రాష్ట్రంలో ప్రైవేటు విద్యారంగాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి
పాఠశాల స్థాయి వరకు ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి పేద వర్గాలను ప్రైవేటు ఫీజుల భా రం నుండి విముక్తి చేయాలి
ఢిల్లీ తరహాలో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడమొక ప్రత్యామ్నాయం.
--- వడ్డేపల్లి మల్లేశం
విద్యా వైద్యాన్ని సామాజిక న్యాయాన్ని పేదవర్గాలకు ఉచితంగా అందించవలసిన సామాజిక కర్తవ్యం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైదొలగుతున్న కారణంగా బడ్జెట్లలో నిధులను భారీగా తగ్గించి బాధ్యతలు నుండి తప్పుకుంటున్న తీరు రాజ్యాంగ ద్రోహం. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నట్లుగానే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా విద్యా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయడంతో పాటు కేవలం సంక్షేమ కార్యక్రమాలు, ఉచితాలు, తాయిలాలు, హామీలు, వాగ్దానాల మాటు న పరిపాలన అందిస్తున్నట్లు ప్రచారాలు చేసుకోవడం మినహా దేశ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు . దేశం వెలిగిపోతుంది, ప్రకాశిస్తున్నది, వికసిస్తున్నది అని గొప్పగా చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కూడా విద్య వైద్యానికి బడ్జెట్లో ఒకటి రెండు శాతానికి మించి కేటాయించని కారణంగా ఆ రెండు రంగాలు పూర్తిగా ప్రైవేటుపరమై ప్రజల కొనుగోలు శక్తి భారీగా నష్టపోవలసి వస్తున్నది. ఆకర్షణ పథకాల వైపు చూపిన శ్రద్ధ నిర్మాణాత్మకమైన విద్యా వైద్య రంగాల పైన చూపని కారణంగా కేరళ, ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా విద్యా ప్రైవేట్ పరం కావడాన్నీ గమనిస్తే విద్యా పరిరక్షణ పేరుతో కొనసాగుతున్న ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీ విద్యారంగాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా బడ్జెట్లో నిధులను కేటాయించడంతోపాటు నిర్మాణాత్మక కార్యాచరణ వైపు దృష్టి సారించవలసిన కర్తవ్యం తేడాతెల్లమవుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీ ముఖ్యమంత్రితో కొన్ని విషయాలలో జతకట్టినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న విద్య వైద్య రంగాల్లోని విప్లవాత్మక మార్పులను ఏనాడు కూడా ప్రస్తావించకపోవడం టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి నిదర్శనం కాక మరేమిటి .
సుమారు పదేళ్లపాటు కొనసాగిన విధ్వంసం, ఆర్థిక అరాచకత్వం, నిధుల దుర్వినియోగం, విద్యా వైద్య రంగాల పట్ల అశ్రద్ధ కారణంగా చిన్నాభిన్నమైన తెలంగాణ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యత క్రమంలో విద్యారంగానికి తొలి స్థానం కల్పించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే దారిద్రరేఖ దిగువ న గల వాళ్ళు, పేదరికంలో మగ్గుతున్న వాళ్లు , మధ్యతరగతి శ్రమజీవులు, ఎంతోమంది వాళ్ళ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోకి పంపుతున్న కారణంగా లక్షలాది రూపాయల ఫీజులను చెల్లించవలసి రావడం కొనుగోలు శక్తిని భారీగా నష్టపోవడం అల్ప ఆదాయాలతో కుటుంబాలు వీధిన పడుతున్న విషయాలను బాగా గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం .రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు సుమారు 60 లక్షలలో సగానికి పైగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తుంటే ఇక ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తున్నట్లు?
గతంలో ఉన్న ఈ గణాంకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సమీక్షించి ప్రైవేటు విద్యారంగాన్ని ప్రభుత్వం ఆధీనం చేసుకోవడానికి కృషి ప్రారంభించకపోతే విద్యా హక్కును ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడనట్లే లెక్క .ఉద్యోగులు రైతులు మహిళలు కొన్ని వర్గాల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాల యొక్క ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడంలో ముఖ్యంగా విద్యారంగ హక్కులను రక్షించే క్రమంలో తన విధానాన్ని స్పష్టం చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది . ప్రభుత్వ రంగంలో పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, ఉన్న పాఠశాలల్లో మౌలిక వస్తువులు సిబ్బంది అరకొ రగా ఉండడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల పట్ల అవిశ్వాసం కూడా ప్రైవేటీకరణకు దారి చూస్తున్నది .ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు కనీసం 17% నిధులు కేటాయిస్తే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో 6 శాతం ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మోతాదులో కేటాయించినప్పుడు ప్రభుత్వ విద్య పట్ల ప్రాధాన్యత ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా లేనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .
విప్లవాత్మక నిర్ణయాలే విద్యారంగాన్ని మార్చగలవు:-
పేదరికాన్ని నిర్మూలించడం ప్రభుత్వ లక్ష్యాలలో భాగమైనప్పుడు పేద వర్గాలు ప్రైవేటు పాఠశాలల్లోకి పంపించడం ద్వారా తమ కొనుగోలు శక్తిని నష్టపోతుంటే ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరించడం మరింత తప్పిదం కాగలదు. .అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఉచిత విద్యను అందించవలసిన ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంటే ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా పుట్టుకొస్తున్న తరుణంలో ప్రైవేటు విద్యారంగం పైన మోజు, కోరికల కారణంగా ఇతరత్రా కూడా పేద వర్గాలు సైతం ఆ పాఠశాలల్లోకి తమ పిల్లలను పంపిస్తూ అప్పుల పాలవుతూ ఉంటే ఆ కుటుంబాల బాగోగులు ప్రభుత్వానికి పట్టకపోతే ఎలా? అనేక కార్పొరేట్ పాఠశాలలో ముఖ్యంగా పట్టణాలలో హైదరాబాద్ నగరంలో ఫీజులను భారీగా వసూలు చేస్తూ ఇతరత్రా అనేక రకాల పీడి స్తుంటే పేద కుటుంబాలు నష్టపోతుంటే గత ప్రభుత్వం ఏనాడూ సమీక్ష చేయలేదు కానీ ప్రస్తుత ప్రభుత్వమైన వెంటనే సమీక్ష చేసి ప్రభుత్వ రంగంలోకి ప్రైవేటు విద్యారంగాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేయాలి. ఢిల్లీ ప్రభుత్వం తన ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇప్పించడంతోపాటు 25శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అనేక సౌకర్యాలతో హంగులతో నిర్మించిన విషయం తెలిసినదే కదా ! ఆ చర్యల కారణంగా ఢిల్లీలో ఎంతో కొంత ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న అధికారులు, సంపన్న వర్గాల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల లోకి రావడాన్నీ మనం గమనించినట్లయితే ప్రభుత్వ విద్యా రంగం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి పైన ఆధారపడి ఉంటుంది అనే విషయం రూఢి అవుతున్నది . రాజ్యాంగపరంగా అందించవలసిన విద్యా వైద్యాన్ని కూడా పేద వర్గాలకు అందించకుండా మభ్య పెట్టే ధోరణిలో చూసి చూడనట్లు వ్యవహరిస్తూ అనేక వేల కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తే ఈ దేశంలో పేదరికం ప్రభుత్వమే స్వయంగా పెంచి పోషించినట్లు కాగలదు. ఒక వ్యవస్థ మారాలనుకున్నప్పుడు చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది .
ఆ నిర్ణయం విద్యారంగముతోనే ప్రభుత్వం ప్రారంభించాలని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యా అభిమానులు డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఫీజులను తొలి దశలో భారీగా తగ్గించడంతోపాటు పేద వర్గాల పిల్లల ఫీజులను ప్రభుత్వమే భరించడంతో ప్రారంభించి క్రమంగా ఐదు సంవత్సరాల గడువు లోపల ప్రభుత్వ విద్యా రంగంలోకి ప్రైవేటు పాఠశాలలను విలీనం చేసుకోగలిగితే పేద వర్గాల ప్రయోజనాన్ని ప్రభుత్వం ఆశించినట్లు సాధించినట్లు అవుతుంది .రైతులు, కార్మికులు, చేనేత కార్మికులు, వృత్తి కళాకారులు ఏ రకంగా నైతే తమ కుటుంబ జీవితాలను గడపడం కోసం అప్పులు చేసి తీర్చలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో అలాగే ప్రైవేటు పాఠశాలల్లోకి పంపిస్తున్నటువంటి పేద కుటుంబాలు కూడా అలాంటి దౌర్భాగ్య స్థితిలోకి జారుకోక ముందే ప్రభుత్వం కళ్లు తెరవాలి . ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నటువంటి పేద విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క సమగ్ర సర్వేను నిర్వహించడం ద్వారా ఎన్ని కుటుంబాలు తమ శక్తికి మించి అప్పులు చేసి తమ పిల్లలను చదివించడానికి కష్టపడుతున్నారో ఆ లాంటి వారి పట్ల ప్రభుత్వ విధానం ఏ రకంగా ఉండాలో నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది . తమకేమీ పట్టనట్లు, మొక్కుబడిగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగిస్తూ , మెగా డీఎస్సీ వేస్తున్నామని ప్రకటించడంతోనే ప్రభుత్వ బాధ్యత పూర్తి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పాఠశాల స్థాయి విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పొందగలిగే పరిస్థితులు నెలకొన్న నాడు, ఉచితంగా విద్యను ఆ కుటుంబాలకు అందించిన నాడు మాత్రమే ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం కాగలదు . థా యలాలు వాగ్దానాలతో పెన్షన్లు ఉచిత పథకాలను అమలు చేయడంతోనే సరిపు చ్చుకుంటే, అదే పరిపాలన అనుకుంటే, గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం మీద విద్యారంగపరంగా అనేక సవాళ్లు స్వారీ చేసే అవకాశం ఉంటుంది . చాప కింద నీరు లాగా విస్తరించి,ప్రభుత్వానికి సమస్యగా మారిన ప్రైవేట్ రంగంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కుటుంబాల యొక్క ఆర్థిక అరాచక పరిస్థితుల పైన సమగ్ర సర్వే జరిపిస్తే అనేక చేదు ,నిజమైన, భయంకరమైన వాస్తవాలు అనుభవాలు కుటుంబ పరిస్థితులు తెలుస్తాయి . ఆ కోణంలో తెలంగాణ ప్రభుత్వం తోలి నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ సిద్దిపేట తెలంగాణ )