పత్రికా రంగాన్ని కాపాడుకుందాం

Oct 1, 2026 - 08:25
 0  0

పాలకులు మరిచినా మీడియా పరిరక్షణ ప్రజల బాధ్యతే.

ప్రత్యక్షంగా పరోక్షంగా  సద్వినియోగం చేసుకుంటే అక్రమార్కుల గుట్టు రట్టవుతుంది.

 కొంతైనా ప్రజలకు మేలు జరుగుతుంది.

--వడ్డేపల్లి మల్లేశం 

స్వేచ్ఛ లేని బతుకు చీ డరా పీడ రా  నవయుగాల బాట నార్ల మాట అంటూ  పత్రికా రంగానికి కాదు ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ ఉండాలని కోరుకున్న పత్రిక సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు.  స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేకుంటే ఆ బ్రతుకు బతికే కాదని  నొక్కి చెప్పిన తీరు మనలో  రోషం పౌరుషం  భావాదేశాన్ని  పెంచితే అంతే చాలు.  మానవ హక్కులకు లోబడి  ప్రజాస్వామ్య  పునాది నేపథ్యంగా  ప్రజలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలను కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది.  పాలకులు మర్చిపోకుండా ఉండడానికి రాజ్యాంగ ప్రవేశికలో  అత్యంత జాగ్రత్తగా ఈ మాట పొందుపరిచినప్పటికీ  కొందరు అధికారులు పాలకులు    ప్రజా ప్రతినిధుల అతి ఉత్సాహము కారణంగా  సామాన్య ప్రజల స్వేచ్ఛ అడుగంటి పోతున్నది. స్వేచ్ఛకు నిర్వచనం  స్వాతంత్రానికి  భీజం అయినటువంటి మీడియా పత్రిక రంగాలు  తమ ఉనికియే ప్రశ్నార్థకమైన పరిస్థితులలో  తమను రక్షించాలని  ప్రజలకు అప్పీలు చేస్తున్నాయంటే  ఈ దేశంలో ఏ రకంగా పాలకులు అణ చివేతకు పాల్పడుతున్నారో   లోపాలను విప్పి చెబితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.  ఇది కేవలం మీడియాకు ప్రభుత్వాలకు సంబంధించిన అంశం అని మనం నోరు మూసుకుంటే,  స్తబ్దంగా  తల ఊపితే  అంతో ఇంతో అనుభవిస్తున్న ఈ పాటి స్వేచ్ఛ  ప్రజలకు పత్రికలకు  లేకుండా పోతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసు కదా  అడిగినా చెప్పేవాడు,  ఏడ్చినా ఓదార్చేవాడు  ఉండని  దుస్థితి ఈ దేశంలో నెలకొంటుంది. కానీ పేరుకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని  ప్రచారంలో కొనసాగుతుంది ఇది మీకు ఇష్టమేనా?
       ప్రజల హక్కులను రక్షించడంలో,  ఇబ్బందుల అధిగమించడంలో,  స్వేచ్ఛ స్వతంత్ర తను అనుభవించడంలో,  తమ డిమాండ్లను స్పష్టంగా ప్రభుత్వం ముందు పెట్టడానికి సిద్ధం చేయడంలో  పత్రికా రంగం మీడియాదే ప్రధాన పాత్ర. కనుకనే అనేక  రుగ్మతలు  దోపిడీలు హత్యలు అత్యాచారాలు ఇవాళ ప్రజల దృష్టికి రావడం  జరుగుతుంది.  దానిపైన విభిన్న వర్గాలు స్పందించడానికి, చట్టాలు న్యాయ వ్యవస్థ  ఆలోచించడానికి, ప్రజలను కార్యో్నముఖులను చేయడానికి  పత్రికలు మీడియానే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని మనం గుర్తిస్తే తప్ప  మన ఉనికి ప్రశ్నార్థం కాక తప్పదు.  అంటే పత్రికలు మీడియాకు మద్దతుగా ప్రజలు నిరంతరం జాగరుకులై బాధ్యతతో వ్యవహరించవలసి ఉంటుంది.  అనేక సందర్భాలలో ప్రధాని ముఖ్యమంత్రి రాష్ట్రపతులు మంత్రులు కూడా  మీడియా పత్రికలు ప్రజల పక్షాన పాత్ర పోషించాలని,  మీడియాకు స్వేచ్ఛ ఉండాల్సిందేనని  తీపి మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఆచరణలో  ఉక్కు పాదం మోపిన సంఘటనలు అనేకం. ఎందరో పత్రికారంగా నిపుణులు, సంపాదకులు, జర్నలిస్టులు  నాటి నుండి నేటి వరకు తమ ప్రాణాలను బలి పెట్టవలసి వచ్చింది  నిగ్గదీసి అడిగినందుకు,  తమ బండారం బయటపడుతుందనే నెపంతో  కర్కోటకులుగా మారిన  వ్యవస్థ మనది. పెట్టుబడిదారులు, భూస్వాములు,  ప్రభుత్వ అనుకూల వర్గాలు, భూ డ్రగ్స్ మాఫియా, ఎవరైతే నేమి  ఈ దుశ్చర్యలకు పాల్పడుతూ  బలి తీసుకుంటూనే  ఉన్నారు.

