గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు అవసరం.
అధికారులతో సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ.
జోగులాంబ గద్వాల 1సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గణేష్ ఉత్సవా లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలు, నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లపై కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. డివిజన్, మండల స్థాయిలోనూ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వహకులతో సంబంధిత అధికారులు సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేయాలన్నారు. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యుత్ శాఖ అధికారులతో నిర్వాహకులు సేఫ్టీ సర్టిఫికేషన్ తీసుకునేలా చూడాలన్నారు. వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించే సమయంలోనూ కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తా నుంచి నది అగ్రహారం వెళ్లే దారిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో బీచుపల్లి, నది అగ్రహారంలోనీ కృష్ణానది వద్ద పెద్ద సంఖ్యలో నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో అక్కడ ముఖ్యమైన రోజుల్లో క్రేన్సుతోపాటు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. లైటింగ్, భారీ కేడ్స్ కూడా అవసరమని, ప్రధాన రహదారుల్లో గతుకులు లేకుండా మరమ్మత్తులు చేయించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. నిమజ్జనం రోజుల్లో నిర్దేశిత సమయాల్లో మద్యం దుకాణాలను మూసివేయడం అవసరమని, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా పోలీస్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. వినాయక మండపాల వద్ద రాత్రి 10 గంటల తర్వాత మైక్ శబ్దాలు ఉండరాదని, ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యాసంస్థల సమీపంలో డీజే సౌండ్స్ లేకుండా చూడాలన్నారు. శానిటేషన్, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలు, తదితర అన్ని విషయాల్లో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి జిల్లాలో వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేలా పనిచేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామన్నారు. బీచుపల్లిలోని కృష్ణా నది వద్ద నిమజ్జనం చేసేందుకు జిల్లా నుంచే కాకుండా వనపర్తి, కర్నూల్, మహబూబ్ నగర్ వంటి దూర ప్రాంతాల నుంచి కూడా విగ్రహాలు తీసుకొస్తుంటారని, అక్కడ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై పలుచోట్ల రోడ్డు పనులు జరుగుతుండడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సూచిక, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. ఆయా శాఖల అధికారులతో వాట్స్అప్ గ్రూపుల సహాయంతో వివిధ ప్రాంతాల్లోని వినాయక ఉత్సవాల పరిస్థితులపై సమీక్షించేలా చూస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను, హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.