వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకున్న వారే నిజమైన జర్నలిస్టులు
మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ 10 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా, నీతి, నిజాయితీ, నిర్భీతితో పనిచేస్తూ, వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకునేవారే నిజమైన జర్నలిస్టులని, అలాంటి వారినే సమాజం అక్కున చేర్చుకుంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన కృతజ్ఞత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో అక్రెడిటేషన్ కార్డులను కొందరు అంగట్లో సరుకుగా మార్చి, దాని విలువ లేకుండా చేసారని, ఈ చర్య వల్ల సమాజంలో దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయని శ్రీనివాస్ రెడ్డి విచారం వ్యక్తం చేసారు. అక్రెడిటేషన్ అనేది వృత్తి గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. మీడియా రంగాన్ని కలుషితం చేస్తూ అపహాస్యానికి గురిచేస్తున్న వారిని గుర్తించి, వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీడియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఆసరగా చేసుకుంటూ, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులు సాధించుకున్న సౌకర్యాలను, చట్టాలను రద్దు చేసేస్తుందని, ఆ చర్యలను అడ్డుకోవాలంటే జర్నలిజం వృత్తి నిబద్దతను మనం నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. సామాన్యుల భావప్రకటన స్వేచ్ఛకు సోషల్ మీడియా మంచి వేదిక అయినప్పటికీ, అందులో మంచితో సమానంగా చెడు, కల్పితాలు, అవాస్తవాలు ట్రోల్ అవుతుండడంటో దానికి విలువ లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంతోనే దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరిస్తూ కఠినమైన నిర్ణయాలను తీసుకోబోతుందని ఆయన అప్రమత్తం చేసారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వీడియో జర్నలిస్టులు సంఘటితమై బలమైన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఫోటో గ్రఫీ డే మాదిరిగానే వీడియో గ్రఫీ డే ను కూడా నిర్వహించడానికి అకాడమీ యోచిస్తుందన్నారు. ఏఐ ను తట్టుకొని నిలబడే విధంగా వీడియో జర్నలిస్టులకు అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహిస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనివిధంగా వీడియో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి తమ సంఘం కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఆయా మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వీడియో జర్నలిస్టులతో పాటు ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వీడియో జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని విరాహత్ అలీ కోరారు. తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సన్నీ, అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు వనం నాగరాజు, టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టులకు మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అక్రెడిటేషన్ కార్డుల ప్రధానోత్సవం జరిగింది.