పాలకులు వేదాలు వల్లిస్తే సరిపోతుందా?
ఉద్యోగ యంత్రాంగం డిమాండ్లను పట్టించుకోకపోతే ఎలా? తెగేదాకా లాగితే ఫలితం ఏముంటుంది? అప్రతిష్ట పాలు కావడం తప్ప. అంతే కాదు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త!
----వడ్డేపల్లి మల్లేశం
చట్టసభల సమావేశాలే అరుదుగా జరుగుతున్న ఈ రోజుల్లో సమయాన్ని దుర్వినియోగం చేయడమే ఎక్కువ. గత మూడు రోజులుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ముందునుండే అనైతిక పద్ధతులలో మొదలై ప్రజలకు రోత పుట్టించినవి. నడి బజార్లో బట్టలిప్పే కు సంస్కారానికి పాలక ప్రతిపక్షాల ప్రస్తావన లేకుండా రాజకీయ పార్టీలు అన్నీ కూడా దిగజారిన సందర్భం ప్రజల యొక్క చైతన్యాన్ని ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసి గెలిపించి ఆ తర్వాత వదిలిపెడితే పాలకులు ప్రజలను పట్టించుకుంటారు అనుకోవడం వట్టి భ్రమ. పైగా చట్టసభల కాలాన్ని దుబారా చేయడం పరస్పర ఆరోపణలతో తగవులు ఆడుకోవడం దేనికి సంకేతం? అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్య వైద్యం, మెరుగైన అవకాశాల గురించి విద్యార్థులు, రైతులు, కార్మికులు ఒకవైపు తమ డిమాండ్ల గురించి పోరాటం చేస్తుంటే లక్షలాదిమంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు సంవత్సరాల తరబడిగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ ల కోసం చలో హైదరాబాద్ పిలిపిస్తే చట్టసభల బయట చట్టసభల లోపల కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఎవరూ కూడా ప్రతిస్పందించలేదంటే ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో బాధ్యత గల ప్రతిపక్షం కూడా ప్రస్తావించకపోవడం నిన్న మొన్న జరిగిన సంఘటనలు సంఘర్షణ గురించి మాత్రమే విలువైన సమయాన్ని దుర్వినియోగం చేయడం ఎవరి ప్రయోజనం కోసం? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన ఉత్తీర్ణులై కూడా తమ సర్టిఫికెట్లను పొందలేక సుమారు 15 వేల కోట్ల రూపాయలను బకాయి పెట్టి ప్రభుత్వం బాధ్యతను మరిచిన సందర్భాన్ని ఏమందాం? ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉద్యోగులు ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే యంత్రాంగం పట్ల నిరంకుశ వైఖరి దీర్ఘకాలికంగా మంచిది కాదు పైగా ప్రభుత్వం అ భాస్ పాలు కాక తప్పదు. ఉద్యోగులను పె డ చె వి ని పెడితే. రాజకీయ పార్టీల మధ్యన దోబూచు లు ఆడుకుంటూ. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజల మనసులను చూరగొనె విషయంలో పాలకులకు సహకరించేది ఉద్యోగులే. ఉద్యోగుల పైన కూడా నిరంకుశ వైఖరిని అవలంబిస్తూ వారి పాత్రను కనీసం పరిగణలోకి తీసుకోకుండా ప్రజల ముందు నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం గత 4o ఏళ్లుగా కొనసాగుతున్నది అంటే పాలకుల యొక్క దుశ్చర్యకు దుర్మార్గానికి ఇది పరాకాష్ట కాక మరేమిటి ?ప్రభుత్వం ముందు ప్రజల సమస్యలు ఎన్ని విన్నా పట్టించుకోకుండా చట్టసభలను కాలయాపనకు పరిమితం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది నిజం కాదా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఆడిపోసుకోవడం ఎంతవరకు సమంజసం.?
గతంలో సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన ప్రకారం ఉద్యోగులకు ఇస్తున్నటువంటి పెన్షన్, డి ఏ ఇతర అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చట్టబద్ధమైనవని హక్కులని ప్రభుత్వాల దయాదాక్షిణ్యం కాదని తీ ర్పి చ్చి నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఆరు డిఏలు పెండింగ్లో ఉంచి ఒక పిఆర్సికి అతిగతి లేని పరిస్థితిలో మరొక పి ఆర్ సి గడువు ముంచుకొస్తున్న తరుణంలో ఎ లాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం, అవసరమైతే రెండు సంవత్సరాలు వాయిదా వేసుకోమని ప్రకటించడం, ఉద్యోగుల సమస్యలను మేము చూసుకుంటాం కానీ ఉపాధ్యాయులు ఉద్యోగులు మాత్రం ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నం కావాలని చెప్పడం ఏ మేరకు సమంజసం?? రెండు సంవత్సరాలుగా విసిగి వేసారి విస్తృతమైన పోరాట కార్యక్రమాలను తీసుకుంటున్న ప్రతి సందర్భంలో కూడా మనసు మార్చేలా ఉద్యమాన్ని నీరు గారిచేలా ప్రభుత్వాలు ఎత్తుగడలతో ఉద్యమాన్ని అడ్డుకోవడానికి చేసిన కుయుక్తులు అన్నీ ఇన్నీ కావు. ఉద్యమ శక్తులు ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక లోకం ఏమాత్రం ఉపేక్షించిన ప్రభుత్వాలు బలహీనులుగా చూస్తాయే తప్ప సంస్కారమని అంగీకరించవు. ఆ పరిస్థితి వస్తే
ఉద్యోగసంఘాల నాయకులు కూడా స్వార్థపరులుగా ముద్రవెయబడతారు జాగ్రత్త!
ఇంత వివక్షత నా?
ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తున్న వారు ఎన్ని పదవులు పొందుతే అన్ని పెన్షన్లకు అర్హులు. వ్యక్తిగత పనుల మీద ప్రజాక్షేత్రంలో కనిపించకపోయినా వేతనంలో కోత విధించరు , స్వయంగా కేసీఆర్ మాజీ టిఆర్ఎస్ అధినేత కు అసెంబ్లీకి రాకపోయినా కోట్లాది రూపాయలు వేతన రూపంలో ముట్టజెప్పిన సంగతి తెలుసు. అంతేకాకుండా ప్రజాధనాన్ని ఎక్కడికక్కడ ఇష్టం ఉన్నట్టు దోచుకోవడంలో ఒక పార్టీకి మరొక పార్టీ పోటీపడుతున్న సంగతి మనకు తెలుసు . లక్షకోట్ల అవినీతి అని ఒకరంటే లక్షల కోట్ల దోపిడీ అని మరొక పార్టీ రాసుకొని తిరుగుతున్న సంగతి మనకు తెలుసు. రాజకీయ పార్టీలకు ఏమో ఇంతటి వెసులుబాటు ఉంటే ఉద్యోగులకు శిక్షలు, వేతనంలో కోతలు, ఇంక్రిమెంట్లు కట్ చేయడం, వాళ్ల కృషిని గుర్తించకపోవడం, ఇవ్వాల్సిన డిఏలు వేతన హెచ్చింపులను సకాలంలో చెల్లించ కుండా దాటవేస్తూ ఇప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో చాకిరీ చేయించుకున్న దుర్మార్గపు లక్షణాల్ని ప్రశ్నించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. సెప్టెంబర్ 10వ తేదీన జరగాల్సిన చలో హైదరాబాద్ ఉద్యమాన్ని బలహీనం చేసే క్రమంలో ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పటికీ ఎలాంటి ఒప్పందాలు జరగకపోవడం స్పష్టమైన హామీలు లేకపోవడంతో నాయకత్వాన్ని కిందిస్థాయి ఉద్యోగులు విమర్శించే ఆస్కారం కూడా లేకపోలేదు. సెప్టెంబర్ 18 వ తేదీ నాటికి చర్చలు వాయిదా వేసినప్పటికీ పెండింగ్లో ఉన్న డిమాండ్లు అన్నింటిని పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా కిందిస్థాయి ఉద్యోగులు, కార్యకర్తలు నాయకత్వం పైన తిరుగుబాటు చేయక తప్పదు. అప్పుడు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కనుక ఇచ్చిన హామీ మేరకు డి. ఎ. లు పేమెంట్ చేయడంతో పాటు వేతన స్థిరీకరణను అమలు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉంటుంది. అలాగే సిపిఎస్ రద్దు చేయడంతో పాటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలను నిలిపివేసి వేతన స్కేలు చెల్లించే విధంగా అమలు చేస్తేనే ప్రభుత్వానికి వచ్చే టర్మ్ లో అవకాశం ఉంటుంది. లేకపోతే ఆశ చాలించుకోవలసిందేననే మాట సర్వత్రా వినబడుతున్న నేపథ్యంలో ఉద్యోగుల ఉసురు ప్రమాదకరమని ఏ ప్రభుత్వమైనా తెలుసుకుంటే మంచిది. సుమారుగా 240 మంది వరకు ఉద్యోగులు పెన్షనర్లు రావలసిన బకాయిల కోసం ప్రభుత్వం మీద నిరాశతో తనువులు చాలించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే గుండె తరుక్కుపోతుంది కానీ ప్రభుత్వాల యొక్క మొండితనం మాత్రం తగ్గడం లేదు. ఆ మొండితనానికి తగిన మూల్యం చెల్లించుకోకముందే తన చిత్తశుద్ధిని రుజువు చేసుకుంటే మంచిది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)