ఎన్ టి ఆర్ కు భారతరత్న ఇవ్వాలి
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్ది రెడ్డి రాజా
ఎన్టీఆర్ జీవితం భావితరాలకు ఆదర్శం
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్ది రెడ్డి రాజా
నేరేళ్ల మధు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
సూర్యాపేట 29 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట: మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీనీ నటులు నందమూరి తారక రామారావుకు వచ్చే జయంతి వరకు భారతరత్న ఇవ్వాలని, ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శప్రాయమని ఎన్టీఆర్ అభిమాని, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని నల్లాల బావి చౌరస్తా నందు డిసిసి కార్యదర్శి, ఎన్టీఆర్ అభిమాని నేరేళ్ళ మధు గౌడ్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103 వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని దేవుడి పాత్ర ఏదైనా ఆ పాత్రకు వన్నె తేవడమే కాక, ఆ రూపం నిజమైన దేవుడేనని నమ్మేంతగా పాత్రలో ఒదిగిపోయే వ్యక్తి ఎన్ టి ఆర్ అని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రజల అవస్థలను తెలుసుకుని తాలుకాలను రద్దు చేసి, మండలాలుగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తి ఆయన అని, క్రమశిక్షణకు మారుపేరు, ఆయన పేరంటేనే ఒక విప్లవం అని పేర్కొన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి సేవలను గుర్తించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ భారతరత్న ఇవ్వాలన్నారు. తెలుగు జాతి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహనీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రటరీ పెద్దిరెడ్డి కళ్యాణ్, డిసిసి కార్యదర్శి షేక్ మీరా, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలెబోయిన నర్సయ్య, కొండగడుపుల సూరయ్య, శ్రీపాది శంకర్, పొదిళ హరి, జితేందర్, బాణాల హరి, ఎల్గూరి వెంకటేశ్వర్లు, కొండా రాజేష్, నేరెళ్ల నరేష్, జాని మీయా, గుణగంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.