మూస పరిపాలనకు స్వస్తి పలకాలి

Apr 7, 2024 - 12:27
 0  0

ప్రజా కోణంలో, వినూత్న రీతిలో, గత పాలనకు భిన్నంగా, తెలంగాణ ఆకాంక్షల  మేరకు  పరిపాలన సాగాలి .

ఉచితాల పేరున కాలయాపన చేయడం కంటే  విద్యా వైద్యం మౌలిక రంగాలపై  ప్రధానంగా దృష్టి సారించాలి.

జెండాలు, కటౌట్లు, ప్రచారాలు, డబ్బుల పంపిణీయే పాలన కాదు అని తెలుసుకుంటే మంచిది.

--  వడ్డేపల్లి మల్లేశం

ఇటీవల కాలంలో పరిపాలన అంటే ఉచిథా ల పేరున  ప్రలోభాలతో వాగ్దానాలతో  ప్రజలను ఆకట్టుకోవడం ద్వారా ఓట్లను దండుకోవడమే  అంతిమ లక్ష్యంగా దేశవ్యాప్తంగా మారిపోయింది . ఇక జెండాలు, కటౌట్లు, హోర్డింగ్లు,  ఫ్లెక్సీలతో,  విస్తృత స్థాయిలో ప్రచారం చేయడమే తప్ప  ప్రజల సమస్యల పైన సుదీర్ఘంగా లోతుగా ప్రజల వద్దకు వెళ్లి దృష్టి సారించినది లేదు . అవకాశవాద, ఆకర్షణ రాజకీయాల ముసుగులో  సభలు సమావేశాలు విచ్చలవిడిగా జరుగుతుంటే  అధికార పార్టీ  అధికార దుర్యోగానికి పాల్పడుతూ పార్టీ సమావేశాలను అధికార  కార్యక్రమాలతో మిళితం చేసిన సందర్భాలను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పరిపాలనలో చూడవచ్చు.  వివిధ సంక్షేమ పథకాల పేరుతో డబ్బులను  ప్రజల అకౌంట్లో వేసే గుడ్డి పరిపాలన విధానానికి  ఈ దేశంలో  10 ఏళ్ల చరిత్ర ఉన్నది అంటే అతిశయోక్తి కాదు .అది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో.  ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో పరిపాలన చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్  అన్ని హామీలను తుంగలో తొక్కి  విద్యా వైద్యాన్ని గాలికి వదిలి  ప్రజలను బానిసలుగా చిత్రీకరించి  ముఖ్యమంత్రిని కలవడానికి మంత్రులకు కూడా అవకాశం లేనటువంటి నిర్బంధ విధానాలను పోషించినది ఆ0దరికీ తెలుసు కదా ! నిర్బంధం, అణచివేత ,ధర్నా చౌక్ ఎత్తివేత , మేధావులు బుద్ధి జీవులు ప్రశ్నించిన ప్రతి వాళ్లను అరెస్టు చేసిన తీరు  ఆక్షేపనీయం కనుకనే ప్రజల ఆగ్రహానికి గత  పాలకులు  బలి కాక తప్పలేదు  .మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూస విధానాన్ని అవలంబిస్తే  ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నట్లు?  గత పాలన కంటే భిన్నమైన పాలన కావాలని ఎందుకు కోరుకున్నట్లు ? ఆ రకమైన ప్రత్యేకతను  తన పరిపాలనలో ప్రదర్శించవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం  నిర్మాణాత్మక రీతిలో వ్యవహరిస్తేనే  స్పష్టమైన తేడా ప్రజలకు కనబడుతుంది., ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి , టిఆర్ఎస్ పార్టీకి జ్ఞానోదయం అవుతుంది.,  బుద్ధి జీవులు మేధావులు తెలంగాణ ఉద్యమకారుల ఆశలు ఆకాంక్షలు ఆశయాలు నెరవేరుతాయి .

    ---మూస విధానానికి స్వస్తి పలకాలి :-

టిఆర్ఎస్ ప్రభుత్వ మద్యం విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది మార్పు ఏమీ లేదు కదా  మాట వరసకు బెల్టు షాపుల రద్దు అని ప్రకటించిన అమలుకు   నోచేది ఎన్నడు?

-- తెలంగాణ ఉద్యమ కాలంలో గుట్టల విధ్వంసాన్ని  నిరసించిన  టిఆర్ఎస్ తన ప్రభుత్వ కాలములో విచ్చలవిడిగా  ప్రోత్సహించి తీరని ద్రోహానికి తలపెట్టింది. అదే పద్ధతి  కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రోజు గుట్ట లు కరుగుతూనే ఉన్నాయి .

-- విద్యా వైద్యం టిఆర్ఎస్ పాలనలో ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోయింది  .పేద వర్గాలు తమ అరవై శాతం ఆదాయాన్ని ఈ రెండింటికి ఖర్చు చేసి  కొనుగోలు శక్తిని

కోల్పోగా  రాష్ట్రంలో పేదరికం మరింతగా పెరిగింది.  విద్యా వైద్యం పైన కనీస ప్రకటన చేయని కాంగ్రెస్ ప్రభుత్వం  అదే పద్ధతిని కొనసాగిస్తే ఇక పేద వర్గాలకు ప్రయోజనం ఏమున్నది ?

-- ప్రలోభాలు వాగ్దానాలు హామీల పేరుతో అనేక ఉచిత పథకాల ప్రకటన ద్వారా ఆకర్షణ పరిపాలన మాత్రమే కొనసాగింది తప్ప నిర్మాణాత్మక అభివృద్ధి జాడలేదు గత పాలనలో . టిఆర్ఎస్ పార్టీని గెలవాలంటే అంతకు మించిన స్థాయిలో సంక్షేమ ఉచిత పథకాలను ప్రకటించిన కాంగ్రెస్  అదే మూసలో కొనసాగితే  బడ్జెట్లో అధిక భాగం ఖర్చు చేస్తే  మౌలిక రంగాలకు  రాష్ట్ర అభివృద్ధికి  నిధులేవి ? క్రమంగా ఉచిత  డబ్బు పంపిణీ సంక్షేమ పథకాలను తగ్గించడం ద్వారా  ప్రజల కొనుగోలు శక్తిని పెంచి జీవన ప్రమాణాలను ఉద్ధరించాలి.  ఆ వైపుగా స్పష్టమైన హామీతో పాటు కార్యాచరణ వెంటనే ప్రారంభం కావాలి.

--  పార్ట్ టైం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్  ఉద్యోగ విధానాన్ని రద్దు చేస్తామని గత ప్రభుత్వం మాట ఇచ్చి నిలబెట్టుకోలేదు  .ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానాల పైన ఎలాంటి ప్రకటన చేయలేదు.  మనసంతా 6 గ్యారంటీలు,  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం  పైన నే ఉంటే అభివృద్ధిని  సాధించడం   అసాధ్యం కావచ్చు.

--  ప్రజాస్వామ్య పునరుద్ధరణ, మానవ హక్కుల పరిరక్షణ,  విప్లవ సంస్థలు ప్రజా సంఘాల  పట్ల సానుకూల దృక్పథం  ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ  నిషేధించిన ప్రజాసంఘాలపై  వెంటనే నిషేధాన్ని ఎత్తివేసి,  తెలంగాణ ఉద్యమకారులపై కేసులను రద్దుచేసి,  ఉపా దేశద్రోహం వంటి కేసులను వెంటనే ఉపసంహరించుకుంటేనే ఉద్యమకారులలో  విశ్వాసం పెరుగుతుంది . ఎందుకంటే హామీ ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కనుక.

---  పేదరిక నిర్మూలన , ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుదల,  అందరికీ గృహవసతి, మౌలిక అవసరాలు  తీర్చడం పైన దృష్టి సారించాలి కానీ అకౌంట్లో నగదు వేయడం పైన  అంత ఆరాటం ఎందుకు? ఇదే మూసలో  గత ప్రభుత్వం కూడా కొనసాగి  లక్షల కోట్ల అప్పులు చేసిన విషయం తెలిసిందే కదా!

---  సంపదను సృష్టించకుండా, యువతను ప్రజలను  పాలనలో భాగస్వాములను చేసుకోకుండా , ఉత్పత్తితో ప్రమేయం లేకుండా  ప్రజలకు సంపదను పంచడానికి  పరిగెత్తి  పడిపోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం లాగానే  కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు కూడా కొనసాగితే  ప్రయోజనం ఉండదు .

--  టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల వేతనాలను  దేశంలోనే భారీగా పెంచుకున్నది.  శాసనసభ్యులు మంత్రులు  భూ కబ్జాలు అక్రమార్జ న ద్వారా  అవినీతిపరులుగా మిగిలిపోయినారు.  వారిపై వెంటనే విచారణ జరిపించడంతోపాటు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మంత్రుల   అక్రమ సంపాదన పట్ల ఇప్పటినుండే నిఘా వేసి ఉంచాల్సిన అవసరం ఉన్నది . అవకాశమస్తే ఎవ్వరు  వదిలిపెట్టరు కనుక.  శాసనసభ్యులు మంత్రులు తమ ఆస్తిపాస్తులను బహిరంగంగా ప్రకటించాలి.  ఐదేళ్లలో వేతనానికి మినహా  అక్రమ సంపాదన పొగయితే  శిక్షకు అంగీకరించాలి. అప్పుడే  టిఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్కు తేడా ఉన్నట్లు లెక్క.

---  జెండాలు, కటౌట్లు,  ఫ్లెక్సీలు,  నాయకుల ఆడంబరాలు,వ్యక్తి ఆరాధన,పాలాభిషేకం,   అతిగా పోలీసుల వాడకంతో అధికార దుర్విని యోగాన్ని గత పాలకులు కొనసాగించినట్లే  కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే  మూస విధానం, అనుకరణ,  పాలకుల నైజం ఒక్కటే  అనకుండా ఉండలేరు కదా.

 ఆకాంక్షల కనుగుణమైన ప్రత్యేక పాలన కనిపించాలి

  అమరుల ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన,  బుద్ధి జీవులు మేధావుల  సూచనలకు  సమ్మతి,  అఖిలపక్షాలతో తరచుగా సమావేశాల ద్వారా  కీలక నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామిక దృక్పథం,  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా  ఆశించిన లక్ష్యాలను పాలనలోనూ  ప్రజల జీవన విధానంలోనూ  చరిత్ర నిర్మాణంలోనూ  ఆచరణలోనూ ప్రస్ఫుటించే విధంగా 

పాలన కొనసాగాలి . తరచుగా ఢిల్లీకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీ అని,  కష్టాలు కన్నీళ్లు కరెంటు కోత  కాంగ్రెస్ నైజం అని  టిఆర్ఎస్ చేసిన విమర్శను  తిప్పి కొట్టే విధంగా  ప్రపంచముతో పోటీపడే విధంగా  కాంగ్రెస్ పాలన కొనసాగాలి.  ఉద్యోగులు, వ్యాపారులు , చిరు వ్యాపారులు , కార్మికులు ,కర్షకులు, చేతివృత్తులు విభిన్న వర్గాల వారి  సమస్యలను హక్కులను  డిమాండ్లను  ప్రజాస్వామ్యక దృక్పథంతో స్వీకరించి  మానవీయ కోణంలో  పరిష్కరించాలి.  రైతులకు బేడీలు వేసిన చరిత్ర గత పాలనకు ఉంది . కనీసం ఆ రైతులపై ఉన్న కేసులనైనా  ఈ ప్రభుత్వం రద్దు చేయకపోతే  తేడా ఏముంటుంది?  రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని  కోరి తెచ్చుకున్న ప్రజల ఆకాంక్షలను, అభిప్రాయాలను,  ఆలోచనలను,  జీవన విధానాన్ని  లోతుగా అధ్యయనం చేయడం ద్వారా  రాష్ట్ర ప్రభుత్వం  విప్లవాత్మక మార్పులకు  చారిత్రక నిర్ణయాలకు  ఉత్తేజ కరమైన ప్రకటనలకు  ప్రపంచంతో పోటీ పడడానికి  సిద్ధపడాలి.  జ్ఞానాన్ని,  ప్రజల సంపదను  ఏ కొద్దిమందికో  తాకట్టుపెట్టి   దుష్ట సంప్రదాయానికి ఈ రాష్ట్రంలో  చోటు కల్పించకుండా  భూస్వామ్య పెట్టుబడిదారీ సంస్కృతిని  నిర్మూలించి  అంతరాలు లేని వ్యవస్థను సాధించే దిశగా సమ సమాజాన్ని  సాకారం చేసుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం కావాలి.  అంటే గత పాలకుల మాదిరి  మూస విధానానికి స్వస్తి పలికి  భిన్న ఆలోచనలతో విభిన్న  రీతులలో  పరిపాలన ప్రజలకు అందించాలి.  ప్రభుత్వ విధానాలను, గత పాలనకు గల తేడాలను, పోలికలను,  ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉంటారు.  ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా  ప్రజలను అమాయకులుగా  పరిగణించకుండా  ఉంటే మంచిది.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333