ప్రధాని మంత్రులతో సహా  రాష్ట్ర ప్రభుత్వ  ప్రతినిధులు  ఖర్చులను భారీగా తగ్గించుకోవాలి

Aug 30, 2024 - 19:01
 0  5

 పొదుపు చర్యలను చేపట్టడంతో పాటు  వ్యక్తిగత  త్యాగాలకు సిద్ధపడాలి.

అధికారం పేరుతో  అపరిమితంగా చేసే ఖర్చు

 ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే అవుతుంది.

 న్యాయ  వ్యవస్థ   జోక్యంతో  రాజకీయ   దుబారాను ఆపాలి.

--వడ్డేపల్లి మల్లేశం 

  ప్రజల నుండి వసూలు చేయబడుతున్న పన్నులు  దేశంలోని అనేక  వనరుల ద్వారా వస్తున్న ఆదాయం తోని మాత్రమే పాలకులు పరిపాలన కొనసాగిస్తారు  అంటే అంతిమంగా దేశంలోని వనరులన్నీ ప్రజలకే చెందుతాయి.  ఇక్కడ కేవలం పాలకులు  ప్రజలకు సేవకులు,  కాపలాదారులు,  సమన్వయ పరిచే వాళ్లు మాత్రమే కానీ శాసించే వాళ్ళు కాదు అని తెలుసుకోవడం అవసరం.  అలాంటి స్థితిలో  ప్రజాధనాన్ని తమ అధికారం పేరుతో విచ్చలవిడిగా  భద్రత,  దర్పం,  పేరుతో ఖర్చు చేయడానికి  ప్రజలు  అనుమతించడానికి సిద్ధంగా లేరు.  ప్రజా చైతన్యం పాలకులతో పాటు దేశంలో  అన్ని రకాల అవినీతి అకృత్యాలు పాలకుల యొక్క  డొల్లతనాన్ని ప్రశ్నించడానికి  ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలుసుకోవడం అవసరం. గతంలో కొనసాగినటువంటి ఒక విధానం  ప్రజల ఆలోచన తర్వాత  అది అవినీతి అని  ప్రజాధనాన్ని కొల్లగొట్టడం అని ప్రజలు భావించిన రోజున  ఇంతకాలం చట్టంగా కొనసాగినటువంటి విధానాలు కూడా  మారవలసి ఉంటుంది పాలకులు మార్చుకోవాల్సిన అవసరం తప్పనిసరి. అందుకు అనుగుణంగా న్యాయవ్యవస్థ కూడా ప్రజల పక్షాన కొన్ని అంశాలను సుమోటోగా స్వీకరించి  ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం వుంది. .ప్రధానమంత్రి తో సహా కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు శాసనసభ్యులు కూడా  అనునిత్యం పర్యటిస్తున్న సందర్భంలో  పోలీస్ బలగాలు, రక్షణ, కాన్వాయ్,  ఆదిపత్యం కోసం  వినియోగిస్తున్న కార్లు, అందుకు సిబ్బంది, పెట్రోలు  మించిన స్థాయిలో ఉన్న విషయాన్ని ఇప్పటికైనా  ప్రభుత్వాలు గ్రహిస్తే మంచిది.  ఎన్నికైనటువంటి  ప్రజా ప్రతినిధులు ప్రజల హృదయాలలో  నిలిచినప్పుడు ఆ ప్రతినిధులకు  రక్షణ కోసం భారీగా ఖర్చు చేయవలసిన అవసరం ఏమిటి?  భారీ రక్షణ మధ్యన కొనసాగి మంత్రులు  ముఖ్యమంత్రులు ప్రధాని పర్యటన ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోగా  మొక్కుబడిగా జరుగుతున్నటువంటి అలాంటి కార్యక్రమాలను తగ్గించుకోవడం ద్వారా ప్రజల మధ్యన  గడపడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాప్రతినిధులు అనబడతారు. తరచుగా  విమానం,హెలిక్యాప్టర్లలో తేలిపోయే పద్ధతిలో  ప్రజాధనంతో  విధి నిర్వహణ చేయడం అనేది  కొంత అభ్యంతరకరమని  రాజకీయ విశ్లేషకులు ప్రజాప్రతినిధులు  ప్రజాస్వామ్యవాదులు  ఆలోచించడాన్ని గమనించవలసిన అవసరం ఉన్నది.

