రంగంలో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల పట్ల సామాజిక చింతనతో బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులైతే ప్రజలు మరింతగా ప్రశ్నించే అవకాశం ఉంటుందని అందుకే వారి పట్ల చూసి చూడనట్లు వ్యవహరించాలని ఉద్దేశంతోనే బహుశా ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని బలోపేతం చేయడం లేదనే వాదన సర్వత్రా వినపడుతున్నది. దీనికి అనేకమంది బుద్ధి జీవులు సామాజికవేత్తలు మేధావుల సమర్థన కూడా మనకు కనిపిస్తుంది. ఇ టీవలి కాలంలో ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు కొంతమంది ప్రైవేటు పెట్టుబడిదారుల వలలో చిక్కిన సందర్భాలు పేదవాళ్లను తీసుకువచ్చి కిడ్నీలు ఇతర విలువైనటువంటి అవయవాలను తమకు కావాలని కోరినటువంటి ముఠాను ప్రోత్సహిస్తున్నట్లుగా కూడా ప్రభుత్వ ప్రైవేటు వైద్యుల పైన పలు ఆరోపణలు వస్తున్నవి. ఈ అంశాల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి ఎందుకంటే వైద్యులను నమ్మి ఆసుపత్రులకు వచ్చే పేద వర్గాలకు చికిత్స పేరున ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి లోపల తమ ప్రాణాలకే ముప్పు ఏర్పడితే ఎలా? అంత ఎందుకు చనిపోయిన తర్వాత కూడా చికిత్స కొనసాగిస్తూ కొన ఊపిరితో ఉన్నారని అవకాశం ఉన్నదని ఐసీయూలో ఉన్నాడు కనుక లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి లక్షల కోట్ల రూపాయలను దండుకుంటున్న సందర్భాలను కూడా మనం గమనిస్తే వైద్య వృత్తి ఎంత నీచమైన స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అంటే దోపిడీ దగా మోసం దుర్మార్గం అనదగినటువంటి అనైతిక పద్ధతులతో పాటు అవినీతికి కూడా పాల్పడుతున్న సందర్భాలను మనం గమనిస్తే వైద్య వృత్తిని గౌరవించాలా? విమర్శించాలా? ఏమీ తెలియని అయోమయంలో పడిపోతున్నాం అయినప్పటికీ కేవలం ప్రభుత్వ రంగంలోనే కొనసాగినట్లయితే ప్రజల, అధికారుల యొక్క పర్యవేక్షణతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రజలకు చట్టసభలకు బాధ్యత వహిస్తాయి కనుక కొంత నిబద్ధతగా పనిచేసే అవకాశం ఉంటుందని ప్రజల వాదన. అందుకు వైద్యశాలల్లో పని చేసే సిబ్బందికి పూర్తిస్థాయి వేతనాల తో పాటు రాత్రిపూట పనిచేసే వారికి మరింత ఎక్కువ వేతనాలను ఇవ్వడం ద్వారా ప్రజలను దృష్టిలో ఉంచుకొని వేతన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించవలసిన అవసరం ఉంది. కానీ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానంలో నామమాత్ర వేతనాలు ఇచ్చి సేవ చేయమనడం అంటే ఉద్యోగుల శ్రమను దోపిడీ చేయడమే అవుతుంది. అలాంటి పరిస్థి లోపల కూడా ప్రజలు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ద్వారా బడ్జెట్లో హెచ్చు నిధులు కేటాయించాలని, ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేయాలని,సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించాలని, ఎంతటి చికిత్స కైనా ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రజలు ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేసి ప్రభుత్వాలను ఒప్పించడo ద్వారా ప్రభుత్వ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదే.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసo రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సిద్దిపేట తెలంగాణ )