పాలకులు ఎప్పుడూ స్వార్థపరులే, మెజారిటీ ప్రజలకు ద్రోహం చేసేవాళ్లే

అసమానతలు అంతరాలు ఇoదుకు ప్రభల సాక్ష్యాలు .
మేనిఫెస్టో పేరుతో వాగ్దానాలు కుమ్మరిస్తారు, ఆచరణలో పెత్తందారీ వర్గానికి కొమ్ముకాస్తారు .
ఓటర్ల విజ్ఞతే దేశ భవిష్యత్తుకు రక్ష. భావితరాల కోసం ప్రతినబూనాలి.
-- వడ్డేపల్లి మల్లేశం
ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నామని చెప్పుకోవడమే కానీ పాలకుల యొక్క దశాబ్దాల తప్పిదం కారణంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం గాడి తప్పి నిరంకుశ విధానములోకి వెళ్లిపోయింది అని చెప్పడానికి బోలెడు సాక్ష్యాలు లక్షలాది ఆనవాళ్లను మనం చవిచూస్తూనే ఉన్నాము. పేద దళిత అట్టడుగు ఆదివాసి వర్గాలపైన భిన్న కోణాలలో దాడులు, అత్యాచారాలు, అరాచకాలు, అకృత్యాలు, హింస ఏదో రూపంలో నిరంతరం కొనసాగుతూనే ఉంటే పాలక పక్షం మెజారిటీ మైనారిటీ పేరుతో ప్రజలను విడదీసి మెజారిటీ ప్రజల ఓట్లను పొందడానికి చేస్తున్న కుట్ర ఈ దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో సాగుతుంటే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేకుండా బానిసలుగా బ్రతుకుతున్న అశేష పేద ప్రజానీకం ఈ పాలనను ప్రజాస్వామిక ప్రభుత్వమని ఎలా అంగీకరిస్తుంది? అందుకే అది నిరంకుశత్వం అని చెప్పక తప్పదు. స్వాతంత్ర్య అనంతర కాలంలో కొంత ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా విలువలు, ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం వంటి కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ 1980 ఆ తర్వాత కాలం లో రాజకీయ రంగం ఊసరవెల్లి లాగా తన రంగులను మార్చుకున్నతీరు అక్షేపణీయం. సామాన్య ప్రజానీకానికి రక్షణ లేని దుస్థితి దాపురించినా గత పది ఏళ్లలో గనుక పరిశీలించినట్లయితే ప్రశ్నించిన వాళ్ల మీద కేసులు , ప్రతిపక్షాల పైన ఈ డి సి బి ఐ దాడులు, ప్రతిపక్షాలకు చెందినటువంటి అకౌంట్లను సీజ్ చేయడం,
ప్రశ్నించిన వాళ్లను ఉగ్రవాదులనే పేరుతో నిర్బంధించడమే కాకుండా ప్రజాస్వామిక వాదులు మేధావులను దశాబ్దాలుగా విచారణ ఖైదీల పేరుతో జైల్లో వేసి నిర్బంధించడాన్నీ గమనించినప్పుడు నిరంకుశత్వం తారాస్థాయికి చేరిన విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల సుమారు 10 సంవత్సరాలు అకారణంగా జైలు శిక్షణ అనుభవించి 90 శాతం అంగవైకల్యంతో ఉన్నటువంటి prof జీ ఏ న్ సాయిబాబాను చివరికి కోర్టు సుమారు 10 ఏళ్ల తర్వాత నిర్దోషి అని ప్రకటించిన తీరు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ డొల్లతనాన్ని పరిపాలకుల యొక్క అక్రమ నిర్బంధ విధానాలకు పరాకాష్టగా భావించవలసి ఉన్నది. కొన్ని గణాంకాల ప్రకారం గత 1oఏళ్ల లో భారతదేశంలోని 21 పార్టీల పైన 114 ఈడీ కేసులు నమోదైతే 118 కేసులు 17 పార్టీల పైన సిబిఐ నమోదు చేసినట్లుగా తెలుస్తున్నది. ఇవన్నీ కూడా అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్షాలసు చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి పావుగా ఉపయోగించినటువంటి కేసులేనని 95 శాతం కేసులు నిలువ లేదని కేవలం ఐదు శాతం కేసులు మాత్రమే నిలబడినట్లు తెలుస్తుంటే ఈ దేశంలో అధికార ప్రభుత్వం ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చని తెలుస్తున్నది.
ఈ అంశాలు ప్రముఖ రాజనీతి సామాజిక రాజకీయ విశ్లేషకులు అందిస్తున్న గణాంకాల ఆధారంగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిశీలించినప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యం గాడి తప్పినట్లు ప్రమాదంలో పడినట్లు తెలుస్తుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అయినా ఓటర్లు తమ విజ్ఞత ప్రదర్శించి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని చేస్తున్న హెచ్చరికను మన భావితరాల రక్షణ కోసం బాధ్యతగా తీసుకోవలసిన అనివార్య పరిస్థితులు ఏర్పడినవి. గత పది ఏళ్లలో మీడియా సమావేశాలను ప్రభుత్వం నిర్వహించలేదని, ప్రశ్నించే సత్తా ఉన్న మీడియా ఛానలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, తద్వారా ప్రశ్నించే వాళ్ళు లేకుండా నిర్వీర్యం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని అనేకమంది నిపుణులు అభిప్రాయపడుతూ ఉంటే స్వాతంత్రం కోసం పోరాడిన కాలంలో మన లక్ష్యం ఇదేనా? ఇందుకోసమేనా స్వాతంత్రాన్ని ఆంగ్లేయుల నుండి సాధించినది అని అనుమానం రాక మానదు .
పేరుకే ప్రజాస్వామ్య దేశం
97 కోట్ల మంది ఓటర్లు 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు 55 లక్షల ఓటింగ్ యంత్రాల ద్వారా కోటిన్నర మంది సిబ్బంది సహాయంతో ఏప్రిల్ మే మాసాలలో 44 రోజుల పాటు సుదీర్ఘంగా నిర్వహించబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రజాస్వామ్య దేశానికి పెద్ద ఆడంబరంగా చెప్పుకున్నప్పటికీ రాష్ట్రాలలో కేంద్రంలోనూ రాజకీయ పార్టీల యొక్క అక్రమాలు అకృత్యాలు, అనుకూలంగా ఓట్ల జాబితాల ప్రక్షాళన వంటి దుందుడు కు చర్యలు ఇప్పటికీ ఇతర రాజకీయ పార్టీలను కలవర పెడుతూనే ఉన్నాయి . రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం, సభలు సమావేశాలకు రాలేదని ప్రతిపక్షాలు చెందిన కార్యకర్తలను హింసించడం హత్య చేయడం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అక్కడక్కడ మామూలు అయిపోయినది. ప్రజాస్వామ్య దేశంలో చైతన్యవంతులైన యజమానులుగా ప్రజలను చూడవలసినటువంటి పాలకులు మూగజీవులుగా బానిసలుగా జమ కట్టి ప్రలోభాలు వాగ్దానాలు తాయిలాల పేరుతో పరిపాలించాలని చూడడం ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏమి కావాలి?. 16 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం పెత్తందారీ వర్గాలకు మాఫీ చేసిన పరిస్థితులే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న మన దేశానికి చెందిన పెట్టుబడిదారుల నల్ల డబ్బును ప్రజల ఖాతాల్లో జమ చేస్తానని ఇచ్చిన హామీ పదేళ్లుగా మూగబోయింది. ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు,
పేదరిక నిర్మూలన , దారిద్ర రేఖ దిగున గల వారిని పైకి తీసుకురావడం, వలస కార్మికుల యొక్క విముక్తి, చిరు వ్యాపారులు పేద కార్మికుల యొక్క అల్పాదాయ పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు ఏవి చేపట్టకపోగా ఈ దేశ సంపద కొద్ది మంది చేతుల్లోనే జమ కావడం పాలకులకు పెను సవాళ్లు . ఇటీవల అంతర్జాతీయ సంస్థ ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో 40% సంపద పోగు పడినట్లు చేసిన సర్వే రిపోర్టు పాలకుల యొక్క పెత్తందారీ వర్గాలకు చాకిరీ చేసే విధానానికి సాక్ష్యం కాక మరేమిటి?
ప్రస్తుతం కొనసాగుతున్న 17వ పార్లమెంటు సంబంధించి లోక్సభలో 83% రాజ్యసభలో 36% మంది నేర చరిత్ర కలిగిన వాళ్లు సభ్యులుగా కొనసాగుతుంటే ఇది ప్రజాసామిక దేశం ఎలా అవుతుంది?. ప్రజాస్వామ్య రక్షణ కోసం సమానత్వ సాధన కోసం పనిచేయాల్సినటువంటి భారత రాజ్యాంగం తన లక్ష సాధనలో విఫలమైతే దానిని ముందుగా తగలబెట్టడానికి నేనే సిద్ధంగా ఉంటానని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ హెచ్చరించిన తీరు పట్ల సోయి లేని ప్రభుత్వాలు పెత్తందారీ వర్గాలకు వంత పాడుతూ ఉంటే సంపద కొద్ది మంది చేతుల్లో పోగు పడక మరేమవుతుంది? అందుకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి బలహీనపరిచి పనికిరాదని చెప్పే ప్రయత్నంలో భాగంగా తమకు అనుకూలమైన రాజ్యాంగాన్ని తెచ్చుకోవడానికి పదేపదే రాజ్యాంగాన్ని మార్చుతామని అధికార ప్రభుత్వం ప్రకటించడం అంటే ప్రస్తుత రాజ్యాంగాన్ని అవమానించడమే కదా!
అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంతో పాటు నిరంకుశత్వాన్ని కొని తెచ్చుకోవడమే ఈ అంశాల పట్ల ప్రజలు జాగరుకులై రాబోయే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష ఇండియా కూటమి మేనిఫెస్టోలో వాగ్దానాలు చర్యలు ప్రజా స్వామిక ప్రకటనల పట్ల జాగరూకతతో వ్యవహరించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. 17వ లోక్సభలో 221 బిల్లులను ఆమోదిస్తే 35 శాతం బిల్లులను మూడు గంటల లోపు చర్చ లేకుండానే ఆమోదించినట్టు తెలుస్తూ ఉంటే చర్చ నామ మాత్రమైనప్పుడు ప్రజలకు ఒ నగూరే ప్రయోజనం ఎక్కడిది? పేదరికం అసమానతలు నిరుద్యోగిత ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు 2022లో ఆర్ ఎస్ ఎస్ హెచ్చరించిన విషయం తెలిసిందే . ఈ సందర్భంలో దేశ భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ఓటర్ల పైన ఉన్నదని ఇప్పటికైనా గుర్తించడం చారిత్రక అవసరం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )