తాత్కాలిక ప్రలోభాలు ఉచితాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచలేనట్లే
తాత్కాలిక ఆవేశాలతో శాశ్వతమైన ఆనందాన్ని పొందలేము
చలన శీలమైన సమాజ మనుగడలో ఆటుపోట్లు, అవకాశాలను ఆలోచన ప్రతిభ ద్వారా అనుకూలంగా మార్చుకోవాలి.
గమ్యం వైపు గమన మార్గం ఉంటేనే కదా చేరుకునేది.*,
--- వడ్డేపల్లి మల్లేశం
కష్టాల కొలిమిలో నిరాశ నిస్సృహాల్లో కొట్టుమిట్టాడినప్పటికీ రేపటి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని విశ్వసించకపోతే అందుకు తగిన విధంగా మన ప్రణాళికను సిద్ధం చేసుకోలేము. గమ్యం వైపు మన గమనాన్ని కొనసాగిస్తే కొంత ఆలస్యంగా నైనా ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మన ప్రయాణ ముఖమే అటువైపు లేనప్పుడు గమ్యాన్ని చేరుకోవడం సుదూరమే కాదు, అసాధ్యం కూడా. జీవన లక్ష్యాలను సాధించడానికి పట్టుదల, స్థిరత్వం, అంకితభావం పైన విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే గెలుపు అవకాశముంటుంది, కానీ అదృష్టానికి వదిలిపెడితే గెలుపుకు ఆటంకం అవుతుంది. సూర్యుడు ఉదయించడం అస్తమించడం, వర్షాలు కురవడం నీ రు ఏరులై పారడం, నదులు సముద్రాలు ఉప్పొంగడం, వర్షాకాలంలో పచ్చదనం ప్రకృతి నిండా ఒదిగిపోవడం , చలికి శరీర భాగాలు కుoచిo చుకుపోవడం, ఆత్మరక్షణ కోసం ప్రత్యామ్నాయలవైపు వెతుక్కోవడం మామూలుగా సాగే జీవన యానం లోని భాగాలు. నిజంగా ఈ అంశాలు అన్నీ కూడా జీవన రహస్యంగా భావిస్తే సహజత్వం పునాదిగా చైతన్యం, ప్రతిభ, ఆలోచన సరళి, సృజనాత్మకత జోడించినప్పుడు తప్పనిసరిగా విజయా వకాశాలు మరింత మెరుగుపడతాయి .
కొన్ని కఠోర వాస్తవాలు :-
-*******
కష్టాలు ఆవరించి ఉన్నా, ప్రమాదాలు ముంచుకొస్తున్నా, గెలుపు అవకాశం కనుచూపుమేరలో కనపడకపోయినా,
ఇతరులకు ఆటంకం కలగని రీతిలో నమ్ముకున్న సిద్ధాంతం మేరకు స్వప్రయోజనాల కతీతంగా సామాజిక ప్రయోజనం రీత్యా వ్యక్తి మన గలిగితేనే మానవుడు సంఘజీవి అని నినదించిన అరిస్టాటిల్ ఆలోచనకు అర్థం ఉన్నట్లు. నిరాశ నిస్గృహలకు జీవితంలో చోటు లేకుండా ఆశావాదంతో బ్రతికితే, సానుకూల దృక్పథంతో సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తే, ఉల్లాసం ఉత్సాహం సంతోషంతో అనుభవాలు జ్ఞాపకాలను 10 మందితో పంచుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆరోగ్యానికి దారితీస్తుంది. ఎందుకంటే ఆనంద సమయంలో విడుదల అయ్యే ఎండార్పిన్ హార్మోన్ సహజమైంది కనుక. ఆ అవకాశాలను పరిస్థితులను కల్పించుకోవాల్సిన బాధ్యత మనదే కదా !