నిత్య ఘర్షణతో సంసారం సాగేనా?

Apr 6, 2026 - 07:23
 0  2

 నిర్మాణాత్మక విమర్శ కాదు ఎదురు తిరిగి ఏదో మాట్లాడడమే ప్రతిపక్షం అనుకుంటే ఒరిగేది ఏమీ లేదు.

పంచాయతీకి పెద్దమనుషుల్లాగా   బుద్ధి జీవులు మేధావులు పాలక ప్రతిపక్షాల  రంకురాచరిక0 నిగ్గు తేల్చాలి.

---వడ్డేపల్లి మల్లేశం

ప్రజలకు సుపరిపాలన అందించడానికి రాజ్యాంగ పరిధిలో  ప్రజా సమస్యల పరిష్కారంలో  చట్టబద్ధ పాలన కొనసాగించడానికి  ప్రతిపక్ష అధికారపక్షాల  సమన్వయంతో చట్టసభల సాక్షిగా  పాలన కొనసాగించడానికి ఉద్దేశించబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ  ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో  ప్రజాస్వామ్య వ్యవస్థ గల దేశం అని గర్వంగా చెప్పుకుంటున్న భారత్లో  రాజకీయ పార్టీలు విలువలకు కట్టుబడి ఉండని కారణంగా  కార్యకారణ సంబంధం లేకుండా  పరస్పర విమర్శలు ఆరోపణలతో నిందించుకోవడంతో  దాని నాణ్యతను కోల్పోయి అబాస్ ఫాల అవుతున్నవి.. చట్టసభలలో ప్రజా సమస్యల మీద చర్చ జరిగిన సందర్భంలో  చర్చించే అంశానికి బదులుగా వేరే అంశాలను ప్రస్తావించడం వ్యక్తిగత అంశాలలో జోక్యం చేసుకోవడం ఒకవైపు జరిగితే బదులు ఇచ్చే క్రమంలో అధికారపక్షం కూడా  సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేయడం  అవునంటే కాదని కాదంటే అవుననే పద్ధతిలో  చర్చలు కొనసాగుతూ రోజుల తరబడిగా కాలయాపన చేస్తూ ప్రజాదనాన్ని తబల  దూర్వినియోగం  చేస్తూ ఉంటే ప్రజలు తలవంచుకొని ఓడిపోతున్నారు. ప్రజాస్వామ్యం గెలవాలనుకుంటే ప్రజలు ఓడిపోయినప్పుడు అది ఎలా సాధ్యం? ఆరోగ్యకరమైన వాతావరణంలో  ప్రజలు హాయిగా  జీవించడంతోపాటు సరైన ఉపాధి అవకాశాలతో నిత్య నూతనంగా విరాజిల్లవలసిన  బదులుగా  అరకొర సౌకర్యాలు, ఉపాధి లేమి,  కటిక దరిద్రము, పేదరికము,  బలహీనమైన  శరీరాలతో, బక్క చిక్కిన  భౌతిక దేహాలతో  ఉంటే ఇవేవీ పట్టనటువంటి పాలక ప్రతిపక్షాలు మాత్రం తమ  ఉనికి కోసం భవిష్యత్తులో అధికారానికి రావడం ఎలా అనే ఆలోచనతో ప్రతిపక్షం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అధికారపక్షం నిరంతరం ఘర్షణలకు దిగడం ఆనవాయితీగా మారింది.

