పరస్పర విమర్శల్లో  అధికార ప్రతిపక్షాలు  సమస్యలు గాలికి...

May 28, 2026 - 15:11
 0  1

. నాటి బి ఆర్ ఎస్ నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలది  ఆర్టీసీ ఉద్యోగుల పట్ల అదే ధోరణి.*  నేరం చేసినోడే ఇతరుల నేరస్తుడు అన్నట్లుoది  బి ఆర్ ఎస్ వైఖరి.

----  వడ్డేపల్లి మల్లేశం

ప్రభుత్వాల దొరణులు ప్రచారాలు,  ప్రజలను బలి పశువుల చేసే తీరు, ప్రజా వ్యతిరేక వైఖరి,  వాస్తవాల కప్పిపుచ్చే పద్ధతులు,  ప్రశ్నించే వాళ్ళ అణచివేసే  మూస ధోరణి  నాటినుండి నేటి వరకు నిరంతరం కొనసాగుతూ  ప్రస్తుతం  తారాస్థాయికి చేరుకున్నదన డములో అతిశయోక్తి లేదు  ప్రజా శ్రేయస్సు మరిచిన రాజకీయ పార్టీలు  తమ విధానాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా  ఇతరుల పైన దాడులకు పాల్పడడం,  తప్పుడు వైఖరిని  ప్రచారాన్ని ముమ్మరం చేయడం,  అవినీతి పద్ధతుల ప్రోత్సహించడంతోపాటు ప్రజలను  యాచించే స్థితిలోనే  కొనసాగే విధంగా  జాగ్రత్త పడడం అనేది  రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య.  నేడు ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే మరొక పార్టీ ప్రతిపక్షంలో ఉండవచ్చు కానీ  ఈ రెండు  పార్టీలు కూడా స్థానాలు మారినప్పటికీ అదే ధోరణి అవలంబించడం అంటే  వీటికి ప్రత్యేకమైన వైఖరి, ప్రజల పట్ల  ప్రజా పాలన పట్ల ఆసక్తి, నిజమైన పరిపాలనకు  నిర్వచనం ఇచ్చే ధోరణి  లో మాత్రం  తేడా అంటూ ఏమీ లేదు అవకాశవాద వైఖరి తప్ప.   బంగారు తెలంగాణ పేరుతో బిఆర్ఎస్ దశాబ్దం పాటు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే  ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ గత రెండు సంవత్సరాలుగా  "ప్రపంచం తోనే పోటీ పడతాం,  అనే నినాదంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం  చేయడాన్ని మనం గమనిస్తున్నాం. మరొకపక్క ఆంధ్రప్రదేశ్లో అక్కడి ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ వర్గాలు  "సంపదను పెంచుదాం సంపదను ప్రజలకు పంచుతాం  సంపదను సృష్టించడమే మా నిజమైన పాలసీ "అంటూ  ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో లీనమైనా రు. ప్రాంతాలు  రాజకీయ పార్టీలు వేరైనా  వాటి ఆలోచన ధోరణి మనుగడ  ఒకే రకంగా ఉండడాన్ని ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది. ""ప్రధానమైన ప్రజల సమస్యలను గాలికి వదిలివేసి,  ప్రభుత్వాలపైన ఆధారపడే విధంగా  ప్రజలను దిగజార్చి,  ఇక ప్రశ్నించే అవకాశం లేకుండా రెక్కలు విరిచి,  అంతో ఇంతో ప్రజలకు అండగా ఉన్నటువంటి మేధావులు బుద్ధి జీవులు ప్రజాసంఘాలను  నిర్వీర్య పరచడంతో పాటు  అణచివేసే ధోరణి  అవలంబించడం వలన  ప్రజల సమస్యలు పరిష్కరించ బడకపోగా  మరిన్ని కొత్త సమస్యలు పుట్టుక రావడంతో  ప్రజలు అంధకారంలోకి నెట్టి వేయబడుతున్నారు"". పేరుకు ప్రజా పాలన అంటూ  తెలంగాణ రాష్ట్రంలోనైతే టిఆర్ఎస్ పాలన నాటి  ఇనుప కంచెను  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బద్దలు కొట్టి   స్వేచ్ఛ స్వాతంత్రాలకు  ప్రజల సమస్యల పరిష్కారానికి  ఎల్లవేళలా ప్రజలకు అవకాశం ఉంటుందని  చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు  ప్రజా సమస్యల పరిష్కారంలో పోరాడుతున్నటువంటి ప్రజాసంఘాలు అఖిలపక్షాల  వెన్ను విరిచే ప్రయత్నం చేస్తూ,  ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం,  ప్రశ్నిస్తే  లాకప్ లో వేయడం, ఇంకా నిరసనలు  సమ్మెలు చేస్తే అడ్రస్ లేకుండా చేయడం  అంటే ఇది ప్రజా పాలన ఎలా అవుతుందని సామాన్యులు ప్రశ్నిస్తుంటే మేధావులు సమాధానం చెప్పలేక వా పోతున్నారు.  పేదలు, అణగారిన వర్గాలు,అండలేనటువంటి వాళ్లకు అండగా నిలబడుతున్నటువంటి ప్రజాసంఘాల నాయకులను  బెదిరించడం, లొంగదీసుకోవడం, అరెస్టు చేయడం, చిత్రవధలకు గురి చేయడంతో పాటు అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజా పాలనకు ఇచ్చినటువంటి నిర్వచనం పూర్తిగా కనుమరుగవుతుo టే  ఈ విషయాన్ని పాలకులు  ఆలోచించుకుంటే మంచిది. 

టిఆర్ఎస్ కాంగ్రెస్  రెండు పార్టీలది అదే వైఖరి  :

ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, దానికి దారి తీసిన పరిస్థితులు, వాళ్ల డిమాండ్లను ప్రభుత్వాలు పరిష్కరించకపోవడం, దాటవేసే ధోరణి అవలంబించడం  వల్ల  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో  ప్రభుత్వ వర్గాలు సమస్యను తాత్సరం చేస్తూ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం ఒక రకమైతే  ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ  కార్మికులకు అండగా ఉంటామని,  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల చావులకు కారణం కాకూడదని,  మీ వెంటే ఉంటామని  నమ్మబలికే ప్రయత్నం చేస్తూ ఉన్నది.  కానీ టిఆర్ఎస్ హయాంలో 2020 డిసెంబర్ ప్రాంతంలో  సుమారు 50 రోజులకు పైగా ఆనాడు ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె  సందర్భం కూడా దాదాపుగా ప్రభుత్వంలో విలీనం చేయాలని బకాయిలను విడుదల చేయాలని పి ఆర్ సి, డి ఏ లను మంజూరు చేయాలనే ప్రధాన డిమాండ్లు  నెలకొన్నవేళ  ఆనాటి ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్య  తో చర్చించడానికి అంతవరకూ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక సంఘాలను  రద్దుచేసి ప్రజా ద్రోహిగా మిగిలిపోయిన సంగతి మనకు తెలుసు.
  అంతేకాదు  ఆనాడు కూడా ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని  పెద్ద ఎత్తున ప్రచారం అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆనాడు కూడా సుమారు 30 మందికి పైగా కార్మికులు  ఆత్మ బలిదానాలకు పాల్పడినా కూడా 50 రోజులపాటు సమ్మెలో జోక్యం చేసుకోకుండా సమస్యలు పరిష్కరించకుండా కార్మిక సంఘాలను రద్దుచేసి  చివరికి ముఖ్యమంత్రి కార్మికులందరిని ఆహ్వానించి భోజనం వడ్డించి  మీ సమస్యలు పరిష్కరిస్తానని తీయని కబురు చెప్పి చల్లగా పంపించిన విషయం మనందరికీ తెలుసు.అంటే  నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సమస్యలనైతే ఎదుర్కొంటున్నదో అదే సమస్యలు ఆనాడు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచితే  50 రోజుల సమ్మెలో జరగరాని అనర్థాలు జరిగిపోయిన కూడా కనికరము లేని బిఆర్ఎస్  నాయకులు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాన్ని  నిర్లక్ష్య ధోరణి నీ ఖండిస్తూ మీ వెంట ఉన్నామని కార్మికులకు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది అవకాశవాదం కాదా? ప్రజలు  కార్మిక సంఘాలను కూ లదోసి  నియంతృత్వంగా వ్యవహరించిన టిఆర్ఎస్ పార్టీ  నేడు కార్మికులకు ఏ రకంగా  మద్దతు ఇస్తుందో అర్థం కాదు.  పైగా కార్మికులకు మద్దతు ప్రకటిస్తూ  ప్రభుత్వ ధోరణిని ఖండించే నైతిక హక్కు టిఆర్ఎస్ పార్టీకి ఎక్కడిది అని  ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు.

