సామాన్య ప్రజలకు బాసటగా ఉపాధ్యాయులు నిలవాలి.

Oct 1, 2026 - 08:19
 0  0

వృత్తి నిబద్ధతతో పాటు సామాజిక బాధ్యత అంటే అదే!*  టీచర్స్ డే వేళ  ప్రభుత్వాన్ని ఆలోచింపచేసేలా ప్రతిన బూనాలి.

--- వడ్డేపల్లి మల్లేశం

అనాదిగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు  తమ జీవితాన్ని సర్వస్వం ధారబోసి  భవిష్యత్తు తరాలకు బాటలు వేసిన మహనీయులు అంతా కూడా  బాగా చదువుకున్న వాళ్ళు ఏమీ కాదు. కొందరు విద్యావంతులు మరికొందరు ఆలోచనపరులు  ఇంకొందరు సామాజిక బాధ్యతను  గుర్తించిన వాళ్ళు  కొందరు తమ జీవితాన్ని  కొనసాగిస్తూనే సమాజం గూర్చి పట్టించుకుంటే  మరికొందరు తమ జీవితాన్ని మరిచి  సమాజం కోసమే అవతరించిన వాళ్ళుగా  చరిత్రలో నిలిచిపోయారు.  అలాంటి కథనాలను  నేటితరం జ్ఞప్తికి చేసుకోవడం ద్వారా  తమ సామాజిక బాధ్యతను కొంతైనా నిర్వర్తించేలా  కృషి చేసి ప్రోత్సహించవలసిన బాధ్యత నేటి ఉపాధ్యాయ లోకం పైన ఎక్కువగా ఉన్నది.  ప్రజలను ఆలోచనపరులను బుద్ధి జీవులను  విద్యావంతులను ఆలోచింప చేయాలంటే  సామాజిక బాధ్యత తమ కర్తవ్యం అని భావించి నినదించే ఉపాధ్యాయ లోకం ముందు  తమ ఆచరణలో  వృత్తి నిబద్ధతకు కట్టుబడి  సామాజిక బాధ్యతను కొంతైనా  నిర్వర్తించే  వాళ్లు మాత్రమే  సమాజాన్ని తట్టి లేపగలరు.  అంతటి ప్రేరణ అందించే  వాళ్లుగా ఉపాధ్యాయులు  తొలి వరుసలో నిలబడాలి. అప్పుడే వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యత అని  ప్రకటించుకున్న ఉపాధ్యాయ లోకం  మాటలకే కాదు చేతలకు కూడా  ముందున్నది అని సమాజం అంగీకరిస్తుంది. .ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా అంతర్గతంగా కూడా  సామాజికపరమైన అంశాలు  చోటు చేసుకోగా  సామాజికపరమైన అంశాల పైన పోరాటాలు నిర్వహించడం ద్వారా ప్రజలను కదిలించడం ద్వారా  ఉద్యమాల ఉపాధ్యాయులుగా  చరిత్రలో చోటు సాధించాలి.  ముఖ్యంగా ఉమ్మడి   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తొలి నాళ్లలో ఏర్పడినటువంటి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు  ఆ భావనకు కట్టుబడిన సందర్భం మన గుర్తుండే ఉంటుంది.  ఇక ఆ తర్వాత ఏర్పడినటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా సామాజిక బాధ్యతను తమ కర్తవ్యం అని ప్రకటించిన సందర్భం మనకు తెలుసు. అయితే ఆచరణలో వృత్తికి మాత్రమే  పరిమితమైతే సామాజిక సంస్కరణ  సాధ్యం కావడం లేదు కనుక  ఉద్యమాల ఉపాధ్యాయులుగా తమ హక్కులను  సాధించుకోవడంతోపాటు ప్రజల సమస్యల పరిష్కారం లోనూ  తమ భుజాలను నిలపాల్సిన  అనివార్య పరిస్థితులు ఉన్నాయి. ప్రజల కష్టాన్ని  చెమట చుక్కలను  వేతన రూపంలో పొందుతున్నటువంటి ఉపాధ్యాయ లోకం  ప్రజలకు రుణపడి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అదే సందర్భంలో  నేటి తరాన్ని రేపటి అవసరాలకు తీర్చిదిద్ది క్రమంలో  అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది.  వేగవంతమైన జీవితంలో  స్వార్థం, నిర్లక్ష్యం  చోటు చేసుకునే ప్రమాదం లేకపోలేదు. వాటిని అధిగమించడం ద్వారా  ఆదర్శంగా నిలబడి  సమాజంలో తమ ఉనికిని చాటుకోవాలి  అందుకు ప్రతిన బూ నడమే ఉపాధ్యాయుల ముందున్న  ఏకైక మార్గం కూడా.

