తమ చర్యలతో చరిత్ర సృష్టించిన వాళ్లను  దేశ ప్రజలు మరిచిపోవడం విచారకరం

Jan 24, 2025 - 19:52
 0  2

తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఫాతిమా షేక్  జీవితం,

విద్యాబోధన, సామాజిక సేవ  నేటితరం తెలుసుకోవడం  చారిత్రక అవసరం.

చరిత్రను వెలికి తీయడం  రచయితల బాధ్యత కూడా.

----  వడ్డేపల్లి మల్లేశం

(9.1.2025 ఫాతిమా షేక్ 194వ జయంతి ప్రత్యేక వ్యాసం) భారతీయ విద్యావేత్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త,సామాజిక అసమానతలు అంతరాలపైన నిరంతరం పోరాడిన విప్లవోద్యమ  వేగుచుక్క,  అంతకుమించి  సంఘసంస్కర్తలు   విద్యా వ్యవస్థలను ఏర్పాటుచే పాఠశాలలు నిలబెట్టి   చరిత్ర సృష్టించిన  సామాజికవేత్తలు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలతో కలిసి  పనిచేసినటువంటి ఆదర్శనారి  ఫాతిమా షేక్.  1831  జనవరి 9వ తేదీన మహారాష్ట్రలోని పూణేలే జన్మించిన  ఫాతిమా షేక్  అక్టోబర్ 9,1900 సంవత్సరంలో  69 ఏళ్ల వయస్సులో  ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినా  తనకంటూ ఒక చరిత్రను నిర్మాణం చేసుకొని  తొలి మహిళా ముస్లిం ఉపాధ్యాయురాలుగా  వినుతికెక్కి  చరిత్ర మరిచినప్పటికీ తన కర్తవ్యాన్ని మాత్రం  సామాజిక బాధ్యతగా నిర్వహించినటువంటి  ఫాతిమా షేక్ ను నేటితరం ఆదర్శంగా తీసుకోవడం చాలా అవసరం. తద్వారా   రాబోయే పేరు ప్రఖ్యాతులకు కాకుండా మన కర్తవ్యాన్ని మనకంటూ ఓ చరిత నిర్మాణం చేసుకోవడానికి గల రాజకీయ సామాజిక ఆర్థిక బాధ్యతలను  నిర్వహించడం  ప్రధానమని గుర్తిస్తే  ఆమె జయంతి సందర్భంగా  మనం ఘనమైన నివాళి అర్పించినట్లే .. ఆంగ్లేయుల పాలనా కాలంలో  స్వార్థ ప్రయోజనాల కోసం  కొన్ని సౌకర్యాలు విద్య వ్యవస్థను పాఠశాలలను ఏర్పాటు చేసినప్పటికీ  అవి నామ మాత్రం మిగిలిపోగా ఆనాడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు,  వివక్షత, అణచివేత,  కుల  పట్టింపులతో కూలిపోయిన సమాజంలో  తమదైన శైలిలో  సంస్కరణ తీసుకురావడానికి  వీలైన మేరకు ప్రక్షాళన చేయడానికి  సమకాలీకులుగా  కలిసి పని చేసే అవకాశం రావడం ఫాతిమా షేక్  జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలేది నిజంగా  ధన్యమైన జీవితం. సంఘసంస్కరణ తో పాటు  కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అవసరమైతే అగ్రవర్ణాల వాళ్లను అధిగమించి  పోరాడుతున్న సందర్భంలో  ఆ వైఖరి గిట్టనటువంటి జ్యోతిరావు పూలే తండ్రి  జ్యోతిరావును   ఇంటి నుండి తరిమేస్తే  ఫాతిమా షేక్ వాళ్ళ సోదరుడు  మియాన్ ఉస్మాన్ షేక్ ఆశ్రయము  ఇచ్చి  వాళ్లను ఆదుకోవడం జరిగింది. ఆ రకంగా సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలే మియాన్ ఉస్మాన్ షేక్ ఇంట్లో నివాసం ఉన్న  సందర్భంలో వీరి మధ్యన సఖ్యత సహవాసం  పెరిగిన కారణంగా అభిప్రాయాలు  ఒక్కటై   పూలే ప్రారంభించిన టువంటి  పాఠశాలలో దళిత విద్యార్థులకు  ఫాతిమా షేక్ పాఠాలు బోధించడం ప్రారంభించింది. .పూలే దంపతులు కూడా ఫాతిమా షేకు  తో కలిసి అణగారి న పేద అట్టడుగు వివక్షతకు  గురవుతున్నటువంటి వర్గాలకు విద్యను వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకోవడం  ముఖ్యంగా బాలిక విద్యను ప్రోత్సహించడానికి  ఉమ్మడిగా నడుము కట్టి వారి లక్ష్యాన్ని చేరుకోవడం మనం చరిత్రలో గమనించవచ్చు.

తొలి ముస్లిం ఉపాధ్యాయురాలుగా  చరిత్రకెక్కిన ఫాతిమా షేక్  :-

ఉస్మాన్ షేక్ ఇంట్లో ప్రారంభమైన  పాఠశాలకు  విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో మరిన్ని పాఠశాలలను చుట్టుపక్కల ప్రాంతాలలో ఉమ్మడిగా నిలబెట్టడం జరిగింది. ఆ పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ ఇద్దరు కలిసి  చదువు బోధించేవారు  స్త్రీ విద్యను వ్యతిరేకించి  వివక్షత అసమానతలు అంతరాలతో కూడుకున్న ఆనాటి సమాజంలో  ఆధిపత్య వర్గాలతో అనేక  ఇబ్బందులు ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో  తమ లక్ష్యాన్ని నెరవేర్చడానికి  వెనుకడుగు వేయలేదు.  ఆ కాలంలో అట్టడుగు వర్గాలు దళితుల పిల్లలు చదువుకోవడానికి  వీలు లేనటువంటి కఠిన నిబంధన అమలులో ఉన్నట్లు తెలుస్తుంటే  ఆధిపత్య వర్గాలతో ఎన్ని ఇబ్బందులు అవమానాలనైనా ఎదుర్కొని భవిష్యత్తు తరాల కోసం అవమానాలను దాడులను  దౌర్జన్యాలను భరించి  ఆడపిల్లల చదువు  భవిష్యత్తుకు వెలుగు అనే  కోణంలో  నూరు సంవత్సరాలకు పూర్వమే  ధైర్యంగా చాకచక్యంగా  చేసిన వారి పోరాటం  నడిపిన పాఠశాల విద్య భోధన గొప్పవిషయం. చరిత్రను అధ్యయనం చేసే వాళ్ళు లేకపోవడంతో కొంత కనుమరుగు కావచ్చు కానీ  తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే  ప్రాచుర్యము పొందుతే తొలి మహిళ ముస్లిం ఉపాధ్యాయురాలిగా ఫాతిమా షేక్  అంతే  కీర్తి గడిo చడాన్ని మనం  అంగీకరించాలి. భవిష్యత్ తరాలకు చాటి చెప్పాల్సిన అవసరం కూడా  ఉంది.  ఉపాధ్యాయులుగా  ముఖ్యంగా మహిళలకు విద్యను బోధించాలంటే  మానసిక శాస్త్రము తో పాటు  సామాజిక మెలకువలు  ఆధునిక ధోరణులతో కూడుకున్న ఉపాధ్యాయ శిక్షణ చాలా అవసరం. ఏనాడైనా  ఆ అవసరం రీత్యా సింధియా పర్రార్ అనే అమెరికన్ మిషనరీ నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో  ఫాతిమా షేక్  సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా చేరి  పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకొని  ఉపాధ్యాయ వృత్తిని  ఉపాధి కోసం కాకుండా కర్తవ్యం గా స్వీకరించినటువంటి  వాళ్ల ఆలోచన ధోరణి నేటితరం ఉపాధ్యాయులకు కూడా  మార్గ నిర్దేశం చేస్తుందనడంలో   సందేహం లేదు.  పూలే దంపతులు అనేక పాఠశాలలను వివిధ ప్రాంతాలలో నెలకొల్పుతూ  విద్యారంగ అభివృద్ధికి, సామాజిక చైతన్యానికి, బాలిక విద్యకు, వివక్షతను దూరం చేయడానికి పూనుకున్న సందర్భంలో  ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి   ముస్లిం దళితులు ఇతరులు అగ్రవర్ణాలలోని పేదలకు అన్ని వర్గాలకు   కూడా  విద్యను అందించి   చరిత్రలో నిలిచింది ఫతిమాషేక్. కులాలు, మతాలకు అతీతంగా  కొనసాగిన ఆమె బోధన ఉపాధ్యాయ వృత్తి  ఆ తర్వాత 1851లో ముంబాయిలో రెండు పాఠశాలలను స్థాపించే క్రమంలో  పూలే దంపతులతో పాటు ఫాతిమా షేక్ కూడా తన భాగస్వామ్యాన్ని అందించినట్లు తెలుస్తున్నది.అంటే కేవలం బోధించడమే కాదు పాఠశాలల  ఏర్పాట్లు లోపల కూడా ఫాతిమా షేక్  భాగస్వామి కావడాన్ని మనం అభినందించాలి  ఆరాధించాలి కూడా. ప్రతి వ్యక్తి తనకంటూ చరిత్రలో  ఒక పేజీని లిఖించుకోవడం  మనిషి ఉనికికి,  మానవత్వాన్ని ప్రదర్శించడానికి,  జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి తార్కానంగా భావించవలసిన అవసరం ఉంది. ఆ కోణంలో  తన జీవితాంతం కూడా అనేక వివక్షతలను అవమానాలను ఎదుర్కొని కూడా  ధైర్యంతో  నమ్మిన సిద్ధాంతం కోసం విద్యావ్యప్తికి  కృషి చేసినటువంటి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా  పేరుగాంచిన ఫాతిమా షేక్  జీవితము   విద్యాబోధన  సంక్షిప్త పరిచయాన్ని  2014లో మహారాష్ట్ర ప్రభుత్వం  బాల భారతి  అనే పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడం  గర్వకారణంగా భావించాలి.  గొప్ప విషయం ఏమిటంటే  అదే సందర్భంలో  వివిధ రంగాలలో  స్థానం సంపాదించుకున్న ముస్లిం  నిపుణులైనటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్,  జాకీర్ హుస్సేన్, అబ్దుల్ కలాం,  అబుల్ కలాం ఆజాద్ లాంటి   వారి చరిత్రతో పాటు  ఫాతిమా షేక్ జీవితo  పరిచయం చేయడాన్ని  ప్రత్యేకంగా గుర్తించవలసిన అవసరం ఉంది.  భారతదేశ చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరుగాంచిన ఫాతిమా షేక్ జీవితం   బోధన విద్యాసేవ  గూర్చినటువంటి పరిచయాన్ని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూడా 2022లో  8వ  తరగతి పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టినట్లు  తెలుస్తున్నది.  కృషి చేసిన వాళ్లు, బాధ్యతను  నిబద్ధతగా  కొనసాగించిన వాళ్లు,  చరిత్రలో పేరు సాధించిన వాళ్లు  ఇదంతా కర్తవ్యం గా మాత్రమే భావిస్తారు కానీ వారి తదనంతరం  ఈ రకంగా  దేశం  గుర్తించడం  మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆమె జీవితాన్ని పాఠ్యాంశాలలో చేర్చడం  అంటే  నేటి తరం లేదా సమాజం  ప్రభుత్వాలు  వాళ్ల కృషిని  గుర్తించినట్లే కదా! అయినప్పటికీ చరిత్ర మరిచిన  తొలి ముస్లిం ఉపాధ్యాయురాలిగా  చరిత్రకారులు మేధావుల దృష్టిలో కొంత ఆవేదన ఉన్న మాట  వాస్తవం. ఆమె జీవిత సారాన్ని  నేటి తరానికి  అందించడం  చరిత్రకారులు, రచయితలు, విద్యావంతులు  మేధావులుగా మనందరి బాధ్యత. చదువుకున్న ప్రతి ఒక్కరు  బుద్ధి జీవులు కూడా జయంతి, వర్ధంతి సందర్బంగా నైనా కూడా  ఆమె చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా  ఆమె స్థానాన్ని లోకానికి చాటిచెప్పాలి. నేటితరం ఆదర్శంగా తీసుకునేలా ప్రోత్సహించవలసిన అవసరం కూడా మనపై  ఉంది .

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333