రాజకీయాలతో సంబంధం లేకుంటే అసంపూర్తి సాహిత్యమే
రాజకీయ అంశాలను సాహిత్యం తట్టి లేపాలి.* "నా సాహిత్యంలో రాజకీయం ఉండదు" అనేవాళ్లు రాజకీయం సాహిత్యంలో అంతర్భాగం అని గుర్తించాలి.*
**************
--- వడ్డేపల్లి మల్లేశం 9 0142064 12
----08....02....2025********
"రాజ్యాంగబద్ధంగా ప్రజా రాజకీయాలు నడపవలసినటువంటి పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతూ రాజ్యాంగ ఉల్లంఘనలతో సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్న సందర్భంలో, అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన వివక్షత నిత్యం నిరంతరం కొనసాగుతూ ఉంటే ఇవేవీ తమకు పట్టనట్లు ప్రభుత్వాలు మిన్నకున్నప్పుడు, సమాజాన్ని సంక్షోభంలో నుండి సమ సమాజం వైపు తీసుకు వెళ్లాల్సిన బదులు సామాజిక రుగ్మతలను మద్యం క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు, అశ్లీలం మత్తు పదార్థాలను చట్టబద్ధం చేసి యువతను నిర్వీర్యం చేయడంలో పాలకులే క్రియాశీలక పాత్ర పోషించినప్పుడు ఆ అంశాలను ఎత్తి చూపవలసినరచయితలు
"నా సాహిత్యంలో రాజకీయాలకు పాత్ర లేదు" అని గొప్పగా చెప్పుకోవడం అంటే ఆ రచయిత సమాజాన్నిసామాజిక బాధ్యతను విస్మరించినట్లే."
వాస్తవంగా సాహిత్యం ప్రజా ప్రయోజనాలను సాధించి పెట్టే క్రమంలో రచయిత వర్ణన విషయ వివరణ కు మాత్రమే పరిమితమైతే పరిపాలనలోని డొల్లతనాన్ని, సామాజంలో సంస్కరణ ఆవశ్యకతను, ప్రజా చైతన్యాన్ని, ప్రజా ఉద్యమాల ఆవశ్యకతను సాహిత్యం మరిచిపోయినట్లే కదా! ప్రధాన బాధ్యతలను మరిచిపోయినటువంటి సాహిత్యకారులు రాజకీయాలతో తమకేమిటి సంబంధమని, అనవసరంగా పాలకులను విమర్శించి కొని తెచ్చు కోవడం ఎందుకని, రాజకీయ నాయకుల జోలికి పోకుండా వారితో సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా గుర్తింపు కోసం ఆరాటపడే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటప్పుడు నిజంగా మనం సామాజిక బాధ్యతను తాకట్టు పెట్టినట్లే అవుతుంది. ప్రజల జీవితంలో విప్లవాత్మక మార్పులు రావాలంటే, రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందవలసినటువంటి ఫలాలు అందాలంటే, సమానత్వం అంతరాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే, రచయితలు తప్పకుండా రాజకీయ అంశాలను తమ సాహిత్యంలో ప్రతిఫలింప చేయాలి, తట్టిలేపాలి కూడా. తద్వారా మాత్రమే ప్రజలను జాగరుకులుగా చేయడంతో పాటు వాళ్ళ కర్తవ్యాలను నిర్వచించడం, బాధ్యతలను గుర్తింప చేయడం, పాలకుల యొక్క స్వార్థ ప్రయోజనాలను ఎండగ ట్టడం సాధ్యమవుతుంది.
రాజకీయం సాహిత్యంలో అంతర్భాగం:-
*************
తాము రాసిందే సాహిత్యమని, ఆశించే మార్పులే సమాజ సంస్కరణ అని, అవినీతి అక్రమాలు రాజ్య హింస పైన యుద్ధం చేయకుండా మినహాయింపు ఇచ్చేది అసంపూర్తి సాహిత్యమే అవుతుంది. సమాజం యొక్క హితాన్ని కోరేది సాహిత్యమని సాహిత్యకారులు నిర్వహించినప్పటికీ కాలానుగుణంగా దాని యొక్క పరిధిని విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సమాజానికి హితం చేకూర్చేది మాత్రమే కాదు హేతుబద్ధమైన ప్రయోజనకరమైనటువంటి సాహిత్యాన్ని రూపకల్పన చేసే సందర్భంలో అవసరమైతే రచయితలు కార్యకర్తలు ప్రత్యక్ష భాగస్వాములు కావడం ద్వారా తమ వాని వినిపించాలి, వాదన తో బలపరచాలి, ఉత్తమ సమాజానికి బాటలు పరచాలి, నిద్రాణమై ఉన్నటువంటి యువత భిన్న వర్గాలను మేల్కొల్పవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ప్రధానంగా ప్రజలకు సమాజానికి నష్టం చేకూర్చేది, ప్రజా సంపదను కొలగొట్టేది, ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను హ రించి వేసేది, పాలకులతో పాటు పెట్టుబడిదారి భూస్వామ్య కార్పొరేట్ వ్యవస్థలు. రాజకీయ వ్యవస్థ అవినీతిని పెంచి పోషించడంతోపాటు అక్రమార్జనకభూ దందాలకు స్వ ప్రయోజనాలకు మాత్రమే ఆరాటపడి వాగ్దానాలు హామీలు ప్రలోభాలతో ప్రజలను వంచించే ప్రయత్నం చేసే క్రమంలో ప్రజలను బా బానిసలుగా యాచకులుగా మార్చడాన్ని రచయితలు పసిగట్టాల్సిన అవసరం ఉంది. కేవలం సమస్యను గుర్తిస్తే సరిపోదు పరిష్కారాలను చూపవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రధాన భూమిక పోషించే రచయితలు కవులు కళాకారులు మేధావులు తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి నేరాన్ని ఘోరాలను స్థబ్దంగా భరిస్తే అంతకుమించిన బాధ్యతారాహిత్యం మరొకటి ఉండదు కదా! వ్యక్తిగత గుర్తింపు కోసం అవార్డులు పురస్కారాలు సన్మానాల ద్వారా సమాజంలో స్థానం సంపాదించుకోవడమే సాహిత్యం యొక్క ప్రయోజనం అని రచయితలు ఆశిస్తే ఆశపడితే ఇక సామాన్య ప్రజలకు దిక్కేవరు? అందుకే రచయితలు రాసే రచనలు విశ్వవ్యాప్తమై విశ్వ జనీయనమైనటువంటి అంశాలను ప్రస్తావించే క్రమంలో రాజకీయాలను సాహిత్యంలో అంతర్భాగాలుగానే చూడవలసి ఉంటుంది. విశాలమైనటువంటి పరిధి కల సాహిత్యములో అంతర్భాగమైన రాజకీయాలని ప్రస్తావించకుండా వదిలిపెట్టడం, సంబంధం లేదని దాటవేయడం, రాజకీయాలు ప్రజల అవసరాలు కాదని దు రభిప్రాయాన్ని వ్యక్తం చేయడం రచయితలకు తగదు. సాహిత్యానికి అనర్హమైనది ఏదీ లేదని ప్రముఖ విప్లవ రచయిత శ్రీ శ్రీ ఒకవైపు హెచ్చరించిన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుంటూనే రాజకీయ వ్యవస్థ గురించి రాజకీయ చేష్టల గురించి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ప్రలోభాలతో నెగ్గి ప్రజలను బలి పశువులను చేసే అ ప్రజాస్వామిక విధానాలపై దృష్టి పెట్టకపోతే ఆ పని ఇంకెవరు చేస్తారు? అయితే కవులు కళాకారులు రచయితలతో పాటు మేధా మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు ఉద్యమకారులు ప్రజల సమస్యల పైన ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ రాజ్య హింసను ఎదుర్కొంటూ కుటుంబాలకు వ్యవస్థకు దూరమై జీవితాలను పూర్తిగా ప్రజా కోణంలోనే త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అలసిపోయి ఓడిపోవడాన్ని గమనించినప్పుడు ఆ అంశాలను కూడా ప్రస్తావించడం బాధ్యతగా రచయితలు అంగీకరించి తీరాలి .రచయితల యొక్క దృక్పథం, ఆలోచన ధోరణి, రచన శైలి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉందని తప్పుడు అభిప్రాయాలను అంటగట్టే ప్రయత్నం చేస్తారు కానీ రచయితలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనడం కంటే ప్రజల పక్షాన ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని అన్యాయానికి గురవుతున్నటువంటి సామాన్య ప్రజల గొంతుకగా కర్తవ్య నిర్వహణలో పని చేస్తున్నారని ముగింపుకు రావడమే సరైనది .అందుకే" వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం" అంటూ ప్రముఖ విప్లవ రచయిత శ్రీ శ్రీ అన్న మాటలను ఇక్కడ సందర్భం గా ప్రస్తావిస్తే రచయితలు కవులు కళాకారులని గొప్పగా చెప్పుకునే ముందు ప్రజలు పలు రకాల ప్రశ్నలు ప్రశ్నిస్తారని వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత రచయితలుగా తమ పైన ఉంటుందని అంగీకరించి తీ రాలి. అప్పుడే రచయితలు సంఘజీవులు అవుతారు లేకపోతే సంఘానికి సమాజానికి అతీతంగా గుర్తింపు కోసం గౌరవాల కోసం మాత్రమే బ్రతికే విగత జీవులుగా మిగిలిపోతారని ముగింపుకు రావలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఇప్పటికైనా సాహిత్యాన్ని, ప్రయోజనాన్ని, రచయిత స్థాయిని పునర్ నిర్వచించుకోవలసినటువంటి అవసరం మన అందరి పైన ఉన్నదని గుర్తించ వలసిన సందర్భం ఆసన్నమైనదని అంగీకరిస్తే తగు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)