పొదుపు చర్యలతో పాటు త్యాగాలకు సిద్ధపడాలి:-

రాజకీయరంగంలో పని చేసే అవకాశం రావడం మామూలు విషయమేమీ కాదు ఇటీవల కాలంలో కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న  వ్యవహారంగా మారిన నేపథ్యంలో  ఆ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజల అభిమానాన్ని చురగొనే ప్రయత్నం చేయాలి కానీ ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ప్రయత్నిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది . ఎందుకంటే ప్రజాధనాన్ని అక్రమంగా వినియోగించే అధికారం ఎవరికి లేదు.  ఆ ప్రజా  ధనానికి కేవలం  కాపలాదారులు మాత్రమే కానీ దాన్ని రోజుకు కొంత చొప్పున కొల్లగొడుతూ  లూటీ  చేస్తే ఎలా ? ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందినటువంటి మార్క్సిస్టు పార్టీ నాయకుడు గుమ్మడి నరసయ్య   శాసనసభ్యునిగా ఎన్నికల్లో గెలవడంతో పాటు  ప్రభుత్వ కారును వినియోగించుకోకుండా తన సొంత సైకిల్ పైన మాత్రమే ప్రయాణించి  రాజసాలకు ఆడంబరాలకు పోకుండా  సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితిలో ప్రజల మధ్యన జీవించిన  విషయాన్ని ఆదర్శంగా తీసుకోవడం ప్రధానితో సహా అందరికీ అవసరమే.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్  తాను స్వయంగా ప్రకటించిన విషయాన్నిబట్టి  సొంత వాహనంతో పాటు  ప్రభుత్వ నిధులను  వినియోగించుకోవడంలేదని చెప్పిన విషయాన్ని కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు గమనించాలి ఆచరించడానికి ప్రయత్నం చేయాలి.  రక్షణ,  ఆడంబరం కంటే ప్రజల మధ్యన జీవించడమే గొప్ప అనే  భావన  అధికారాన్ని శాశ్వతం చేస్తుందని గుర్తిస్తే మంచిది.  ఇదే సందర్భంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎంపికైనటువంటి  మాజీ జేఏసీ చైర్మన్  జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం గారు  తనకు  పోలీసు రక్షణ అవసరం లేదని  ప్రజల మధ్యన జీవించే వాళ్లకు పోలీసులు అవసరం ఏమిటని  రక్షణకు సంబంధించిన ఆ ఖర్చును తాను  త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన విషయాన్ని కూడా  సభ్య సమాజంతో పాటు ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. అందుకు అందరూ కూడా సిద్ధపడాలి  ముఖ్యమంత్రి ప్రధాని కేంద్ర మంత్రులు రాష్ట్రాల మంత్రులు  పర్యటిస్తున్న సమయంలోను  ఇతరత్రా  తమ కాన్వాయిని కొంత తగ్గించుకుంటే పెట్రోలు డీజిల్ వంటి  ఖర్చులు భారీగా తగ్గుతాయి  ఇక శాసన మండలి సభ్యులు  ప్రత్యేకంగా ప్రజాక్షేత్రంలో తిరిగే అవకాశం అంతగా లేదు కనుక  వాళ్లకు  రక్షణ సౌకర్యాన్ని  విరమించుకుంటే మంచిది అందుకు సభ్యులకు కూడా  త్యాగం చేసి తమ  నిజాయితీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలి . ఇప్పటికే భారీగా పెరిగినటువంటి వేతనాలను దృష్టిలో ఉంచుకొని   అనేక వర్గాలు  పిడికెడు మెతుకులకు నోచుకోని అభాగ్యులు కూడా ఉన్నారని ఆలోచించినప్పుడు  ప్రభుత్వ అధికార లాంచనాలతో  గడుపుతున్న తమ వేతనాలను కొంత కోత విధించుకోవడానికి  స్వచ్ఛందంగా ఆదర్శంగా జీవించడానికి  త్యాగాలకు సిద్ధపడటం ద్వారా  తమ గొప్పతనాన్ని చాటుకుంటే మంచిది.