ఈ దేశంలో పేదరికం లేదు, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలే లేవు,  అందరికీ గృహ వసతి కల్పించబడింది అని ఒకవైపు ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి.  అదే క్రమంలో ప్రతిపక్షాలు  పేదరికం ఇంకా 20% వరకు ఉందని,  గృహ వసతి లేనటువంటి వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారని, ఉపాధి అవకాశాలు లేక  వలసబోతు దిక్కు మొక్కు లేని పరిస్థితులలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి.  ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసినామనే  ప్రభుత్వ పక్షం వాదిస్తే  ఏ గ్రామంలో కైనా వెళదాం మొత్తం రుణమాఫీ జరిగిందంటే అక్కడే రాజీనామా చేస్తా లేకుంటే నేలకు ముక్కు రాస్తా అని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని మనం  వింటూనే ఉన్నాం.  గత ప్రభుత్వ హయాములో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని  ప్రభుత్వ రంగాన్ని దూర్వినియోగం చేసినారని అక్రమంగా  అవినీతికి పాల్పడినారని  ప్రస్తుత ప్రభుత్వ వర్గాలు విమర్శిస్తూ ఉంటే  ఆ విమర్శలను తట్టుకోలేక  ఏదో రకంగా  దాటవేయడం కోసం లేనిపోని మాటలతో  ఆధిపత్యం అహంభావాన్ని ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలు  సభా కాలాన్ని వృధా చేయడం సభలో గందరగోళాన్ని సృష్టించడం అధికార మంత్రులతో సహా అందరిని  అవమానం చేయడం  కనీస మర్యాదలు కూడా పాటించకపోవడంతో పాటు బడ్జెట్ ప్రతు లను కూడా చింపివేసి  తమ కు సంస్కారాన్ని చాటుకున్న సందర్భాలు దేశంలో అనేకం.  అంతే కాదు సభ  లో స్పీకర్ పైన కూడా కాగితాలను చింపివేసి  తమ అనాగరికతను చాటుకున్న సందర్భాలు దేశంలో అనేకం. పార్లమెంటు నుండి రాష్ట్ర సభల వరకు కూడా ఇలాంటి దుర్నీతి  కొనసాగుతూనే ఉన్నది .మేధావులు బుద్ధి జీవులు సామాజికవేత్తలు ఆర్థికవేత్తలు  రాజకీయ నిపుణులు తత్తవేత్తలు  ఈ దేశంలో ఎందరో ఉండి కూడా ఏది వాస్తవమో ఏది అవాస్తమో నిర్ణయించలేకపోవడం సిగ్గుచేటు.

నిపుణులు కల్పించుకొని రాజకీయ రంకుబొంకుతనాన్ని  ప్రజల్లో రుజువుచేయాలి:-

  2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని  గుర్తిస్తూ నాటి ప్రధాని శంకుస్థాపన చేస్తే  ఆ తర్వాత వచ్చిన వైయస్సార్సీపి పార్టీ ప్రభుత్వం మూడు ముక్కలాట పేరుతో ఐదేళ్ల కాలంలో రాజధాని లేకుండా చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు ఈ దేశం ఆనవాలు.  గమ్మత్తు ఏమిటంటే అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకులు చట్టసభలకు రారు.  వచ్చి సభ్యులను  గౌరవించరు.  క్షణకాలంలోనే తిరిగి వెళ్ళిపోతారు  హాజరు కాకుండా అనే లక్షలాది రూపాయల వేతనం తీసుకుంటారు.  అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి  వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కే చంద్రశేఖర రావు గారు  చట్టసభలకు రాకుండానే ప్రధాన ప్రతిపక్ష నాయకుని పాత్ర ఎలా పోషిస్తారు? ఇది ప్రజల్లోకి చెడు సంకేతాన్ని పంపడం కాదా? బాధ్యతలు నిర్వహించకుండా వేతనాలు తీసుకునే అధికారం ఎక్కడిది?  ఉద్యోగులకు ఒక నీతి ప్రజా ప్రతినిధులకు మరొక నీతియా?  

