సవాళ్లు మాని ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి

Apr 26, 2024 - 16:47
Jun 7, 2024 - 18:58
 0  29
సవాళ్లు మాని ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి

పార్టీని ప్రక్షాళన చేయడమా?  మూసి వేయడమా?

 ఏదో ఒక ప్రత్యామ్నాయం ఎంచుకోవాలి.

పాలనకు ఆటంకం కల్పిస్తే  ప్రజలే తరిమికొట్టే రోజులు రావచ్చు.

ఎందుకంటే ప్రజలు తెచ్చు కున్న ప్రభుత్వాన్ని  అస్థిర పరచడం అంటే  రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే.

--- వడ్డేపల్లి మల్లేశం

పాల న గాడి తప్పినప్పుడు ప్రజల పక్షాన పని చేయడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత  ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో అభివృద్ధి సంక్షేమం సమతుల్యంగా సాగడానికి నిర్మాణాత్మక పాత్ర పోషించడం వరకే ప్రతిపక్షాల పాత్ర.  కాని దానికి భిన్నంగా బెదిరించడం, లొ o గ తీసుకోవాలని చూడడం , ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయడం,  ప్రజల మధ్యకు వెళ్లి గోల పెట్టడం  అంటే  ఒక రకంగా రాజ్యాంగ విద్రోహమే.  భారతదేశంలో ఏ రాష్ట్రంలో  ఉన్న ఒక ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గందరగోళపరిచిన పరిస్థితులు లేవు.  నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు అందించడం ద్వారా ప్రజల  హక్కులను సాధించడం , అభిప్రాయాలను గౌరవించడం,  డిమాండ్లను  పరిష్కరించుకోవడానికి కృషి జరిగిందే తప్ప  తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్  బెదిరించినట్టుగా  క్షణక్షణానికి సవాలు విసురుతూ ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటూ అస్థిరపరిచే ప్రయత్నం ఎక్కడా కనిపించదు . దేశంలో ఎక్కడా కనిపించని ఈ పరిస్థితి తమకే చెల్లుబాటు అయిందని భావించడం మూర్ఖత్వం కాదు  అది  నేరం కూడా . గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా అనేక సందర్భాలలో   మేధావులు సక్రమ పరిపాలన కోసం  అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం  తమ జ్ఞానాన్ని మేధస్సును ధారపోసి  ప్రతిఘటించి ప్రశ్నించినందుకు ఎంతో మందిని చెరసాల పాలు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు  .వారి యొక్క ఆలోచన ప్రజల పక్షాన ఉన్నందుకు కుట్ర అనే పేరు పెట్టడం కూడా జరిగింది ." ప్రజల కోసం ఆలోచించిన వారిది కుట్ర అయితే  ప్రభుత్వాన్ని పడగొడతామని, సంవత్సరంలో పడిపోతుందని,  అస్థిరపరిచి లేనిపోని సవాళ్లు విసిరి గందరగోళం సృష్టించి  అభియోగాలు మోపుతున్న టిఆర్ఎస్ పార్టీ పైన ఎన్ని కుట్ర కేసులు పెట్టాలి?" .
      నాలుగు మాసాల ప్రభుత్వమే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని  రాజీనామాకు సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు గారు సవాలు విసురుతూ  అసెంబ్లీ ముందు గన్ పార్క్ వద్దకు రావాలని ముఖ్యమంత్రి కి ఆదేశాలు జారీ చేయడం  హెచ్చరించడం  అంటే ఇది  విజ్ఞత , గౌరవం లేని, ప్రభుత్వాన్ని ప్రజలను  అవమానించే రాజకీయ పార్టీగానే టిఆర్ఎస్ ను చూడాలి.  అందుకే  ప్రజల ఆకాంక్షలను అమలు చేస్తూ ఆలోచన చేస్తూ తనదైన శైలిలో  పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గందరగోళ పరుస్తున్నందుకు టిఆర్ఎస్ పార్టీ పైన కేసులు పెట్టాలి.  కుట్ర కేసులు బనాయించాలి , దోషులను శిక్షించాలి ,ఆ వైపుగా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి. అప్పుడు కానీ అకారణంగా ప్రభుత్వాలను అస్థిరపరిచే దుర్మార్గపు చేష్టలకు  కళ్లెం వేయలేము .

ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి  ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు :-

ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, తమ హక్కులను సాధించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయంలో  ప్రజలకు లేని అతి ఉత్సాహం మీకు అవసరం లేదు  ఎందుకంటే మీ పరిపాలన కాలంలో అనేక హామీలు తుంగలో తొక్కి  పదేళ్లలో కూడా అమలు చేయక  అనేక వర్గాలను అవమానపరిచిన తీరు ఇప్పటికీ అందరికీ తెలుసు  .ప్రజల ఆత్మగౌరవాన్ని థా కట్టు పెట్టడంతో పాటు  జాతి సంపదను కొద్దిమంది సం  సంపన్న వర్గాలు, పెట్టుబడిదారులు, భూస్వాములకు కట్టబెట్టిన తీరు తెలిసిందే . ప్రతిపక్షాలను ప్రజాసంఘాలను మేధావులను బుద్ధి జీవులను  ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వ హయాంలో గుర్తించకపోగా నిర్బంధించి, అణచివేసి, ధర్నా చౌక్ ను ఎత్తివేసి, కనీస సభలు సమావేశాలు కూడా అనుమతించక  హింసించిన విషయం తెలుసు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఆడింది ఆట పాడిందే పాట అయినా అందరి హక్కులను కాపాడుతూ  ఎక్కడా నిర్బంధము లేకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్న విషయం మీ కళ్ళకు కనిపించడం లేదా ?

2023 నవంబర్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని,  ఓటు వేయకూడదని ,రాజ్యాంగ ద్రోహం జరిగిందని ,ప్రజలు నష్టపోయినారని మేధావులు బుద్ధి జీవులు ప్రజాసంఘాలు  రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన విషయం మీకు గుర్తుండాలి  .ఆర్థిక అరాచకత్వం, విధ్వంసం,  దోపిడీ, పీడన, అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని  తాకట్టు పెట్టిన విషయంపై ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు.  మీ ప్రభుత్వ పదేళ్ల కాలంలో జరిగిన దు ర్నీతికి సమాధానం చెప్పుకోవాలి.  మీ పార్టీ నుండి శాసనమండలి చైర్మన్గా  ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇటీవల పార్టీ యొక్క  నాయకత్వం అహంకారమే పార్టీ కొంపముంచిందని స్వయంగా  నిండు సభలో బహిరంగంగా వెల్లడించినప్పటికీ మీ పార్టీకి  జ్ఞానోదయం కలగడం లేదంటే  బెదిరించి లొంగ తీసుకోవాలనే మీ అహంకారం  ఆధిపత్యం  ఎంతో కాలం నిలువదని గుర్తించాలి. ఎవరైతే మీ పార్టీని పడగొట్టినారో అదే మేధావులు బుద్ధి జీవులు త్వరలో ఈ రాష్ట్రంలో  ప్రస్తుత ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, మీ  నోరు మూయించడానికి , దుష్ట పాలనను ఎండగట్టడానికి  సిద్ధమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. అంతేకాదు ప్రజలు కూడా తోడై మీ పార్టీని కార్యకర్తలను నాయకులను  ప్రభుత్వాన్ని అస్థిరపరిచే మీ అందరినీ తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని గుర్తిస్తే మంచిది. లేకుంటే మీ పార్టీ మనగడ ప్రశ్నార్థకమే  ?.

ఇప్పటికీ దేశంలో  ఎంతోమంది బుద్ధి జీవుల పైన  దేశద్రోహ కేసు నమోదైన విషయాన్ని గమనించినప్పుడు  అలాంటి వారి మీద ఉన్నటువంటి కేసులను రద్దుచేసి  ప్రభుత్వాలను పడగొట్టే ఇలాంటి అక్రమ రాజకీయ పార్టీల పైన కేసులు పెట్టడమే సరైనదని ఇప్పటికైనా న్యాయవ్యవస్థ చొరవ చూపాలి.  మేధావులు వెంటనే నోరు విప్పి  తమ మద్దతు ప్రకటించాలి. టిఆర్ఎస్ పార్టీని ఏకాకిని చేయడం, ఎన్నికల్లో ఓడించడం , ప్రజల సమక్షంలో ఎండగట్టడమే  ప్రస్తుతం మన  ముందున్న ప్రధాన కర్తవ్యం కావాలి.
(  వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సిద్దిపేట జిల్లా  హుస్నాబాద్ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333