ఉద్యమాల ఉపాధ్యాయులుగా మారాలి

ప్రజల సమస్యలు పరిష్కారం కావడం ద్వారా   ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని సామాజిక శాస్త్రీయ అవగాహనతో  ఉపాధ్యాయ లోకం గత కొన్ని దశాబ్దాలుగా  సామాజిక రంగంలో పోటీపడుతున్న విషయం మనకు తెలుసు.  ప్రజల సమస్యలకు మద్దతు ఇవ్వడం ద్వారా  ఎదుర్కొంటున్న వృత్తిపరమైన ఇతర సమస్యలను పరిష్కరించుకోవడంలో ప్రజల మద్దతును  సంపాదించే ఒక సంస్కారవంతమైనటువంటి సంబంధాన్ని  నిర్మించడం కొనసాగించడం  ఫలితాలను సాధించడం కూడా ఉపాధ్యాయ లోకం లక్ష్యం కావాలి.  తమ హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న సందర్భాలలో  రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు కూడా మద్దతు పలకడాన్ని మనం గమనించవచ్చు.
 మరికొన్ని సందర్భాలలో ఉద్యోగులు ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండానే వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వాల యొక్క అ లక్ష్యం పైన  ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మద్దతు ప్రకటించిన సందర్భాలను కూడా మనం గమనిస్తే  సమాజం నుండి ఉపాధ్యాయ లోకం వేరుపడే అవకాశం లేదు.  భిన్నత్వంలో ఏకత్వం  సాధించడo,  అన్ని వర్గాల సమస్యలను ఆకలింపు చేసుకోవడం ద్వారా  ప్రజలకు మద్దతు పలకడం ద్వారా మాత్రమే   ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి అనే శాస్త్రీయ అవగాహనతో ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకం  ఆ వైపుగా కొంత నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వాళ్లు కూడా  ఉద్యమాల ఉపాధ్యాయులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది .అధిక ధరలు,  నిరుద్యోగం,  పేదరికం, అసమానతలు అంతరాలు, అణచివేత, కుల మత వివక్షత, ప్రైవేటీకరణ వల్ల ఎదురవుతున్న ప్రమాదాలు  పరిణామాలను ప్రజలతో పాటు ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా అనుభవిస్తున్న విషయం మనకు తెలుసు.  ఈ సమస్యలను అధిగమించడం అంటే ప్రజలు ఉద్యోగులతో  ఐక్యం కావడం, ఉద్యోగులు ఉపాధ్యాయులు సమాజానికి కొంత సారథ్యం వహించడం,  విద్యార్థుల ద్వారా తల్లి  తండ్రులకు తమ యొక్క అవగాహనను ప్రేరణను  అందించే కృషి నిత్యం జరగాల్సిన అవసరం ఉంది.  తమ బోధనలో భాగంగా ఉపాధ్యాయులు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని విశ్లేషణను విద్యార్థులకు అందించడం ద్వారా  సమాజాన్ని పాఠశాలలోకి పాఠశాలను సమాజంలోకి తీసుకు వెళ్ళగలిగిన ఏకైక  నిపుణుడు ఉద్యమకారుడు ఉపాధ్యాయుడే అవుతాడు అనే విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు దానికి ప్రత్యామ్నాయం కూడా లేదు.  "వ్యక్తిలోని శారీరక మానసిక శక్తులను  ఆలోచన ధోరణి  సామాజిక బాధ్యతలను బయటకు తీయడంలో ఉపాధ్యాయుడు  తన బోధన ద్వారా  కృషి చేస్తున్నారు.  తద్వారా వ్యక్తిత్వ వికాసం, నిర్మాణం అనేది సాధ్యమవుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ" కేవలం బోధన ద్వారానే కాకుండా సమాజం నుండి, సమవయస్కుల నుండి, నిత్యజీవితంలోని అనుభవాల ద్వారా కూడా విద్యార్థులు  పరిణతి  సాధించడంతోపాటు  సంఘజీవులుగా మారుతారు. అందుకే మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ హెచ్చరించిన అంశం  బుద్ధి జీవులు సామాన్యులు అక్షరాసులు నిరక్షరాశులు సమాజం మొత్తాన్ని కూడా  ఆలోచింప చేసేదిగా ఉంది.ఆ మాటను  సంఘజీవి అనే వాస్తవాన్ని గుర్తించకుండా మౌనంగా  తమకేమీ సంబంధం లేనట్లుగా బాధ్యతా రాహిత్యంగా  జీవిస్తున్న   వాళ్లను కదిలించవలసినటువంటి బాధ్యత  యువత, మీడియా పత్రికలు, ప్రసారమాధ్యమాలతో పాటు ఉపాధ్యాయుల పైన ఎక్కువగా ఉన్నది అని గుర్తిస్తేనే  మనం నినదిస్తున్న వృత్తినిబద్దత సామాజిక బాధ్యత అనేదానికి అర్థం ఉంటుంది.  