 మీడియా హక్కులను పరిరక్షించాలి 

మీడియా పరిరక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఆచరణలో ముఖ్యంగా గ్రామస్థాయిలో నుండి పనిచేస్తున్న వాళ్లు, పట్టణాల్లో కూడా  అనేక ఇబ్బందులకు గురికావడం  ప్రభుత్వాలకు అనుకూలంగా రాయకపోతే నిర్బంధాలు ఎదుర్కోవడం  వాస్తవాన్ని ప్రశ్నించినందుకు మూగజీవులుగా మారడం  మనం గమనిస్తూనే ఉన్నాం.  ఒకవైపు వృత్తి ఖర్చుతో కూడుకొని  పక్కా ఆదాయం లేకుండా  బాధ్యతాయుతంగా లేదా ఆత్మస్థైర్యం  గౌరవంతో పనిచేస్తున్నటువంటి గ్రామీణ ప్రాంత పట్టణ జర్నలిస్టులు  వృత్తికి అంకితమైన వాళ్ళు మాత్రం ఇప్పటికీ అప్పుల్లో కోరుకు పోయిండ్రు అనే మాట నగ్నసత్యం.  పత్రికలు మీడియా యాజమాన్యాలు ఇస్తున్నటువంటి నామమాత్రపు వేతనం ఏ మూలకు సరిపోక  ఈ రంగాలలో పనిచేసి ప్రజల పక్షాన గొంతు విప్పాలనే ఆశయాన్ని చంపుకోలేక  సంఘటనలు, ధర్నా ప్రాంతానికి వెళ్లడానికి ఖర్చులతో కూడుకున్నప్పటికీ  అందుకు ప్రభుత్వ సహకారం లేకపోయినా  వాస్తవాలను వెలికి  తీయడంలో  జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర ఎనలేనిది.  వాళ్లకు  అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని  ఉచిత బస్సు సౌకర్యము ఉచిత గృహ నిర్మాణము  ఇతర సౌకర్యాలను కల్పించాలని  డిమాండ్ చేయడంలో ఏమాత్రం  తప్పులేదు. కానీ  పాలకులు ప్రజల మధ్యన  ప్రభుత్వాలు ఆచరిస్తున్నటువంటి కార్యక్రమాలు లేదా  పథకాలు ప్రజలకు ఏ మూలకు చేరుతున్నాయి? ఎంతవరకు అమల్లో ఉన్నాయి? అని తెలుసుకోవడానికి అటు పాలకులకు ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి మీడియా ప్రాధాన్యతను మాత్రం పాలకులు గుర్తించడం లేదు. ప్రజలు కూడా  చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఈ పరిస్థితుల్లో చిన్న స్థాయిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు మీడియా మిత్రులు  పడుతున్న బాధ, వెలుబుచ్చు తున్న ఆవేదన,  భరిస్తున్న అవమానాలు,  మరింత బాధ్యతాయుతంగా వ్య వహ రించిన వారి పైన పాలకుల చర్యలు  వారిని గందరగోళానికి గురిచేస్తున్నాయి.  అనేక సందర్భాలలో తమ హక్కులను కాపాడాలని,  జర్నలిస్టులుగా గుర్తింపు ఇవ్వడంతో పాటు సౌకర్యాలను  కల్పించాలని,  పోలీసులు పాలకుల నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న సందర్భాలు మనం అనేకం పత్రికల్లో చూస్తూనే ఉన్నాం.

 అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రులు,

తాము వెలిబుచ్చే అభిప్రాయాలను ప్రస్తావించిన కార్యక్రమాలను కవర్ చేయడానికి పిలిచిన స్థాయిలో వారి గురించి పట్టించుకోవడం  లేదు.  "పత్రి కొ క్కటున్న పదివేల సైన్యంబు  పత్రిక ఒక్కటి ఉన్న మిత్ర కోటి  పత్రిక లేకున్నా ప్రజలకు రక్షణ లేదు " అంటూ నార్ల వెంకటేశ్వరరావు గారు  పత్రికా ప్రాధాన్యతను ఎంత వెలిబుచ్చిన  పాలకులు మాత్రం ఇప్పటికీ  గుర్తించిన దాఖలా లేదు అవసరాను గుణంగా తమ స్వార్థానికి వాడుకోవడం తప్ప.