ఇందులో ఉన్నటువంటి మర్మాన్ని కూడా విప్పి చెప్పాల్సిన బాధ్యత మేధావులదే!  గత ప్రభుత్వం పైన వచ్చిన అనేక ఆరోపణలు  ప్రస్తుత ప్రభుత్వం కొనసాగే ఐదేళ్లపాటు విచారణ జరుగుతూనే ఉంటుంది. కానీ ఏ నిర్ణయం తీసుకోకుండానే  అధికార ప్రతిపక్షాల కనుసన్నల్లో  ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటే పరస్పర అంతర్గత అవగాహన ఉన్నట్లేనా?  కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని  విచారణ కమిషన్ వేయడం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రావడం  ఏళ్ల తరబడి విచారణ జరిగిన అనంతరం కూడా  ఈ విషయాన్నినిగ్గు తెల్చ లేదంటే మన విచారణ సంస్థలు  ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత  నిమ్న స్తాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యాయవ్యవస్థ పరిధిలో విచారణ జరగదు.  విచారణ కమిషన్లు తీర్పులు ఇవ్వవు.  ప్రభుత్వ విచారణ కమిటీలు లేదా సంస్థలు  ఆదేశించే స్థితిలో లేవు. అలాంటప్పుడు ప్రాజెక్టు నిర్మాణంలో లోపం ఎవరిది?  ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేదా మంత్రిగా ఏదీ తేల్చకపోవడం అంటే  ఎంత బలహీనమైన  పాలనాపరమైన సంస్కరణలు మన దేశంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ప్రతిరోజు భార్యాభర్తల మధ్యన ఘర్షణ జరుగుతూ ఉంటే ఆ కాపురం  నిలవడం కష్టం. పరస్పర అవగాహనతో కొంత రాజీ ప్రయత్నం జరగాలి. కొంత కాలయాపన తర్వాతనైనా ఒక ముగింపు రావాలి.  పుట్టిన పిల్లల సమక్షంలోనైనా కొంత మార్పు వస్తే సంతోషిస్తాం. కానీ పుట్టిన పిల్లలు కూడా పెద్దవాల్లై భార్యాభర్తలు వృద్ధాప్య స్థితికి చేరుకున్న  కూడా వారి మధ్యనున్న ఘర్షణ పరిష్కారం కాలేదంటే ఇక మధ్యవర్తులు ఎవరో జోక్యం చేసుకోవాల్సిందే కదా!  అలాగే ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్యన నిరంతరం పరస్పర ఆరోపణలతో  జరుగుతున్నటువంటి సంఘర్షణ లేదా యుద్ధ వాతావరణం ప్రజల సొమ్మును స్వాహా చేయడానికి కానీ ప్రజలకు మేలు చేయడానికి కానే కాదు. అసలైనటువంటి విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని ఉచితంగా ప్రజలకు అందించాలనే సోయి ప్రభుత్వాలకు లేకపోవడం ప్రతిపక్షాలు ఏనాడు ప్రశ్నించకపోవడం అంటే రెండు పక్షాలు కూడా తమ బాధ్యతను  మరిచిపోవడమే అవుతుంది.ఈ సందర్భంలో  ఈ వైరుధ్యాలను నివారించడానికి  వాస్తవమేమి టో ని గ్గు తెల్చాడానికి  ప్రభుత్వాల యొక్క బాధ్యతలను గుర్తింపజేసి ఆదేశించడానికి   బుద్ధి జీవులు మేధావులతో కూడిన స్వచ్ఛంద  అధికార పద్ధతిలో కూడుకున్న సంస్థ ఈ దేశంలో చాలా అవసరం.  మధ్యవర్తులు లేకుండా సమస్యలు పరిష్కారం కానట్లు  అధికార ప్రతిపక్షాలు డొల్లతనంతో వ్యవహరిస్తూనే ఉంటాయి. కానీ ఇందులో నేరస్తులు ఎవరో తెలియచేయడానికి  కచ్చితంగా బుద్ధి జీవుల మేధావుల కమిటీ చాలా అవసరం. వాళ్ళైనా ఇప్పటికీ జోక్యం చేసుకొని  అభాసు పాలవుతున్నటువంటి దేశ సంస్కృతి,పరిపాలన,నాగరికత,చైతన్యాన్ని  కాపాడడానికి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నత్యాన్ని నిలబెట్టడానికి  మాటలు కాదు చేతలు ముఖ్యమని ఇంతవరకు జరిగినటువంటి పరిపాల న లో జరిగినటువంటి అవినీతి బంధుప్రీతి అరాచకాలు అక్రమాలు నేరం రుజువు చేసి  ఆ రాజకీయ పార్టీలకు శిక్ష విధించడం ద్వారా  ఒక ఉన్నత స్థాయి సంస్కారాన్ని నిర్మించవలసినటువంటి అవసరం భారతదేశంలో చాలా ఉంది.అందుకు మేధావులు బుద్ధి జీవులు కంకణo కట్టుకోవాలి.  నూతన వ్యవస్థకు  రూపకల్పన జరగాల్సిన అవసరం చాలా ఉన్నది.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333