విభద్దతలేని మనిషి, నిజాయితీ లేని రచనతో సార్థకం లేదు .
మరింత మెరుగైన సమాజం కావాలంటే పౌర సమాజం, రచయితలు కీలకపాత్ర పోషించాలి.
---- వడ్డేపల్లి మల్లేశం
మరింత మెరుగైన పరిస్థితుల్లోకి సమాజాన్ని తీసుకువెళ్లినప్పుడే దాన్ని అభివృద్ధి లేదా వికాసము అని అంటారు . అలాగే సాంప్రదాయంగా పాలన సాగించే రాజకీయ పార్టీల చేష్టలు చర్యలను రాజకీయాలు అంటే మరింత ఉత్కృష్టమైన సమాజాన్ని ఆకాంక్షించే పథకాలు, చర్యలు, ప్రణాళిక, ఆచరణ రాజ నీతిజ్ఞత అనబడుతుంది. రాజకీయాలు సమాజము చుట్టూ తిరుగుతూ ఉంటే మొక్కుబడి రాజకీయాలకు బదులుగా రాజనీతిజ్ఞత కలిగిన బలమైన నాయకులు ప్రజల మధ్యన ఉన్నప్పుడు వ్యవస్థ మరింత శక్తివంతం అవుతుంది. సామాజిక వ్యవస్థ వ్యక్తుల శక్తియుక్తులు, జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది . అందుకే మనం మొక్కుబడి రాజకీయాలను కాకుండా ప్రజా రాజకీయాలను కోరుకోవడానికి ఇదే ప్రబల కారణం . కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయంలో పడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఉన్నటువంటి అనేక మార్గాలు, లొసుగులు, తప్పుడు విధానాలకు పాల్పడుతూ ప్రజల ముందు నాయకులు ఒక దశలో బానిసలుగా మారితే ఎన్నికల అనంతరం ప్రజలను ఐదేళ్లపాటు బానిసలుగా మార్చుకునే దుర్నీతి ఈనాడు రాజకీయ చట్రంలో కొనసాగుతున్నది .ఈ క్రమంలో వ్యక్తులు, వ్యవస్థ, పౌర సమాజం బ్రష్టు పట్టిపోయిన కారణంగా సమాజానికి అంతో ఇంతో మార్గ నిర్దేశం చేసే కవులు కళాకారులు మేధావులు కూడా ఆ కలుషిత ప్రవాహములో కొట్టుకుపోక తప్పడం లేదు ఇది మన ముందున్న సంక్లిష్ట సంధిద్ధ సవాలుగా మారిన సమస్య.
ఉచితాల పేరుతో ప్రభుత్వాలు అమలు చేస్తుంటే రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో తమ మేనిఫెస్టోలను ప్రకటించి ప్రజలను ప్రలోభ పెడుతున్నప్పటికీ అవి ఉచితాలు కాదని వాటి ముసుగులో అదే ప్రజల నుండి వేల కోట్ల రూపాయలను ఇతర మార్గాలలో రాబట్టుకుంటున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధాన నిర్ణయక సభ్యులు ఒకరు ఈ మధ్యన ప్రకటించడాన్నీ బట్టి గమనిస్తే ఈత ఆకు వేసి తాటాకు లాగుకున్నట్లుగా పాలకులు కూడా వాణిజ్య ధోరణి అవలంబిస్తున్నట్లు మనకు అవగతం అవుతున్నది. ఈ నేపథ్యంలో వ్యక్తిని మార్చడం ఎలా? సాహిత్యాన్ని రచనలను ఈ విషపూరిత సమాజం నుండి కాపాడుకోవడం ఎలా? అనేది బుద్ధి జీవులు, మేధావులను, ఆలోచనపరులు, రచయితలను పట్టిపీడిస్తున్న సమస్య.
రచయిత రచన మనిషి నిబద్ధత :-
సమాజాన్ని స్పృశించకుండా సమాజానికి భిన్నంగా సాహిత్యం తన ప్రవాహాన్ని కొనసాగించే అవకాశం అసలే లేదు . ఉన్న పరిస్థితులను, రావలసిన మార్పులను, చేరుకోవలసిన గమ్యాన్ని నిర్దేశించుకుని ఆ వైపుగా కఠిన నిర్ణయాల ద్వారా ప్రయాణం చేయవలసిన ఉత్కృష్ట బాధ్యత కవులు కళాకారులు రచయితలు, మేధావుల పైన ఉన్నది .రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు, సంపన్న వర్గాలు, సంపదను పోగు చేసుకునే అక్రమార్కులు , నేరమయ రాజకీయాలకు పాల్పడుతున్న వారికి ఈ బాధ్యత లేదు. ఎందుకంటే గత 77 సంవత్సరాలుగా వాళ్లు ఈ దేశ ప్రజలను పట్టిపీడించడానికి అలవాటు పడినారు కనుక కానీ రచనలు, వ్యక్తి నిబద్ధత ,పౌర సమాజం బాధ్యతల ద్వారా
ఈ దుర్మార్గుల భరతం పట్టాలి! దుష్ట బుద్ధిని మార్చాలి! నేరస్తులను తరిమికొట్టాలి ! నేరమయ రాజకీయాలను పరిశుభ్రం చేయాలి !ఇదంతా నిబద్ధతగల వ్యక్తి, పౌర సమాజం, రచయితల పైన ఆధారపడి ఉన్నది అనడంలో అతిశయోక్తి లే దు. ఇది సామాజిక బాధ్యత కూడా .
ఇప్పటికీ ప్రజలు తాత్కాలిక అవసరాల రీత్యా ఆలోచిస్తున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదికన క్రియాశీలక పాత్రను పోషించడానికి మానవ మనుగడ ప్రశ్నార్థక కాకుండా చూసుకునే క్రమంలో ఆలోచించడం లేదు. అందుకే ప్రముఖ అంబేద్క రిస్ట్ రచయిత కత్తి పద్మారావు గారు ఒక దశలో" ఇవ్వాలా దున్నాల్సింది భూములను మాత్రమే కాదు మనుషుల మెదళ్లను కూడా" అనీ హెచ్చరిస్తాడు. అంటే నిబద్ధత, అంకితభావము, సమయస్ఫూర్తి , మానవతా విలువలు, సామాజిక చింతన, శ్రమయిక జీవన సౌందర్యాన్ని ఆరాధించే తత్వాన్ని పెంపొందించవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. మార్పును, దేశం అభివృద్ధిని, సామాజిక వికాసాన్ని కోరుకునే ఆలోచనపరులుగా ఎక్కడికక్కడ ఆ పాత్రను మనం పోషించాలి . అవినీతిని తరిమికొట్టాలి అక్రమార్కులను ప్రశ్నించాలి అందుకు తగిన శక్తియుక్తులను మనం సంపాదించుకోవాలి . వ్యక్తి నిర్మాణం ద్వారా సంఘ నిర్మాణం తద్వారా పౌర సమాజం చైతన్యవంతం అవుతుంది తన బాధ్యతను గుర్తిస్తుంది . ఇదంతా ఒకవైపు పౌర సమాజానికి శిక్షణ ఇవ్వడం ద్వారా, మరొకవైపు పాఠశాలలు విద్యాసంస్థలు విశ్వవిద్యాలయాల ద్వారా అవగాహన తర్వతుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ వైపుగా ప్రణాళిక బద్ధంగా కృషి చేయవలసినటువంటి అవసరం ఈనాడు ఎంతో ఉన్నది .
ఇక రచన జీవముండి ఎండిన గింజ లాంటిది. ఆ రచనకు ప్రాణాన్ని పోసి సమాజంలోకి ప్రవేశపెట్టి ప్రజల మధ్యన చర్చ జరిగి అధ్యయనము పరిశీలనకు ఆస్కారమిచ్చి అందుకు తగిన అర్హతలను రచన నిండా రచయిత నింపిన నాడు మాత్రమే అది గింజగా మొలకెత్తి వృక్షమై కాయలయి పండ్లై విరాజిల్లుతుంది. ఆ రకంగా ఒక రచన తన ప్రభావాన్ని సమాజం నిండా చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ దశలో రచయితలు లక్ష్య శుద్ధి, శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన దృక్పథం, మౌలిక సమస్యల పరిష్కారం పట్ల సంపూర్ణ అవగాహన, కార్య కారణ సంబంధం, హేతుబద్ధత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని రచనలు చేసినప్పుడు మాత్రమే ఆ రచన తన ప్రభావాన్ని సమాజం పైన చూపుతుంది ." అక్రమార్కులకు ఉ రి కొయ్యలాగా, నేరస్తులకు జైలు గోడల్లాగా , బడా పెట్టుబడిదారులకు ఇనుప ఊచల్లాగా కనబడుతుంది." అంతటి శక్తిని సమాజం నిండా నింపగలిగే రచనలు మరింత పెద్ద మొత్తంలో రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది అదే సందర్భంలో పాఠకులు అధ్యయనానికి దూరమై కనీసం మేధావుల ప్రసంగాలు కూడా వినడానికి ఓర్పు లేకుండా ఇతరత్రా చిల్లర వేషాలు చిలిపి కార్యక్రమాల బారినపడి యువత నష్టపోతున్న సందర్భంలో యువతను పెడదారి పట్టకుండా మన ఉద్యమం వైపు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆలోచనపరులదే. .రచయితకు నిబద్ధత, ధైర్యము, ఓదార్పు, పట్టింపు, ప్రజా దృక్పథంతో పాటు వాస్తవాన్ని నిర్మోహమాటంగా చెప్పగలిగే సత్తా ధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా అవసరం . "ఒక దశలో రచయిత ఏకాకి కావచ్చు, నిరాదరణకు గురి కావచ్చు, అవమానాలు ఈసడింపులు జరగవచ్చు, కానీ అన్నింటినీ మించి ప్రజా దృక్పథం బలంగా ఉన్నప్పుడు నడుస్తున్న చరిత్రను గత చరిత్ర పునాది మీద నడిపించడానికి భవిష్యత్తు సవాళ్లను అధిగమించడానికి చోదక శక్తిగా ఒక రచయిత నిలబడాల్సిన అవసరం ఉంది" . అందుకే గతం భవిష్యత్తు వర్తమానాలపైన సమదృష్టి సమగ్ర దృష్టి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే రచనకు నిజాయితీ ఎంత ముఖ్యమో రచయితకు కూడా అంతే ముఖ్యం. "నిబద్ధత, శ్రామిక దృక్పథము, సమాజం పట్ల బాధ్యత అనే అంశాలను ఎప్పుడైతే పౌర సమాజం తనలో నిబిడీకృతం చేసుకుంటుందో, అందుకు రచయితలు తమ రచనల ద్వారా ఈ సమాజాన్ని చైతన్యం చేసే క్రమంలో పోటీ పడతారో , అదే సందర్భంలో సాహిత్యము సామాజిక పరిశీలన క్షేత్ర పర్యటనలు మీడియా సినిమాలు టీవీ ప్రసారాలు కూడా మనిషిని నిర్వీర్యం చేసేవి కాకుండా సమగ్ర దృష్టితో చైతన్యపరిచే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లక్ష్యం నెరవేరుతుంది.*" కానీ ప్రస్తుతం వానిజ్య మూసలో నడుస్తున్న సినిమాలు, అవకాశవాదంతో నడుస్తున్న సీరియల్ కొంతమందికి ఉపాధిని కల్పిస్తూ అదే జీవితం అనుకుంటున్నా కళాకారులు రచయితలు సినిమాలు సీరియల్ ద్వారా ఈ వ్యవస్థకు ఎంతో ద్రోహం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా నిర్మోహమాటంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది .తాను తె గకుండా కత్తి తెగదు అనే సామెత మాదిరిగా బలమైన శక్తులుగా జర్నలిస్టులు, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, పౌర సమాజం ఆలోచనాపరులు ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థను మార్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ దుర్మార్గులు, నేరస్తులు, అవినీతిపరులు, అక్రమార్కులు తోక ముడుచుకుని పారిపోతారు. ఆ చైతన్యం సమాజంలో 5 శాతం కూడా లేని కారణంగా ప్రస్తుతం ఈ దురవస్థ దాపురించినది కొన్ని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలు, మేధావులు శిక్షలకు బలై ఊచలు లెక్కబెడుతూ విప్లవోద్యమంలో పనిచేసి జీవితాలను బలిపెట్టినప్పటికీ పాలకుల యొక్క నిర్బంధము అణచివేత కారణంగా మన ఉద్యమ శక్తి సన్నగిల్లిపోతున్నది. ఇక్కడే రచయితలు కళాకారులు తిరిగి పుంజుకోవాలి తమ శక్తిని రెట్టింపు చేసుకోవాలి. అక్రమార్కుల పైన పంజా విసరాలి . యువత విద్యార్థి లోకం పైన ఎనలేని బాధ్యతలు ఆశలతో రచయితలు బుద్ధి జీవులు ముందుకెళ్లాలి . ఆ వైపుగా యువతను కదిలించగలిగే సభలు సమావేశాలు సన్నివేశాలు సందర్భాలు ప్రదర్శనలు రచనలు క్షేత్ర పర్యటనలు కొనసాగినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ మరింత ఉన్నతంగా ఉంటుంది, రాజకీయాల స్థానంలో రాజనితిగ్యత ఆవిర్భవిస్తుంది . సమానత్వం అంతరాలు లేని వ్యవస్థ అనే ఇబ్బందికర పరిస్థితుల నుండి సమ సమాజం సాధ్యమవుతుంది కానీ అది బహు దూరమే కావచ్చు. నిరాశ తో ఆలోచిస్తే ఎలా? తొలి ప్రధాని నెహ్రూ" నిరాశ నిస్పృహ లకు జీవితంలో స్థానం ఉండకూడదు అంటాడు" అంటే ఆశావాద దృక్పథంతో ఉద్యమకారులుగా పనిచేయవలసినటువంటి అవసరం ఇవాళ సామాజిక కార్యకర్తలు అభ్యుదయ వాదులు సమాజాన్ని పట్టించుకునే ప్రతి ఒక్కరి పైన ఉన్నది. చైతన్యం కట్టలు తెంచుకునేలా కథన రంగంలో కార్యోన్ముఖులు అయ్యేలా యువతను విద్యార్థి లోకాన్ని తరలించుదాం. ఏది ఏమైనా నీబద్ధత నిజాయితీ సర్వత్ర ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా అసాధ్యం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)