చట్టబద్ధమైన చర్యలు తప్పనిసరి

జర్నలిస్టులు పత్రికా ప్రతినిధులు  తమ విధి నిర్వహణలో భాగంగా కేవలం వార్తల సేకరణకే కాకుండా పరిశోధనా త్మకమైనటువంటి సంఘటనలు సన్నివేశాల పైన దృష్టి సారించినప్పుడు  కొంత లోతుగా అధ్యయనం చేసి వాస్తవాలను వెలికి తీసినందుకు  ఒక్కసారి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో  అడ్డుకోవడానికి అణచివేయడానికి అవసరమైతే ఎంతకైనా దిగజారుతున్న సందర్భాలను మనం గమనిస్తే సామాజిక బాధ్యతల్లో వున్న  జర్నలిస్టు మిత్రులు ఇంత శిక్ష ఎందుకు అనుభవించాలి? ఒక్కసారి సమాజం ఆలోచించకపోతే ఎలా?  సామాజిక బాధ్యతగా  మేధావులు, బుద్ధి జీవులు విద్యావంతులు  మీడియా గురించి ఆలోచించి ప్రభుత్వాల యొక్క దుందు డు కు చర్యలను కూడా సందర్భం గా ప్రశ్నిస్తేనే పాలకులు  అనుగుణంగా వ్యవహరిస్తారు. అందుకే   చట్టపరమైనటువంటి రక్షణ కల్పించడానికి గాను ప్రస్తుతం ఉన్న చట్టాలను   తగిన మార్పులు చేయడానికి పాలకులు ఆలోచించాలి. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అనేక చోట్ల జర్నలిస్టులు ధర్నాలు పికే టింగులు రాస్తారోకోలు  చేసి తమ హక్కుల కోసం డిమాండ్ల కోసం  పోరుబాట పట్టినప్పటికీ  రాజకీయ పార్టీలు కూడా అంటీ ముట్టినట్లు వ్యవహరించడం అంటే అధికార ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా పార్టీలన్నీ కూడా  ఒకే తానులోని ముక్కలని  గుర్తించవలసి ఉన్నది.  ఈ దేశంలో పోరాటం ఉద్యమం  ప్రజా ప్రతిఘటన లేకుండా ఏ డిమాండ్లు కూడా  పరిష్కరించుకున్న దాఖలా లేదు. కానీ  ప్రజా పోరాటాలను అణిచివేయడమే తమ బాధ్యత పాలనగా భావించే పాలకుల కు  సమైక్య ఉద్యమాల ద్వారా  చురుకు పుట్టించాల్సిన అవసరం కూడా ఉంది.  మీడియా లేకుంటే జరిగింది ఏమిటి జరిగేది ఏమిటి జరగనున్నది ఏమిటి అనేది ఏ మాత్రం కూడా ప్రజలకు తెలియదు. పాలకుల గురించి ఇసుమంత కూడా  సమాచారం అందదు.  ప్రజాస్వామ్యంలో ప్రచారం  సమాచారం అత్యంత కీలకము కనుక ప్రజాస్వామ్యం  విజయవంతం కావాలంటే అందుకు ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి నాలుగవ స్తంభమైనటువంటి పత్రిక మీడియా రంగం పట్ల  ప్రభుత్వాలు బాధ్యతగా ప్రజలు సామాజిక  మద్దతు దారులుగా కొనసాగినప్పుడు మాత్రమే  విజయవంతం అవుతుంది.  భయం గుప్పెట్లో ప్రతిక్షణం పనిచేయడం  జర్నలిస్టులకు  అవసరమా?  అట్లని బాధ్యతను  వదిలిపెడితే ఎలా? ఇది నిజంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సందిగ్ధ పరిస్థితి.  అనేక సందర్భాలలో జర్నలిస్టులను హింసించి  జైలు పాలు చేసి  అంతం చేసిన సందర్భాలు ఎన్నో.  పత్రికా స్వేచ్ఛ లో ప్రపంచంలోనే భారతదేశం చాలా వెనుకబడి ఉన్న మాట కూడా వాస్తవం .ఈ అప్రతిష్ట నుండి బయటపడి  ప్రజాస్వామ్యానికి గుర్తుగా  జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛను  అమలు చేస్తున్న ప్రభుత్వంగా మిగిలి పోవాలంటే భారతదేశంలో పాలకులు తమ నియంతృ త్వాన్ని నిరంకుశత్వాన్ని వదిలి పెట్టాల్సిందే. వాళ్ల హక్కులను గౌరవించాల్సిందే. వాళ్లకోసం మద్దతుగా పోరాడుతున్న ప్రజా ఉద్యమాలను  సహృదయంగా స్వీకరించవలసిందే.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333