పాదయాత్ర ను జయప్రదం చేయండి
జూన్2వ తేదీ నుండి సూర్యాపేట పట్టణ సమస్యల పరిష్కారంకై జరుగు సీపీఐ (ఎం-ఎల్ ) మాస్ లైన్ "పాదయాత్ర" ను జయప్రదం చేయండి.
కొత్తపల్లి శివకుమార్ సీపీఐ (ఎం-ఎల్ ) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి
సూర్యాపేట 29 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం జూన్ 2వ తేదీ నుండి సిపిఐ (ఎం.ఎల్)మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలంటూ సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ అలుపెరగని ఉద్యమ పోరాటాలతో రాటు తేలిన, ఎట్టి పనులు చేసే మట్టి జీవులకు పోరాటాల పాలు తాపిన, ఎందరో ఉద్యమకారులకు జన్మనిచ్చిన సూర్యాపేట నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నదని, సమస్యల పరిష్కారం కోసం మరొకమారు ఉద్యమాల బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైనదని ఆయన అన్నారు. నాటి అమరవీరులు అందించిన ఉద్యమ స్ఫూర్తిని మదినిండా తలుచుకొని, ఈనాటి సమస్యలపై ప్రతి ఒక్కరు గల మెత్తవలసిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడినారు.
అభివృద్ధి పేరుతో జనావాసాల మధ్య విషవాయువులు వెదజల్లుతున్న ఫ్యాక్టరీలు ఒకవైపు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ఆలస్యంతో అతుకుల గతుకుల రోడ్ల మధ్య కాళ్లు చేతులు విరగొట్టుకుంటున్న జనాభా గోడుతో మరొకవైపు నేడు సూర్యాపేట ప్రజలు సతమతం అవుతున్నారని అన్నారు. వాయు కాలుష్యం, జల కాలుష్యంతో రోగాల బారిన పడిన పీడిత ప్రజలు హాస్పిటల్ కి వెళ్ళగానే ప్రభుత్వ హాస్పిటల్స్ లో సమస్యలు దర్శనమిస్తాయని, ప్రైవేట్ హాస్పిటల్స్ లో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందని ఆయన అన్నారు. ఆరుగాలం కష్టపడి, రెక్కలు ముక్కలు చేసుకొని తనలాగా తమ పిల్లలు కష్టపడకూడదు అని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షిస్తున్న తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల,కళాశాలలో నిలువు దోపిడీకి గురవుతున్నారని ఆయన ఆవేదన చెందారు. పొట్ట పోషణ కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న చిన్న చిన్న వ్యాపారస్తులకు అడ్డాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇవేగాక పట్టణంలో అనేక దైనందిన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను కలిసి ఆ సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసుకోవడం కోసం జూన్2వ తేదీ నుండి పట్టణంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమం జరుగుతున్నదని, ఈ పాదయాత్రను ప్రారంభించుటకు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, నిజాయితీకి నిలువెత్తు ఆదర్శమైనటువంటి కామ్రేడ్ గుమ్మడి నరసయ్య గారు వస్తున్నారని ఆయన తెలియజేశారు. కావున ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్ర జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జూన్ రెండవ తేదీ ఉదయం 10 గంటలకు కొత్త బస్టాండ్ నుండి మున్సిపాలిటీ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుందని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎర్ర అఖిల్ కుమార్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపికెఎంఎస్) రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పేర్ల నాగయ్య, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు భీమనపల్లి ప్రకాష్, పార్టీ నాయకులు మోహన్, కట్ట రమేష్, వేణు, శ్రీనాద్,పద్మ, తదితరులు పాల్గొన్నారు.