చట్టసభల చట్టాలతో పాటు కోర్టుల తీర్పులు సానుభూతితో పేదవర్గాల కన్నీరు తుడిస్తే సరిపోదు
ఆకలితో మాడిపోయే వాడికి కడుపు నింపాలి
ఆ రకమైన చట్టాలు అమలు కావాల్సిందే.
విద్యాహక్కు చట్టం అమలుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిద్దాం.
----వడ్డేపల్లి మల్లేశం
స్వతంత్ర పోరాటంలో మన దేశ పోరాట వీరులు త్యాగ దనులు చూపినటువంటి పటిమ, త్యాగనిరతి ఈ దేశానికి స్వతంత్రం రావడం కోసం మాత్రమే కాదు సాధించిన భారతదేశంలో ప్రజలందరికీ న్యాయం జరగాలని, అసమానతలు అంతరాలు తొలగి సమానత్వం సాధించాలని ఆకాంక్షించినారు. అందుకే రాజగురు, సుఖదేవ్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్లు ఉరిక o భం ఎక్కారు. వారి త్యాగనిరతి పట్టుదలను దాని పూర్వ నేపథ్యాన్ని గుర్తించినా... స్వతంత్ర భారతదేశంలోని పాలకులు, రాజకీయ నాయకులు చివరికి చట్టసభలు కూడా పరిపాలనలో అనేక తప్పటడుగులకు పాల్పడుతూ, తాము చేసిన చట్టాలను తామే అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ, పెట్టుబడిదారీ వర్గాన్ని పెంచి పోషిస్తూ, సమానత్వాన్ని సాధించకుండా అడ్డుపడుతున్న సంగతి మనకు తెలియనిది కాదు. 2009లో విద్యాహక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తే ప్రైవేట్ అన్ ఏడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద బడుగు వర్గాలకు కేటాయించాలనే కనీస సూచనలు కూడా పాటించకుండా 17 సంవత్సరాలు అప్పుడే గడిచిపోయినాయి. ఇంత కాలానికి సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి ఈ సమస్య వెళితే ప్రైవేటు అన్యేడె డ్ పాఠశాలలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా ఆలస్యంగా నైనా పేద బడుగు జనుల హక్కులను గుర్తించిన విషయాన్ని స్వాగతించవలసిందే. అయితే అమలు చేసేది ప్రభుత్వాలే కదా! ఆ ప్రభుత్వాలకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు? 20 29లో చట్టం చేస్తే 17 సంవత్సరాల లో ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు పూనుకోలేదు? ఏ ఒక్క పాఠశాలలో కూడా 25% సీట్లను పేద వర్గాలకు కేటాయించిన దాఖలా ఎందుకు లేదు? పైగా ఉత్తరప్రదేశ్లోని లక్నో పబ్లిక్ స్కూల్లో 2024 -25 సంవత్సరానికి పేద వర్గాలకు అడ్మిషన్ కోసం ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఆ పాఠశాల నిరాకరించిన విషయం కోర్టు దృష్టికి రావడంతో అలహాబాద్ హైకోర్టు ఇటీవల పాఠశాలను మందలిస్తూ ఖచ్చితంగా 25 శాతం సీట్లు అమలు కావాల్సిందే అని చేసిన హెచ్చరిక, ఇచ్చిన తీర్పు ఆ తీర్పు పైన ఆ పాఠశాల యాజమాన్యం సర్వోన్నత న్యాయస్థానంకు వెళ్తే సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ విద్యా రంగంలో అవకాశాలు కల్పించడం కేవలం పేద మధ్యతరగతి వర్గాలకు వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే కాదు జాతి సేవలో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యారంగం అన్ని వర్గాలకు సమానంగా తన ఫలాలను అందించాలని చేసిన హెచ్చరిక ఇప్పటికైనా పాలకవర్గాలకు గుణపాఠంగా మిగిలితే కొంతవరకైనా ప్రయోజనం ఉంటుందో ఏమో.?
