గుంతలు తవ్వారు.. కేబుల్ లాగారు.. పూడ్చడం మరిచారు!

Aug 21, 2026 - 10:39
Aug 21, 2026 - 10:45
 0  1
గుంతలు తవ్వారు.. కేబుల్ లాగారు.. పూడ్చడం మరిచారు!
గుంతలు తవ్వారు.. కేబుల్ లాగారు.. పూడ్చడం మరిచారు!

నెల రోజులు గడిచినా గుంతలు పూడ్చని వైనం.

ప్రజలు, వాహనదారుల భద్రతపై అధికారుల నిర్లక్ష్యం.

 జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- పట్టణంలోని కృష్ణారెడ్డి బంగ్లా నుంచి రాఘవేంద్ర కాలనీ వరకు అండర్‌గ్రౌండ్ కేబుల్‌ కోసం తవ్విన గుంతలు ప్రజలకు, వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. కేబుల్‌ వేసేందుకు గుంతలు తవ్వి దాదాపు నెల రోజులు గడుస్తున్నా వాటిని పూడ్చకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేబుల్‌ పనులు పూర్తయిన తర్వాత గుంతలను వెంటనే పూడ్చి రహదారిని ప్రయాణానికి అనువుగా చేయాల్సి ఉండగా, సంబంధిత కాంట్రాక్టర్‌ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు, సంబంధిత కౌన్సిలర్‌, వార్డు అధికారులు సైతం సమస్యను పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణారెడ్డి బంగ్లా సమీపంలో గద్వాల చీరల వ్యాపారం కోసం ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వ్యాపారులు, వినియోగదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి రద్దీ ప్రాంతంలో రోడ్డుపై గుంతలు అలాగే ఉండటంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, చిన్నారులు ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక గద్వాలలో చిన్న వర్షానికే రోడ్లపైకి మురుగునీరు చేరే పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ఈ గుంతల్లో నీరు చేరితే అవి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం మరింత పెరుగుతుందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి సంబంధిత మున్సిపల్‌ అధికారులను ఆదేశించి, కేబుల్‌ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌తో గుంతలను వెంటనే పూడ్చించి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేబుల్‌ వేయడం ఎంత ముఖ్యమో, పనులు పూర్తయిన తర్వాత రోడ్డును యథాస్థితికి తీసుకురావడం కూడా అంతే బాధ్యత అనే విషయాన్ని సంబంధిత అధికారులు గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State