పాలనా నిధుల సమీకరణకు అవినీతిపై జల్లెడబట్టాలి
పాలనా నిధుల సమీకరణకు అవినీతిపై జల్లె డబట్టాలి.* ఉద్యోగులు అధికారులు మాత్రమే కాదు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల పైన ఉక్కు పాదం మోపాలి.* పిల్లికి గంట కట్టేది ఎవరనే కదా అనుమానం.* న్యాయ వ్యవస్థ ఆ గురుతర పాత్ర పోషిస్తే ప్రజలు హర్షిస్తారు.*
**********************************
---వడ్డేపల్లి మల్లేశం 90142 06412
---28....02....2025********
"ఏ దేశ చరిత్ర చూసినా నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణాత్వం అన్న మాదిరిగా ఏ ప్రాంతంలో తరచి చూసిన అవినీతి విశృ o కళత్వమే మనకు కనపడుతుంది. ప్రభుత్వ ఆదాయానికి వనరుగా ప్రజలు తమ ప న్నుల ద్వారా ఊ త మందిస్తున్నప్పటికీ అనేక సందర్భాలలో కాంట్రాక్టులు ఇతర ఒప్పందాల సమయములో జరుగుతున్నటువంటి అవినీతి బాగోతాలు ఒకవైపు అధికార యంత్రాంగం నాయకుల స్థాయిలో జరుగుతూ ఉంటే క్రింది స్థాయిలో కార్యాలయాలలోని సిబ్బంది మామూలు ప్రజలు రైతులు చేతి వృత్తుల వాళ్ళు పేద వర్గాల పొట్టను కొట్టి ముక్కు పిండి వసూలు చేయడాన్ని మనం గమనిస్తే అందినంత కాడికి దోచుకోవడమే ఈ దేశంలో రివాజుగా మారిపోయింది." న్యాయము, ధర్మము, నైతిక విలువలు, మానవీయ సంబంధాలు, ప్రేమ అనురాగము వంటి అంశాలు కేవలం ప్రకటనలకు పత్రికలకు పుస్తకాలలో రాసుకున్న పదాలుగా మాత్రమే పరిమితమైపోతే ఏ రకంగా అక్రమ సంపాదన చేయాలి? ఇతరుల పొట్టను కొట్టడం ఎట్లా? అని ఎక్కడి వాళ్ళు అక్కడనే అవినీతికి పాల్పడి దేశవ్యాప్తంగా విషభీజాలు నాటుతూ ఉంటే ఆ ఆలోచన చేయని వాడే పిచ్చివాడు అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పాలకవర్గాలు ప్రజల కొనుగోలు శక్తిని గణనీయంగా తగ్గించే ముందు చూపులేని పనుల కారణంగా విద్యా వైద్యం ప్రైవేటు రంగానికి అప్పజెప్పడంతో అనివార్యంగా తమ ఆదాయంలో పెద్ద మొత్తంలో ఖర్చు చేయక తప్పడం లేదు. ఇంటి నల్ల పన్ను లు, జీఎస్టీ పేరున ప్రతి కొనుగోలు పైన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు పన్ను చెల్లించక తప్పడం లేదు. అంతెందుకు జీవిత బీమా ప్రీమియం చెల్లించుకోవడానికి కూడా జీఎస్టీని అదనంగా భరించవలసి వస్తున్నది అంటే ప్రభుత్వం ఆదాయ మార్గానికి మాత్రమే ఆలోచిస్తున్నది కానీ ప్రజల సంక్షేమానికి కాదు అనే విషయం రూఢి అవుతున్నది. పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువులు ఇతర నిర్మాణ రంగ పరిశ్రమలకు సంబంధించినటువంటి కొనుగోళ్ల విషయంలో కూడా ధరలు భారీగా పెరగడంతో పేద కుటుంబాలు కనీస మైనటువంటి స్థాయిలో కూడా జీవించడానికి అవకాశం లేకుండా పోయింది. కనీస జీవన అవసరాలకు కూడా నోచుకోని దుస్థితిలో కో టానుకోట్ల కుటుంబాల జీవితాలు గడిచిపోతుంటే ఇది మానవాభివృద్ధి ఎలా అనబడుతుంది? కనీస మానవాభివృద్ధికి అవకాశం లేని దౌర్భాగ్య పరిస్థితులున్న భారతదేశంలో పేదలు, ధనవంతులు, సంపన్నులు, కార్పొరేట్లు అని వివిధ స్థాయిలలో వివక్షత అసమానత అంతరాలు కొనసాగుతూ ఉంటే దేశ సంపద కొద్దిమంది చేతుల్లో బo ది అయిపోయినప్పుడు స్వాతంత్రం యొక్క నిజమైన ఫలితాలను చవిచూడగలమా?
గ్రామ కార్యదర్శి నుండి ఐపీఎస్ స్థాయి వరకు,
వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ వరకు-
--***************----************************
ఇటీవల కాలంలో గమనించినప్పుడు మామూలు పంచాయతీ కార్యదర్శి కూడా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు పత్రికా కథనాలు వెలువడుతుంటే ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు కోటానుకోట్ల రూపాయలతో పాటు బస్తాలలో డబ్బులను దాచిపెట్టిన వైనాన్ని బయటపెడుతున్న సందర్భాలు అనేకం. ఏకంగా ఇటీవలి కాలంలో ఒక న్యాయమూర్తి ఇంట్లో కాలుతున్న నోట్ల కట్టలు దర్శనమిచ్చినప్పుడు ఈ సంపద అంతా ఎవరి సొమ్ము? అక్రమార్జన కాక మరేమిటి? ఈ అక్రమ సంపాదన పేదలు, నిర్భగ్యుల కష్ట ఫలితమే కదా? గత 3 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మండల రెవెన్యూ అధికారి పైన ఏకంగా ఒక రైతు పెట్రోలు చల్లి నిప్పంటించిన వైనం ఈ దేశంలో చెలరేగుతున్నటువంటి అవినీతికి దర్పణం పడుతున్నది. అనేకచోట్ల భార్యలు అవినీతికి పాల్పడితే సహించలేక అవమానం భరించలేక భర్తలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఒకవైపు దర్శనమిస్తే, మరొకవైపు భర్తలు అవినీతికి పాల్పడిన విషయాన్ని తట్టుకోలేక భార్యలు ముఖము చాటేసినా వైనాన్ని కూడా మనం గమనించడం ఒక ఎత్తు అయితే ఏకంగా లక్షలు కోట్ల రూపాయలనే లంచాల రూపంలో డిమాండ్ చేయడం భరించరానిదిగా మారిపోయింది. విచారణ పేరుతో కాలయాపన చేయడమే కానీ పత్రికల్లో వచ్చిన తర్వాత తనిఖీలు జరిపి దోషులను తేల్చి నడి బజారులో పట్టపగలు, ప్రజల సమక్షంలో శిక్షించవలసినటువంటి అంశాలను దారి మళ్లిస్తూ మళ్లీ మళ్లీ విచారణ పేరుతో కనుమరుగవుతూ ఉంటే ఈ అవినీతిని కట్టడి చేయడమెలా సాధ్యమవుతుంది?.
అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగుల అవినీతి సందర్భంలో ప్రభుత్వాలు ముఖ్యమంత్రి మంత్రులు, కేంద్ర మంత్రులు ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరాన్ని పక్కనపెట్టి విచారణ పేరుతో కాలయాపన చేస్తూ నేరం రుజువు కాకుండా ఆపే ప్రయత్నం చేస్తూ అవినీతిని మరింత పెంచి పోషించడం అంటే దీని అర్థం ఏమిటి? రాజకీయ క్షేత్రంలో అవినీతిని అంతం చేయకుండా అధికార యంత్రాంగంలో అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించడం సాధ్యం కాదు అనే కదా! అర్థమయ్యేది. అంటే అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య లో పాయి కారి ఒప్పందం కారణంగానే అక్రమార్జన అవినీతి బాగోతాలు రుజువు కాకపోవడం, ఆ సొమ్ము తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ కాకపోవడం వలన ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నది. అవినీతికి పాల్పడిన వాళ్ల లోపల ఆత్మస్థైర్యం మరింత పెరుగుతున్నది ఇది ప్రజా వ్యతిరేక చర్యగా భావించకపోతే భవిష్యత్తులో ప్రజల పక్షాన మెరుగైన ఫలితాలను చూడలేము. ఇక ప్రజాప్రతినిధుల అవినీతిపైన ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు పేరుతో కాలయాపన చేయడం వార్తల్లోకి ఎక్కడం కొంతకాలం తర్వాత కనుమరుగు కా వడంతోనే కథ ముగిసిపోతున్నది కానీ దండుకున్న ప్రజల సొమ్మును ప్రజల ఖాతాకు జమ చేసిన సందర్భాలు మాత్రం కనిపించడం లేదు ఇది అత్యంత బాధాకరం. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా కావలి కుక్కలమని చెప్పుకున్నటువంటి పాలకవర్గాలు ప్రజల సొమ్మును కాపాడింది లేదు పైగా నమ్మించి మోసపూరిత పద్ధతిలో సొమ్ము చేసుకోవడమే అలవాటైన పరిస్థితిలో రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిదులు అందరు కూడా చేతికి అందిన కాడికి దో సుకోవడం, ప్రశ్నించకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి దోచుకోమని సైగ చేయడం, చివరికి విచారణ పేరుతో మాత్రం క్రింది స్థాయి అట్టడుగు ఉద్యోగులను బలి పశువులను చేస్తున్న విధానాన్ని మనం గమనించవచ్చు. సమాజంలో ఏ రకంగా దిగువ స్థాయి వర్గాలు అన్ని రకాల వివక్షత అణచివేత పేదరికానికి బలవుతున్నాయో అదే మాదిరిగా ఉద్యోగులలో కూడా పెద్దలు చేసిన నేరానికి చిన్న ఉద్యోగులను బలి పశువులను చేసే ఆనవాయితీ ఇప్పటికీ కూడా కొనసాగడాన్ని న్యాయ వ్యవస్థ నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ప్రత్యేక యంత్రంగాలు ఉన్నప్పటికీ వాటిని పురమాయించే పాలకవర్గాలు ధైర్యం చేయకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని సుమోటోగా స్వీకరించి న్యాయవ్యవస్థ అవినీతిపైన ఉక్కు పాదం మోపాలి. దానికి మంత్రులు ముఖ్యమంత్రులు పార్లమెంటు సభ్యులు అనే తేడా లేకుండా అధికారానికి అతీతంగా చర్యలు తీసుకున్నప్పుడు సమగ్రమైన విచారణ జరిపించి నిగ్గు తేల్చడానికి న్యాయవ్యవస్థ సమక్షంలో ప్రత్యేక యంత్రాంగాన్ని రూపకల్పన చేయడం కూడా నేటి పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే" రాజకీయ యంత్రాంగం తన నేరాన్ని తాను అంగీకరించదు కనీసం విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉండదు కనుక కారు చీకటిలో కాంతిరేఖ లాగా న్యాయ వ్యవస్థ అయినా జోక్యం చేసుకొని ఉక్కు పాదం మోపడం, దోషులను తేల్చి మింగిన సొమ్మును కక్కించడం కనీస అవసరం. ఇవ్వాళ దున్నాల్సింది కేవలం భూములనే కాదు మూర్ఖపు ఆలోచనలతో సామాజిక రుగ్మతలకు వంత పాడుతున్న మనుషుల మెదళ్లను కూడా అన్న మాదిరిగా...? పరిపాలన అంటే డబ్బును వివిధ పద్దుల కింద ప్రజలకు పంపిణీ చేయడం మాత్రమే కాదు మోసానికి గురైనటువంటి ప్రజల సొమ్మును కక్కించడం కూడా అవసరం. అవినీతి పైన పంజా విసరడం ద్వారా మాత్రమే నీతి బద్ధమైనటువంటి పరిపాలన సాధించడానికి, ప్రజా సొమ్ముకు నిజమైన కాపలా అందించడానికి, ప్రతి పొలం మడికి నీరు చేరినట్టుగా ప్రజాధనం ప్రజలందరికీ చేరడానికి అవకాశం ఉంటుంది. అదే కదా నిజమైన పాలన సుపరిపాలన అంటే.
" ప్రజాధనం అవినీతి రూపంలో కొన్ని కుటుంబాల జేబుల్లోకి చేరుతూ ఉంటే ప్రజలు మౌనంగా ఉన్నంతకాలం ఆ అవినీతి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. దానికి అడ్డుకట్ట వేయడానికి ప్రజలు కర్తవ్య దీక్షపరులై ఉద్యమకారులై ప్రతిఘటిస్తే తప్ప సాధ్యం కాదు. ఆదాయ అంతరాలు అసమానతలు రోజురోజుకు మరింత పెరగడానికి అవినీతి కూడా ఒక ప్రధానమైనటువంటి హేతువుగా పరిణమించిన వేళ ప్రజలు కూడా చైతన్యముతో తమ హక్కులను సాధించుకోవడానికి ప్రజా ప్రతినిధులు ఉద్యోగ యంత్రాంగముతో పనులు చేయించుకోవడానికి పొద్దుపొడుపు సూర్యుల లాగా నిద్దుర లేవాల్సినటువంటి అవసరం ఉన్నది. అడగకుంటే, ప్రశ్నించకుంటే, ప్రతిఘటించకుంటే అక్రమంగా సంపాదించినదే చట్టబద్ధ పాలనగా మారిపోతే సుపరిపాలన అనే పదానికి ప్రజాస్వామ్యంలో అడ్రస్ లేకుండా పోతుంది జాగ్రత్త ! కోట్ల అవినీతి సొమ్ము జనజీవన స్రవంతిలోకి రాబట్టక పోతే మన భారత ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం కూడా ఉన్నది .ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనలో నిధుల అలాట్మెంట్లో సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు జనాభా దామాషాలో ఏమాత్రం కూడా కేటాయింపు జరగనటువంటి నికృష్ట పరిస్థితులలో నీ మౌనం.... విషాదకరంగా దయనీయంగా తలవంచుకునేలా నిన్ను దోషిగా సమాజం ముందు నిలబెడుతుంది" ప్రశ్నిస్తే.... నీవు సమాజానికి మార్గదర్శిగా నిలబడతావు.... ఎటువైపు నిలబడతావో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది.. "
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)