అంటే  కార్మికుల హక్కులకు సంబంధించిన పరిస్థితులలో  కాంగ్రెస్  టిఆర్ఎస్ పార్టీలది ఒకే వైఖరి అని అర్థమవుతుంది.  తమ వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి  కార్మికులకు మద్దతు పలకడమే కానీ వాళ్ళ హయాములో నిర్వహించిన పాత్ర, చేసిన అన్యాయం ఎవరికీ తెలియదు?  చివరికి కార్మిక సంఘాలను పునరుద్ధరించకుండా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండానే  టిఆర్ఎస్ హయాంలో సమ్మె  ముగిసింది. పైగా కార్మికుల బలిదానాలు  ఆగలేదు.  అలాంటి టిఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతము  మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది.?

ఇక టిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో  ఆర్టీసీ కార్మికులకు జరిగిన  నష్టాన్ని పరిశీలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు ప్రభుత్వ హయాంలో  అదే తప్పులకు పాల్పడితే  ఏ రకంగా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది? పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతోపాటు పిఆర్సి ని అమలు చేయడం  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కార్మిక సంఘాలను పునరుద్ధరించడం వంటి  ప్రధాన డిమాండ్లతో సమ్మె చేస్తున్న సందర్భంలో  ప్రస్తుత ప్రభుత్వం  స్పష్టమైన వైఖరి అవలంబించకుండా  దాటవేసే ప్రయత్నం చేసి సమ్మె వరకు  తీసుకువచ్చి సమ్మె  తొలిరోజున్నే  నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చేయడం తెల్లవారే మృత్యువాత పడటం దేనికి సంకేతం?  ఇక తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు ప్రభుత్వ క పక్షం కూడా అదే మాట వల్లిస్తున్నదంటే  చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే ఉంది కదా!  ప్రధానమైన ఒకటి రెండు డిమాండ్స్ పక్కన పెడితే ఆర్థికపరమైన సర్దుబాటుకు సంబంధించిన అంశాల పట్ల అవగాహనతో స్పష్టమైన హామీ ఇచ్చి  సమ్మెను విరమింప చేయవలసినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉండే. కానీ  నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం, ఒకవైపు ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం జరిగితే  మరొకవైపు ఆర్టీసీ మీద ఆధారపడినటువంటి ప్రయాణికులకు ఎంతో ఇబ్బందులు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే సంవత్సరానికి 6000 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా  ప్రభుత్వం నష్టపోతుంటే  ఈ సమ్మె కారణంగా ఒకవైపు ప్రజలకు  ఇబ్బందులు కలిగించడంతోపాటు ప్రభుత్వానికి ఆర్టీసీ కూడా నష్టం వస్తుంటే ఎవరి ప్రయోజనం కోసం ఈ సమ్మె అని  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.

 ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి  కార్మిక సంఘాలను పునరుద్ధరించి ప్రజా పాలన అనే  తమ నినాదానికి  రుజువుగా నిలవాల్సిన అవసరం  ఉంది.  అలాగే ఆర్థికపరమైనటువంటి  పి ఆర్ సి, డి ఏ ల వంటి ఆర్థికపరమైన అంశాలను  ఆమోదించి  అమలు చేయడంతో పాటు  ప్రభుత్వంలో విలీనం అనే సమస్య పైన సుదీర్ఘంగా ఆలోచిస్తామని హామీ ఇవ్వడం ద్వారా ఆర్టీసీ సమ్మెను నివారించే అవకాశం ప్రభుత్వానికి వుంది.  ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా   కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించడం, శాశ్వత విషయాల మీద  నిర్ణయానికి కమిటీ వేయడం ద్వారా  ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించితే  కాంగ్రెస్ ప్రజా పాలన అనే దానికి కొంతవరకైనా అర్థం ఉంటుంది. ఇక పోలీసు బలగాలతో  ఉద్యమాలను అణిచివేయడం, డిపోలను  బస్టాండ్లను పోలీసులతో నింపడం,  నాయకులను ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడం  వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడకుండా ఉంటే  నిజమైన ప్రజాపాలనకు అర్థం ఉంటుంది. టిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి నిరంకుశ సాచివేత వైఖరిని  అంగీకరించని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు  ప్రజలకు ఇచ్చిన హామీని ప్రభుత్వాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. టిఆర్ఎస్ హయాంలో  ఆర్టీసీ కార్మికులకు  జరిగిన నష్టాన్ని  ఎత్తి చూపడం ద్వారా టిఆర్ఎస్ పార్టీని ఖండిస్తూ  దానికి అతీతంగా తాము ప్రజాస్వామిక వాదులమని  ఆర్టీసీ కార్మికుల హక్కులను పరిరక్షిస్తామని  ప్రజా పాలనే మా ధ్యేయమని  మా విధానమే సాక్ష్యం అని నమ్మించే స్థాయిలో  ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తే బాగుంటుంది.  

అంతేకాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కార్మికుల పట్ల అవలంబించిన వైఖరిని  నేడు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ఘాటుగా విమర్శించి  మాకు ఒక స్పష్టమైన విధానం ఉన్నదని  రుజువు చేసుకోగలిగితే బిఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న తేడాను ప్రజలు ఆర్టీసీ కార్మికులు ప్రజాసంఘాలు గుర్తించే అవకాశం ఉంటుంది. పాలనలో  రెండు రాజకీయ పార్టీలకు తేడా లేకుండా ఉన్నప్పుడు  ప్రజలు రాజకీయ పార్టీలను విమర్శిస్తూనే ఉంటారు.  వాళ్ల ప్రయోజనాల ముందు పార్టీల ప్రయోజనం  ఎంత అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇక ఆర్టీసీ వ్యవస్థలో మాటిమాటికి  ఇంక్రిమెంట్ కోత, సస్పెన్షన్లు,  పనిష్మెంట్లు  నిరంతరం మమ్ములను వేధిస్తున్నాయని అంటున్న కార్మికుల  ప్రశ్నలకు కూడా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. వరంగల్ జిల్లా నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్  ఆత్మబలిదానం చేసుకుంటే ఆ కార్యక్రమంలో హాజరు కావడానికి వెళుతున్నటువంటి విశారదని మహారాజ్  ఇతర రాజకీయ పార్టీల ప్రజాసంఘాల నాయకులను ఎక్కడికి అక్కడ అరెస్టు చేసినట్లుగా  వస్తున్న వార్తలు ప్రజాస్వామ్య విధానానికి పూర్తి విరుద్ధమైనవి. ఉద్యోగులకు సానుభూతిని చూపడం,  వాళ్ల పోరాటాలకు మద్దతు ఇవ్వడం రాజకీయ పార్టీల యొక్క కనీస బాధ్యత. అందులో జోక్యం చేసుకునే  అధికారం లేదా అవకాశం ప్రభుత్వాలకు ఉండవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఇచ్చిపుచ్చుకునే రీతిలో ప్రభుత్వాలు వ్యవహ రిస్తే కార్మిక సంఘాలు కూడా  అంతే స్థాయిలో అవలంబిస్తాయి.

అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల ఉద్యోగుల సమస్యలను కూడా  చాలా కాలంగా పెండింగ్లో ఉంచుతూ  పెన్షనర్లు సుమారు 70 మందికి పైగా చనిపోయినారంటే  కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలది ఒకటే వైఖరి అని ప్రజలు  ఉద్యోగ వర్గాలు  అనుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంది. అలాంటి అవకాశాన్ని ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తే  విమర్శను తట్టుకోక తప్పదు అది ఎన్నటికైనా ప్రభుత్వ వర్గాలకు ప్రమాదమే. ఇక తన హయాo లో ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ఇతరుల పట్ల ఉక్కు పాదం మోపిన  టిఆర్ఎస్  ప్రభుత్వం  ఆ పార్టీ వర్గాలు ప్రస్తుతము కాంగ్రెస్ను  నిందించడం అంటే  నేరస్థుడే  తోటి వాళ్లను  నేరస్తులని విమర్శించినట్లుగా ఉన్నది.   ప్రభుత్వం  ప్రతిష్టకు పోకుండా  మంత్రుల స్థాయిలో  కార్మిక నాయకులతో చర్చలు జరిపి  సమస్యలను పరిష్కరించి  ప్రజలకు చేరువ కావడానికి కృషి చేయడం చాలా అవసరం. లేకుంటే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె  దాని పరిణామాలు ప్రజా దృక్పథం మీద  ఎంతో ప్రభావం పడే అవకాశం ఉంటుంది తద్వారా ప్రభుత్వ ప్రతిష్ట  పడిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333