కష్టాల్లో వంగిపోవడం, సుఖాలు సంతోషాలు అనుకూల సమయాలలో పొంగిపోవడం, కలిసి వచ్చిన అవకాశాన్ని తన ప్రతిభే అని గర్వపడడం, పదిమంది కృషిని చొరవను తనదిగా ముద్ర వేసుకోవడం అనాది నుండి నేటి వరకు నిరంతరం కొనసాగుతున్న వ్యాపకాలే . అనేక అంశాలు ప్రభావితం చేస్తున్న సందర్భంలో ధన, కుల, కండ బలాలు కూడా మనిషి తప్పును ఒప్పు చేస్తుంటే బలహీను న్నీ తన నీతి నిజాయితీ , చొరవ, పరిణతి, ప్రతిభ సమాజం గుర్తించని కారణంగా కొన్ని వర్గాలకు సామాజిక గుర్తింపు లభించడం లేదు. జీవితం వ్యక్తిగతమని చెప్పుకున్నా దానికీ కొనసాగింపుగా సామాజిక జీవితం అంతిమంగా సమాజ సంస్కరణకు తమ జీవితాలను అంకితం చేయడం వంటి ఉన్నత దశలను కూడా ఎంతోమంది చారిత్రక వ్యక్తులలో మనం చూసి ఉన్నాం. ఇప్పటికీ తమ సొంత జీవితాలను పక్కనపెట్టి, అవకాశాలను అర్హతలను మూలకు నెట్టి, సిద్ధాంతం ఆచరణ ఆదర్శానికి కట్టుబడి, మను గడ ప్రశ్నార్థకం కాకుండా అర్థవంతంగా కొనసాగడానికి సమాజం గురించి తపన పడుతున్న వాళ్లు అనేకం. ఆ ధోరణినీ మిగతా సమాజం మాటవరసకైనా గుర్తించకపోతే మరింత మెరుగైన సమాజాన్ని ఊహించడం కష్ట సాధ్యమవుతుంది. ఎందుకంటే పైకి ఎత్తే వాళ్లు నలుగురు అయితే అగాధంలోకి నెట్టేవాళ్లు 100 మంది ఉన్న కాలమిది .
" నవ్వుతూ బతకాలి రా నవ్వుతూ చావాలి రా చచ్చినాక నవ్వలేవు రా ఎందరేడ్చిన తిరిగి రావు రా మళ్లీ రావు రా" అంటూ ఒక పాట జీవిత సత్యాన్ని, ఆనందాన్ని, తోటి మనిషిని ప్రోత్సహించే సహజ జీవనశైలిని, సాటి మనిషిగా చూడగలిగే సంస్కారాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేస్తుంటే ఆ నవ్వుల మాటున కష్టాలు కన్నీళ్లను ఊహించడం కూడా కష్టమే జీవితమంటే అదే కదా! చలనశీలమైన సమాజాన్ని నిస్తేజంగా, స్తబ్దంగా, అగమ్య గోచరంగా మార్చే అధికారం ఎవరికి లేదు. అయితే అభ్యుదయ పథానికి సంబంధించి మార్పును ఆశించే క్రమంలో వ్యవస్థ మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకునే సందర్భంలో ప్రతిభను అవకాశాలను అవాంతరము కాని రీతిలో వినియోగించుకున్నప్పుడు మాత్రమే వ్యక్తి మనుగడ ఉన్నతంగా ఉంటుంది. తోటి సమాజాన్ని కూడా ఉత్కృష్టంగా ప్రభావితం చేయగలరు.
ఆలోచన ఆశయాలు ఉన్నటువంటి మానవ సమూహం అంతకు మించిన స్థాయిలో అత్యాశ స్వార్థం ముసుగులో జీవిస్తున్న కారణంగా గుర్తింపుకు రాకుండా పోతుంటే, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణికోటిలో కీటకాలు జంతువులు పక్షులు పెంపుడు జంతువులు అనేక రకాలైనటువంటివి ప్రత్యక్షంగా పరోక్షంగా పరపరాగ సంపర్కానికి , ఎరువుల తయారీకి, పంటల ఉత్పత్తికి, కడుపు నింపడానికి ,నీడనివ్వడానికి, తోడుగా మారడానికి ఏమాత్రం జంకు కొంకు లేకుండా మనిషి మనుగడ ను మరింత సుఖవంతం చేస్తుంటేనే కదా సమాజం ఎదిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ప్రకృతి కన్నేర్ర చేస్తే, ప్రాణి కోటి సహకరించకపోతే, విపత్తులు వాతావరణ పరిస్థితులు కొరడా జూలిపిస్తే మన గతి ఏమిటో అనేక సందర్భాలలో చూసి ఉన్నాo . అయినా అహంకారం, ద్వేషం ,స్వార్థం , ఆదిపత్యంతో తాను మాత్రమే ముఖ్యమని తన ఉనికి గొప్పదని తన వల్లనే ఈ వ్యవస్థ నడుస్తున్నదని తనను అందరూ ఆదరించి గుర్తించి పూజించాలని కోరుకునే దుష్ట సంప్రదాయ నీడలో ఎందరో ఈ వ్యవస్థకు ద్రోహం తలపెడుతున్నారు. మానవ జీవితానికి మహానుభావులు ఇచ్చిన నిర్వచనాన్ని ఖూనీ చేస్తున్నారు .
ఆవేశాలు కాదు ఆలోచన ముఖ్యం :-
రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకటించే థా యిలాలు ఉచితాలు వ్యక్తి జీవితాన్ని.ఉత్తమ సమాజాన్నీ, అభివృద్ధిని సాధించలేనట్లే పైగా వ్యతిరేక ఫలితాలతో సమాజాన్ని బ్రష్టు పట్టించినట్లు తాత్కాలిక ఆవేశం విచక్షణను కోల్పోయి మనిషిని అగాధంలోకి నెట్టుతుంది. ఈ సందర్భంలోనే మనిషి యొక్క ఆలోచన, సమయస్ఫూర్తి, మేధస్సు ప్రశ్నార్థకంగా కేవలం వ్యక్తిగతంగా స్వార్థపూరితంగా ఉండకుండా సానుకూలంగా ఉన్నప్పుడు సంస్కరణ సామాజిక స్పృహను అత్యధికంగా పెంపొందించడం ద్వారా పాలకులు చేయలేని మార్పును సాధించగలం . ఆవేశంలో ఆలోచన కనుమరుగైనట్లు, తొందరపాటులో సర్వస్వాన్ని కోల్పోయినట్లు, అమానవీయ ప్రవర్తన దు రలవాట్లు దురాలోచనల ద్వారా ఈ వ్యవస్థకు నష్టం చేస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కనుక వారికి తగిన శిక్షను సమాజం అమలు చేయాలి అదే సందర్భంలో ఏకాకులను చేసి సమాజం నుండి బహిష్కరించి మానసిక క్షోభకు గురి చేసినప్పుడు మాత్రమే మనిషికి తన గురించి, సమాజం గురించి, జీవితం గురించి ,కర్తవ్యాల గురించి, చివరికి తన లోటుపాట్లను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే పశ్చాత్తాపాన్ని మించినటువంటి శిక్ష లేదు అని పూర్వకాలపు నానుడి లో ఎంతో అర్థము ఉన్నదని అంగీకరించక తప్పదు . నేటితో ఈ జీవితం ముగిసిందని నిరుత్సాహపడినా, రేపు ఎంతో అనుభవించేది ఉన్నదని అత్యాశపడినా ఈ రెండు సందర్భాలు కూడా సహేతుకం కాదు. అయితే భవిష్యత్తుపై ఆశావాదంతో జీవించడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, చేసిన తప్పులను సవరించుకోవడానికి, మరింత ఉల్లాసంగా ఉత్సాహపూరితంగా కర్తవ్యాలను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. జీవితం అంటే ఒక కుటుంబం లేదా కుటుంబంలోని వ్యక్తి యొక్క మనుగడ అని అనుకుంటే పొరపాటే. ఆ భ్రమలో నుండి బయటపడినప్పుడు మాత్రమే సామాజిక స్ఫూర్తితో , సామూహిక దృక్పథంతో, పరస్పరం ప్రేమానురాగాలతో, ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో, కలిమిడిగా చీమల లాగా వ్యవహరించగలిగితేనే మనిషికి ఉన్న ప్రత్యేకత అంగీకారమవుతుంది. మన ప్రవర్తనలో ఆ పరిణతి కనిపించకపోతే మనిషిగా జీవించడానికి అర్హత లేదని అంగీకరించే కాలం తప్పక వస్తుంది. గమ్యాన్ని మార్గాన్ని సమన్వయం చేసుకుంటూ ఊహా లోకంలో విహరించకుండా నిజజీవితంలో నిబద్ధతగా ప్రయాణం చేయడమే విజయానికి తొలిమెట్టుగా రాచబాటగా అందరము ఆచరించిన నాడు సంఘం కోసం ఒక్కరు ఒక్కరి కోసం సంఘం అనే పరస్పర సహకార ధోరణి మానవ సమూహంలో సాధ్యమవుతుంది. అదే కదా నాగరిక సమాజానికి మరింత స్ఫూర్తినిచ్చే నినాదంగా తరతరాలకు స్ఫూర్తినివ్వవలసినది .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )