పురుగుల అన్నం.. నీళ్ల చారు...
- తినలేక విద్యార్థినుల అవస్థలు.
- డైట్ చార్జీలు పెరిగిన డైట్ చేసే పరిస్థితే...
- విలువైన సామాగ్రి వంట సిబ్బంది చేతివాటం..
- అన్ని క్వార్టర్స్ కు బాక్స్ లలో సరఫరా...?
- గ్రూపులుగా విడిపోయిన గురువులు..?
- ఈ సంవత్సరం విద్యార్థుల పాసింగ్ పై నీలి నీడలు.
- మేడిపండు చందంగా భద్రాచల గిరిజన గురుకులం.
- అధికారుల పర్యవేక్షణ లోపం..
- వర్గ పోరుతో విద్యార్థినులకు శాపం.
గతం ఎంతో ఘనకీర్తి కలిగిన భద్రాచలం టి టి డబ్ల్యు యు ఆర్ జె సి బాలికల పాఠశాల, కళాశాల నేడు సరైన ఆదరణకు నోచుకోకుండా అతలాకుతులమవుతుంది. ప్రతి సంవత్సరం అనేకమంది విద్యార్థినిలు చదువులు ముగించుకొని గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో సీట్లు సంపాదించి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఇతర అనేక రంగాలలో స్థిరపడి ఈ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలకు మంచి పేరు తెచ్చారు. అంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ గురుకులం నేడు గురువుల మధ్య గ్రూపుల లొల్లితో సతమతమవుతుంది. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి ఆధిపత్యాన్ని వాళ్ళు చెలాయిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. గతంలో సుమారు 36 రూపాయలను ప్రతి దినం విద్యార్థుల భోజనం నిమిత్తం మంజూరు చేయడం జరిగేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సుమారు 70 రూపాయలు మెస్ చార్జీలు ఇస్తున్నారు. అయినప్పటికీ గతంలో లాగానే ఇప్పుడు కూడా చాలీచాలని కూరలతో ఎటువంటి మెనూ పాటించకుండా తమ ఇష్టానుసారంగా హాస్టల్ సిబ్బంది ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతినిత్యం ఇవ్వవలసిన కోడిగుడ్లు ఇవ్వడం లేదని, అసలు మెనూ ప్రకారమే భోజనం పెట్టకుండా ఉంటున్నారని విద్యార్థినిలు వాపోతున్నారు. సరైన ఆహారం పెడితే కడుపునిండా తిని మంచి చదువులు చదువుకుంటామని, సరిపోని కూరలతో అన్నం తినలేక సగం పడేయడం జరుగుతుందని, ఈ విధంగా ఉంటే ఎలా చదువుకుంటామని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. సరైన సంస్కారం, చక్కటి విద్య నేర్పవలసిన గురువులే గ్రూపులను కట్టి విద్యార్థులలో రెండు భాగాలుగా విడిపోయే దానికి కారణమయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. గత ఆరు నెలల నుండి కూడా అనేక మార్లు భోజనాలలో పురుగులు వస్తున్నాయని, కూరలు సరిగా వండడం లేదని, ఇవ్వవలసిన మెను ఇవ్వడం లేదని ఫిర్యాదులు వచ్చిన ఈ గురుకుల సిబ్బందిలో ఎటువంటి మార్పు జరగక, పెరిగిన మెనూ ప్రకారం పెట్టకుండా మిగిల్చుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గత నెలలో రెండున్నర లక్షల రూపాయలు మిగలడం జరిగిందని తెలుస్తుంది. పిల్లలకు సరైన వసతులు లేక భోజనం లేక ఇబ్బంది పడుతున్నారని గతంలో ఫిర్యాదులు ఇచ్చిన సంబంధిత అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి వెనకేసుకొస్తున్నారని, భోజనాలన్నీ కమ్మగా ఉన్నాయని చెప్పిస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనాప్పటికీ ఆరోగ్యంగా పెరగాల్సిన విద్యార్థినులు అనారోగ్య బాటలు పడుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారనేది జగమెరిగిన సత్యం. ఇక్కడ చదువుకునే విద్యార్థినులకు పెట్టడానికి అనేక కారణాలు చెప్పే గురుకుల సిబ్బందికి, చికెన్, మటన్, ఇతర మంచి కూరలు వండినప్పుడు కొంతమంది సిబ్బంది క్వార్టర్స్ లోకి కేజీల లెక్క వెళ్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. వంట సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని, కూరగాయలు విలువైన సామాగ్రి ప్రతిరోజు తీసుకు వెళ్తున్నారని తెలుస్తుంది. కళాశాలలో ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఉన్న అవి పని చేయకపోవడం సిబ్బంది క్వార్టర్స్ లోకి బాక్సుల రూపంలో కూరలు వెళ్లడానికి ఈజీగా మారిందని తెలుస్తుంది. గత కొంతకాలంగా ఈ గిరిజన గురుకులం మేడిపండు చందంగా మారిందనే చర్చ బహటంగానే సాగుతుంది. పైన పటారం లోన లొటారం తీరుగా ఇక్కడ తీరుతెన్నులు కనిపిస్తున్నాయి. తక్షణమే స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందించి గురుకుల పాఠశాలను సందర్శించి పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయకపోతే కాలేజీలో విద్యార్థినిల పాసింగ్ శాతం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.