అధికార నిధుల దుర్వినియోగం  ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే:-

ప్రతిరోజు ఏదో ప్రాంతానికి పర్యటించడంతోపాటు ఇతర దేశాలకు పర్యటిస్తున్న సందర్భంలో  తమ కార్యాలయాలు నివాసాల కు అయ్యే ఖర్చుతో సహా అనేక రకాల  ఖర్చు భారీగా పెరుగుతుండడంతో అది తడిసి మోపెడుతున్నది. అది ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తూ, అప్పుల పాలు కావడానికి , ప్రభుత్వ  చెల్లింపులు ఆగడానికి,  తీసుకునే నిర్ణయాలలో  మందగవనం పెరగడానికి కారణం అవుతున్నది . ఇక ఎన్నికలు,వ్యక్తిగత పనులలో  ప్రధానితో సహా ముఖ్యమంత్రి  రాష్ట్రాల మంత్రులు  రోజుల తరబడిగా పార్టీ కోసం  పనిచేసి ప్రభుత్వ వాహనాలనే వినియోగించడం , అధికారులు  సిబ్బందినివాడుకోవడం చట్టబద్ధంగా నేరమే!  అంతేకాదు  రాష్ట్ర లేదా దేశ పాలనకు సంబంధించిన విధుల నుండి పూర్తిగా వైదొలగి రాజకీయ పార్టీ ప్రచారానికే పరిమితం అవుతున్నందున ప్రభుత్వ పరంగా వచ్చే వేతనాన్ని కూడా తీసుకోవడానికి వారికి అర్హత లేదు . అలాంటి సందర్భంలో వేతనాలను కోత విధించడం ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ప్రతి అంశంలోనూ న్యాయవ్యవస్థ సుమోటోగా స్వీకరించి  ప్రభుత్వాలను ఆదేశించినప్పుడు మాత్రమే  కోటానుకోట్ల రూపాయలు దుబారా అవుతూ   పేద వర్గాలు మాత్రం పొదుపు చేయవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడడాన్ని  అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది . కేంద్రం ఇటీవల 16 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసింది కానీ పేద వర్గాలు తీసుకున్నటువంటి అప్పుల పైన మాత్రం నిర్బంధాలను విధించి  బజారుకీర్చిన సందర్భాలు అనేకం. అంటే పాలకులకు ఒక నీతి ప్రజలకు మరొక నీతియా?ఇంకానాయికపై సాగదు అనినినదించాల్సిన సమయమాసన్నమైనది.  "కాపలాధారుగా నియమిస్తే కంచే చేను మేసినట్లు  అధికార దుర్వినియోగానికి పాల్పడి నిధులను కొల్లగొట్టి  రాష్ట్రాన్ని దేశాన్ని అప్పులపాలు చేసి సర్వసుఖాలు అనుభవించడానికి కాదు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది .... ప్రజలకు సేవకులుగా   పనిచేసి ప్రజలను ప్రభువుల స్థానంలో నిలబెట్టడానికి " ఈ శాస్త్రీయ అవగాహన, సామాజిక దృక్పథం , సేవా తత్పరత,  విశాల ప్రాతిపదికన కొనసాగే పరిపాలనలోని  నిబద్ధతను గుర్తించకుండా తమవరకే పరిమితమై  దుబారాకు పాల్పడి  విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని  అదుపు చేయడానికి ప్రత్యేకమైన యంత్రాంగాన్ని రూపకల్పన చేయవలసిన అవసరం కూడా చాలా ఉన్నది. ఈ వైపుగా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినప్పుడు మాత్రమే  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి  దుబారా అవినీతిని    ప్రజాధనం కొల్లగొట్టడాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది."  ప్రశ్నించకుంటే కొనసాగేదే చట్టం అవుతుంది ప్రశ్నించినప్పుడు  పాలకులు తమ తప్పును సవరించుకోవడానికి  పొదుపుగా వ్యవహరించడానికి అవసరమైతే త్యాగాలు చేయడానికి సిద్ధపడతారు.  ఆదమరిచి ఉంటే  ప్రశ్నించకుంటే  ప్రజల మీద స్వారీ చేస్తారు".  అందుకే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు  ఓటును వినియోగించుకుని  నిర్ణయాత్మక శక్తిగా నిలుస్తారా? లేక బానిసలుగా మిగిలిపోతారా? తేల్చుకోమని చేసిన హెచ్చరిక లోని అంతరార్థం కూడా ఇదే !
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)   ఓ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333