ఉపాధ్యాయ లోకానికి సంబంధించిన బాధ్యతలు  హక్కులు కర్తవ్యాలు  బోధనలో  చూపాల్సినటువంటి చొరవ  కేవలం శిక్షణ ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది కాదు.  తనను తాను ఆకలింపు చేసుకోవడం  సమాజాన్ని అధ్యయనం చేయడం ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి మహనీయుల గురించి  తెలుసుకోవడంతో పాటు ప్రతి అనుభవం కూడా  మానవ జీవితానికి  తోడ్పడేలా మలుచుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.అందుకే ఉపాధ్యాయులు అంటే  సామాజిక శిల్పులు అని గుర్తించుకోవాలి ఒకరిస్తే వచ్చేది గౌరవం కాదు.   సామాజిక బాధ్యతగా చొరవతో పనిచేయడం ద్వారా వృత్తికి  వన్నె తేవడం ఉపాధ్యాయుల యొక్క ప్రాథమిక కర్తవ్యం. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అనేక సర్వేలలో  ఉపాధ్యాయులు తొలి స్థానంలో నిలిచినట్లు    నివేదికలు వెల్లడిస్తున్నాయి.  అందుకే ఏ రంగానికి లేనటువంటి గౌరవము, మర్యాద, ఆకలింపు,  సమన్వయము  ఉపాధ్యాయులతో సమాజానికి ఉంది.  దాన్ని కొనసాగించడం శాశ్వతం చేసుకోవడం సార్థకం చేసుకోవడం  ప్రజల కంటే ఎక్కువగా ఉపాధ్యాయుల పైననే  ఉంటుంది. "తమ చుట్టూ  గిరి గీ సుకునే వాళ్ళు,  సమాజం పట్ల ఆసక్తి లేనివాళ్లు,  సమాజాన్ని అసహ్యించుకునే వాళ్ళు,  బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వాళ్ళు ఇన్ని రకాలుగా ఉన్న ప్రజలతో  మమేకమయ్యే వాళ్లే ఉపాధ్యాయులు." భారతదేశంలో  మాజీ  రాష్ట్రపతి  సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా  ప్రతి ఏటా నిర్వహించుకునే సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం  ఒక అంశం అయితే  ప్రజలతో మమేకమై పదవులు లేకుండా స్వచ్ఛందంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో పాల్గొన్న  పూలే దంపతులు  వారి సేవను గుర్తించడం ద్వారా
మరింత స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉంటుంది.  పదవులు అనుభవించకుండా స్వచ్ఛందంగా పాఠశాలలను  నిర్మించడంతోపాటు తామే చదువుకొని  చదువు రాని వాళ్లకు చదువు చెప్పడం ద్వారా ఎన్నో అవమానాలను ఎదుర్కొని  చైతన్యం చేసిన మహనీయులుగా చరిత్రలో నిలిచిన విషయం మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. వారిని  సామాజికపరమైన అంశాలకు కూడా పోరాట స్ఫూర్తిని రంగరించి  తమ బాధ్యత నిర్వహించిన పూలే దంపతుల ఆశయాన్ని ఆకాంక్షలను  ఉపాధ్యాయులుగా మనం నిండు మనసుతో గుర్తించి ఆదరిస్తేనే  సమాజంలో ఉపాధ్యాయులకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ఉపాధ్యాయులు అంటే గొప్ప వాళ్ళు అని రాజకీయ నాయకులు  ప్రజా ప్రతినిధులు అంటే సరిపోదు.  బాధ్యతను గుర్తించి  సమాజాన్ని ప్రభావితం చేసే ఉపాధ్యాయులుగా చరిత్రలో స్థానం సంపాదించుకోవడం అవసరం.  మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గారు అన్నట్లు  చరిత్రను అధ్యయనం చేయడంతో పాటు ప్రతి వ్యక్తి తనకంటూ ఓ చరిత్రను నిర్మించుకోవాలి  అని చేసిన సూచన  ప్రతి ఉపాధ్యాయుడికి తప్పక వర్తిస్తుంది..  వైద్యులు తమను తాము రక్షించుకుంటూ ప్రజల యొక్క  అనారోగ్య సమస్యలను పరిష్కరించినట్లు  ఉపాధ్యాయ లోకం తమ కుటుంబాన్ని వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొంటూనే ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ప్రజల సమస్యలకు మద్దతు ఇవ్వడం ద్వారా  సామాజిక వైద్యులుగా గుర్తింపు తెచ్చుకుంటే అంతే చాలు. ఉపాధ్యాయ దినోత్సవం అంటే సభలు సమావేశాలు పురస్కారాలతోనే ముడి పెట్టకుండా  వృత్తిలోని ప్రాశస్త్యాన్ని  గుర్తించడం ఆచరించడం ప్రభావితం చేయడం  సమయాన్ని కేటాయించి  సార్థకం చేసుకోవడం ద్వారా తమ కుటుంబం కంటే మిన్నగా సమాజాన్ని ప్రేమించే ప్రతి ఉపాధ్యాయుడు కూడా  చరిత్రలో ఉద్యమాల ఉపాధ్యాయుడిగా మిగిలిపోతాడు.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333