మరణించిన వ్యక్తి అవయవాలకు రెండో జీవితం సకాలంలో అవయవ దానం తోనే సాధ్యం.

Feb 18, 2025 - 11:48
 0  0

మరణించిన వ్యక్తి అవయవాలకు రెండో జీవితం సకాలంలో అవయవ దానం తోనే సాధ్యం.* ఈ విషయంలో భారతదేశం ప్రపంచంతో మరింతగా పోటీ పడాల్సి ఉంది.* ఇందుకోసం సమాజానికి సామాజిక చింతన, స్పృహ, చొరవ చాలా అవసరం.*

*******************************

--- వడ్డేపల్లి మల్లేశం 90142 06412

----18...11...2024***************

వ్యక్తుల యొక్క ప్రవర్తన త్యాగము చర్యలు సామాజిక చింతన వ్యవహారిక ధోరణులను బట్టి కొందరు బ్రతికినా చనిపోయిన వారితో సమానం అని, మరికొందరిని చనిపోయినా బ్రతికిన వారితో సమానం అని సమాజం నిర్ణయిస్తుంది. జీవించి ఉన్న కాలంలో వాళ్ల వల్ల ఈ వ్యవస్థకు జరిగిన మేలు లేదా వారి త్యాగము ఆలోచన సరళిని బట్టి ఈ అంచనాకు వస్తారు అందుకోసమే సమాజానికి మేలు చేసినటువంటి ఆదర్శ వ్యక్తులను జయంతి వర్ధంతుల సందర్భంగా గౌరవించడం ఆరాధించడం వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయడం వెనుక గల తాత్విక పునాది. వారి వల్ల సమాజానికి జరిగిన మేలే కదా! అయితే చాలామంది ప్రముఖులు ఉద్యమాలలో పాల్గొనడం, అనారోగ్యంతో, కారణాలు ఏవైనా చిన్న వయస్సులోనే చనిపోయినారు వాళ్లంతా ప్రపంచానికే దారి దీపాలుగా వెలిగిన వాళ్ళు మనదేశంలో ఉండడం చాలా విచారకరం .వాళ్ళ త్యాగాలూకాని ఆధునిక కాలంలో అవయవధానం వల్ల కొందరికైనా ఎంతో మేలు జరుగుతుంది.ఈ సందర్భంలో మరికొన్ని విషయాలను ప్రస్తావించక తప్పదు వయసులో ఉండి రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నటువంటి వాళ్ళు గాయాలపాలై చావు బ్రతుకుల్లో ఉన్నవాళ్లు రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న వాళ్లు ప్రయాణికుల దృష్టికి వచ్చినప్పుడు వారిని దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రులు లేదా ఇతర అవయవ కేంద్రాలకు సమాచారమిచ్చినట్లయితే వారు చనిపోయి నా కానీ వారి అవయవాల ద్వారా మరెంతో మందికి రెండవ జీవితాన్ని ప్రసాదించే అవకాశం ఉన్నది. ఈ విషయంలో సమాజము తమ బాధ్యతగా వ్యవహరించి తెలిసిన సమాచారాన్ని అందుబాటులో ఉన్నటువంటి సంస్థలకు లేదా నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా మేలు చేకూర్చవచ్చు. ఇటీవలి కాలంలో చనిపోయిన తర్వాత అనేకమంది తమ శరీరాన్ని మెడికల్ కళాశాలలకు దానం చేస్తున్నారు అది ఒక రకమైన పద్ధతి దానివలన మెడికల్ కళాశాలలో విద్యను బోధించే సందర్భంలో అవయవాల పరిశీలనకు తోడ్పడుతుంది.

 కానీ జీవించి ఉండి అనారోగ్యముతో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు లేదా రోడ్డు ప్రమాదంలో బలమైన గాయాలు తగలడం ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన సందర్భంలో అలాంటి వారి అవయవాలను అత్యవసరంగా దానం చేయడం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రి వాళ్ళు సేకరించడం వలన ఆ అవయవాల వల్ల అవసరం ఉన్నటువంటి మేలు జరుగుతుంది. లివర్ కిడ్నీ ఇతర ముఖ్యమైనటువంటి అవయవాలను ఆ అవయవాలు లేకుండా ఉన్నటువంటి వారికి అమర్చడం ద్వారా రెండవ జీవితాన్ని కూడా ప్రసాదించడానికి మార్గం సులభం అవుతుంది. ఒక వ్యక్తి మరణించిన లేక బ్రెయిన్ డెడ్ అయిన మరికొంత కాలం పాటు జీవించి ఉండడానికి మార్గం అవయవ దానం అని స్పష్టమవుతున్నది కదా! సాధారణంగా భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఇతర ఘటనల్లో ఎంతోమంది రోజు చనిపోతున్నారు అయితే అన్ని ప్రమాదాల నుండి సమాచారం చేరకపోవడంతో ఎంతో నష్టం జరుగుతున్నది. ఈ విషయంలో వైద్య విభాగం ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను కనపరిచి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లయితే మరెన్నో అవయవాలను సమకూర్చుకోవడానికి అవకాశం ఉన్నది. అవయవ దానం విషయంలో ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలో ఈ స్పృహ చాలా తక్కువ అని అవకాశం ఉన్నప్పటికీ అవయవాలను దానం చేయడానికి ఇష్టపడని వాళ్ళు కొందరైతే మరికొన్ని సందర్భాల్లో ఇవ్వడానికి అంగీకరించినప్పటికీ ఆలస్యం కావడం వల్ల ఉపయోగపడని పరిస్థితులు మరికొన్ని సందర్భాల వల్ల భారతదేశంలో ఈ రకమైనటువంటి ప్రయోజనం పొందుతున్న వాళ్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. వాస్తవంగా అవయవాలను కృత్రిమంగా తయారు చేయలేనివి కనుక ఇలాంటి సందర్భాల్లోనే సమయస్ఫూర్తిగా వృధా కాకుండా సేకరించుకోవడానికి ప్రభుత్వము వైద్య విభాగము శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ విధానాలను ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు గ ననీయంగా జరుగుతున్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి కనుక ఆ రకంగా దూరమవుతున్నటువంటి మానవ వనరులను మరో రకంగా అవయవాలను సేకరించడం ద్వారా రెండో జీవితాన్ని కాపాడడానికి అవకాశం ఉన్నది.

        ఇటీవల కాలంలో కొంతమంది పేదలు తమ అవయవాలను అమ్ముకొని పేదరికం నుండి బయటపడడానికి ప్రత్యామ్నాయం లేని పరిస్థితిలో జీవిస్తున్న వాళ్లు అనేకం. ఇక మరికొన్ని చోట్ల కొంతమంది ముఠాలు డాక్టర్ల యొక్క మద్దతుతో కొంతమంది అనాధలు లేక పేదవాళ్లను ఆశ చూపి నమ్మించి వైద్యుల వద్దకు తీసుకువచ్చి ఒప్పందము చేసుకొని కిడ్నీలు లివర్ వంటి మౌలికమైనటువంటి అవయవాలను కొల్లగొట్టి లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న సందర్భాలను కూడా మనం గమనిస్తే ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలల మీద కూడా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే ప్రమాదముంది.ఇలాంటి వాటిని నివారించడం ద్వారా ప్రమాదాలలో చనిపోయిన వారి యొక్క అవయవాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కొత్త జీవితాలను ప్రారంభించడానికి అవకాశం ఉంది. కావాల్సింది చిత్తశుద్ధి తర్వాత వైద్యులలో ప్రధానంగా అంకితభావం మోసగాళ్ల చేతిలో బలికాకుండా ఉండడం ప్రధానమైనటువంటి విషయాలు.

      ఇటీవల జాతీయ అవయవ దాన కణజాల మార్పిడి సంస్థ నివేదిక ప్రకారంగా రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల నుండి ఏ సంవత్సరంలో ఎంతమంది నుండి అవయవాలను సేకరించినారు మనం క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు ఏమైనా ఇది ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు వినియోగించుకున్న శాతం చాలా తక్కువ. అదే సందర్భంలో రోడ్డు ప్రమాదాలను అతిగా ఆశించడం ప్రధాన ఉద్దేశం కాదు కానీ అనివార్యంగా జరిగినప్పుడు వినియోగించుకోకపోవడం పొరపాటుగా గ్రహిస్తే మంచిది.

  2018 సంవత్సరంలో 875 మంది నుండి అవయవాలు సేకరిస్తే 2019లో 715 మంది నుండి అవయాలు స్వీకరించారు. 2020లో అవయవాల సేకరణ క్రమంగా తగ్గి 351 మాత్రమే పరిమితం కావడం కొంత ఆందోళన కలిగించే విషయం 2021లో 552 మంది అవయవాలు స్వీకరిస్తే 2022లో 941 మంది నుండి 2023లో ఆ సంఖ్య కొంత పెరిగి వెయ్యి 10 99 మంది నుండి అవయవాలు స్వీకరించినట్లుగా పై నివేదిక ద్వారా తెలుస్తున్నది. బలమైన గాయాలు ఇతర కారణాలవల్ల వ్యక్తి ఏమాత్రం బ్రతికే అవకాశం లేని సందర్భంలో వ్యక్తుల లోని అవయవాలు మాత్రం ఇతరులకు ఉపయోగపడే స్థితిని బ్రెయిన్డెడ్ అంటారు. అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాల ద్వారా జీవించడానికి సహకరించే స్థితిలో మెదడు లేనప్పుడు ఈ స్థితి ఏర్పడుతుంది

 అలాంటి పరిస్థితుల్లోనే అవయవాలను సేకరించడం అనేది శాస్త్రీయంగా గొప్ప ముందడుగు. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనల ద్వారా కొంత ఆలస్యంగా నైనా సేకరించడానికి గనుక అవకాశం ఉండి ఉంటే లేదా కొన్ని సాధు జంతువుల యొక్క అవయవాలు ఏమైనా మనుషులకు ఉపయోగపడే పరిస్థితి కనుక ఉండి ఉంటే ఆ వైపుగా పరిశోధనలు జరిపిన తర్వాత సేకరించడానికి కూడా అవకాశం ఉంటుంది. కావాల్సింది ఆ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్లు శాస్త్రవేత్తలు మరింత లోతైన అధ్యయనం చేయడం ద్వారా మరి కొంతమందికి రెండవ జీవితాన్ని ప్రసాదించడానికి ఈ ప్రమాదాలను లేక అనివార్యమైన చావులను వినియోగించుకోగలిగితే అంతకుమించినటువంటి దాతృతము మరొకటి లేదు. అవయవ దానం అనే ప్రక్రియ కొనసాగాలంటే అవయవాలను సకాలంలో సంస్థలకు చేరవేయాలంటే కావలసింది సమాజంలోని భిన్న వర్గాలకు సామాజిక చింతన, స్పృహ, చొరవ, స్పందన చాలా ముఖ్యం. పట్టుదల గనుక ఉంటే అవయవ దాన విషయంలో మరికొంత మెరుగైన పరిస్థితులను చూడవచ్చు.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333