కోట్లు తీర్పులోని సారాంశం ఏమిటి
విద్య కేవలం సంపన్న వర్గాల కోసం మాత్రమే కాదని, ప్రతి బిడ్డ విద్యా అవకాశాలను పొందడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, ప్రైవేటు పాఠశాలల్లో పేద వర్గాలకు ఉచిత ప్రవేశాన్ని నిరాకరించడం అంటే రాజ్యాంగంలోని 21 ఏ నిబంధనను ఉల్లంఘించడమేనని, ఈ ఉల్లంఘన చట్ట విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొనడం అభినందనీయం .పేద వర్గాలకు ప్రవేశం కల్పించడం వల్ల కేవలం వ్యక్తిగత ప్రయోజనం కాదని ఇది సామాజిక ప్రయోజనానికి దేశాభివృద్ధికి దారితీస్తుందని ఉచిత విద్య వైద్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నందుకు అమలు చేసే క్రమంలో ప్రభుత్వ విద్యకు తోడు ప్రైవేటు విద్యా వ్యవస్థ ఊప o దుకున్న వేళ అనివార్యమైన పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించడం ద్వారా ప్రభుత్వాలు తమ రాజ్యాంగ బాధ్యతను నిర్వహించాలని నిర్లక్ష్యం చేస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించడం ఇప్పటికైనా ఆ పాలకులకు గుణపాఠం తెస్తుందని ఆశిద్దాం. పాఠశాలలకు ఈ వర్గాలకు ఉచిత ప్రశాలను నిలిపివేసే హక్కు లేదని, సమానత్వాన్ని సాధించే క్రమంలో ఇది తొలిమెట్టుగా పనిచేస్తుందని, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జాబితాను 25 శాతానికి సరిపోయే స్థాయిలో అనుమతించడం ద్వారా అమలు చేయడమే పాఠశాల యొక్క బాధ్యత అని పాఠశాలలను హెచ్చరించిన తీరు గర్వకారణం. సుప్రీంకోర్టు యొక్క ఈ తీర్పు కేవలం ఉల్లంఘించినటువంటి పాఠశాలకు మాత్రమే వర్తించదని నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా తమ ధర్మాన్ని ఇంత కాలంగా విస్మరించి లేదా అట్టడుగు బలహీన వర్గాలకు జరిగినటువంటి అన్యాయాన్ని చూసి చూడనట్లు వ్యవహరించినటువంటి పాలకులకు కూడా కనువిప్పు కావాలనేదే ఈ తీర్పులోని సారాంశం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి
న్యాయవ్యవస్థ గుర్తించి హెచ్చరించి చురకలు అంటించే దాకా కూడా నిర్లిప్తంగా తమ బాధ్యతను విస్మరించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా రాజ్యాంగబద్ధమైన కర్తవ్యాలను విస్మరించకుండా తాము చేసిన చట్టాలను అమలు చేసే క్రమంలో ఉదాసీనతను పక్కనపెట్టి కొటారి సూచించిన విధంగా ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించాలని చేసిన సూచనలను అమలు చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వాలు కనీసంగా ప్రైవేటు అన్ ఏ డె డ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా ప్రవే శం కల్పించడం ద్వారా తమ ధైన o దిన కర్తవ్యాన్ని గుర్తిస్తే మంచిది. సుప్రీంకోర్టు ఒక వైపు పాఠశాలలను హెచ్చరిస్తూనే ప్రభుత్వాలను మందలించిన తీరు పాలకులకు కనువిప్పు కావాలి. కానీ తాము చేసిన చట్టాలను తామే అమలు చేయక 17 సంవత్సరాలు సునాయాసంగా గడిచిపోయిన ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలు తమ ఓట్ల ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకున్నటువంటి పేద ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు? పెట్టుబడిదారీ వర్గాలకు అప్పులను రద్దు చేయడం, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం, ప్రశ్నించిన వాళ్లను నేరస్తులుగా చిత్రీకరించి జైల్లో వేయడం, దశాబ్దాలుగా విచారణ లేకుండానే విచారణ ఖైదీలుగా శిక్షలు అనుభవించినటువంటి ఈ దేశంలో న్యాయం నత్త నడక నడుస్తుందని అందరికీ తెలుసు.
ప్రభుత్వాలు ఈ అసమర్థత తప్పుడు పనులకు సమాధానం చెప్పుకోలేక న్యాయం అన్యాయాన్ని వ్యాఖ్యానించలేని పరిస్థితిలో ఈ దేశంలో కోర్టులు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు పాలకుల ఆధిపత్యం ఏ మేరకు కొనసాగుతున్నదో. చట్టం చేసినందుకైనా, సుదీర్ఘ కాలయాపన జరిగినందుకైనా, భారత సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినందుకైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విద్యా వ్యవస్థ పైన దృష్టి సారించి సత్తా ఉంటే ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించాలి .ఆ చిత్తశుద్ధి లేకపోతే కనీసం పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో ప్రైవేటు పాఠశాలల లో చట్టం మేరకే 25 శాతం సీట్లలో ఆ విద్యార్థులకు అవకాశం కల్పించడం ద్వారా తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. చట్టాన్ని అమలు చేయలేదంటే, పేద వర్గాలకు న్యాయం అందలేదంటే, మాట్లాడిన మాటకు ఆచరణకు పోసగని తేడా ఉన్నదంటే తానెక్కిన కొమ్మను తానే నరుక్కున్నట్లు అనే చందంలో ఈ దేశ పాలకవర్గాలు ఉన్నాయని అనుమానించక తప్పదు. సుదీర్ఘకాలం తర్వాత విప్లవాత్మక తీర్పును సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వడం ఒక అంశం అయితే ప్రభుత్వాల యొక్క స్పందన పైన ఈ తీర్పు యొక్క ప్రభావం, ప్రజల యొక్క పోరాటపటిమ, న్యాయ వ్యవస్థను మళ్లీ మళ్లీ ప్రశ్నించే చైతన్యం సర్వ వ్యాపితమైనప్పుడు మాత్రమే విద్యాహక్కు చట్టానికి ఒక అర్థం ఉంటుంది. ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన విద్యను అందించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పాలకవర్గాలు కనీసం గానైనా ఈ స్థాయికి సర్దుబాటు అయితే జనం, మేధావులు, బుద్ధి జీవులు, ఉపాధ్యాయులు కొంతవరకైనా సంతోషిస్తారు. తమలోసుగులను లోపాలను అవినీతిని గుర్తించి నిర్లక్ష్యాన్ని బాధ్యతారాహిత్యాన్ని ఇప్పటికైనా పాలకులు అంగీకరిస్తే ప్రజలకు భిన్న వర్గాలకు కొంతవరకైనా మేలు జరుగుతుంది. నాలుగు రోజుల తర్వాత ఈ ప్రకటన ఎక్కడో తారుమారైపోతే, సుప్రీంకోర్టు తీర్పు మసక బారిపోతే, మళ్లీ పాత పాటే కొనసాగితే ఇక ఈ తీర్పుకు నాటి చట్టానికి రాజ్యాంగ ఆదేశానికి అర్థం ఏముంటుంది?
(ఈ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు, అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ )