కోల్కత్తా వైద్యురాలి అత్యాచారం  భారత సమాజానికి ఓ సవాల్.

Aug 28, 2024 - 22:31
 0  5

పసి మొగ్గల తో సహా రోజుకో సంఘటన  సిగ్గుతో తలవంచుకోవలసిన

దుస్థితికి దర్పణం పడుతుంది.

ప్రజా ఆందోళన,  సిబ్బంది ఆగ్రహముతో కదిలిన  

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ.

సంఘటనకే పరిమితం కాకుండా కఠిన చర్యలుoడాలి

---వడ్డేపల్లి మల్లేశం 

దశాబ్దం క్రితం ఢిల్లీలో నడుస్తున్న బస్సులో జరిగిన  నిర్భయ  అత్యాచార ఘటన  గత నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాదులో జరిగిన దిశ  అత్యాచారం హత్య కేసులు  దేశవ్యాప్త సంచలనాన్ని  కలిగించిన విషయo  అందరికీ తెలుసు.  ఈ రెండు సంఘటనల తర్వాత ప్రత్యేక చట్టాలు  మహిళల రక్షణ కోసం ఏర్పడినప్పటికీ  నిరంతరం  పసి కూనల నుండి పండు ముసలి వరకు అత్యాచారాలకు ఎందరో బలవుతూనే ఉన్నారు  ఇందులో ఎక్కువ భాగం పరిచయమున్న, తెలిసిన , సంబంధము కలిగిన కుటుంబాల వారే అని  నిర్ధారణకు రావడం జరిగింది.  9వ ఆగస్టు  2024  ఉదయం 3 నుండి 5 ప్రాంతంలో    పశ్చిమ బెంగాల్లోని అర్జీకర్ ప్రభుత్వ  మెడికల్ కళాశాల హాస్పిటల్ లో జరిగినటువంటి  పోస్టు గ్రాడ్యుయేట్  వైద్యురాలి  అత్యాచారం హత్య ఉదంతం దేశవ్యాప్త సంచలనాన్ని  కలిగిస్తుంటే  ప్రజల ఆందోళనలు, వైద్యుల యొక్క నిరసనలు,  ప్రజా సంఘాలు అఖిలపక్షాలు మహిళా సంఘాల యొక్క  ఉద్యమ బాట  రగిలించిన విప్లవాగ్ని నుండి   బెంగాల్ ప్రభుత్వము సుప్రీంకోర్టు కూడా  స్ఫూర్తిని పొంది తగు చర్యలకు ఆదేశించిన విషయాన్ని  మనం గమనించాల్సి ఉంటుంది . 15వ ఆగస్టు నాడు వైద్య బృందం చేసిన నిరసన పైన మూకుమ్మడి దాడులకు పాల్పడినటువంటి అరాచక వాదుల   ఆకృత్యాలనుండి బయటపడి  17వ తేదీన పెద్ద మొత్తంలో దేశవ్యాప్త పోరాటాలకు రూపం ఇచ్చిన అనంతరం  తీరికగా పశ్చిమబెంగాలు ప్రభుత్వం  తీసుకున్న నామమాత్రపు చర్యలతో కూడుకున్నటువంటి  నివేదికను  సర్వోన్నత న్యాయస్థానానికి  22 ఆగస్టు 2024 వ తేదీన సమర్పించినట్లుగా  తెలుస్తుంటే అదే రోజున సిబిఐ తన మధ్యంతర నివేదికను కూడా సర్వోన్నత కోర్టుకు అందించడం గమనించాలి .
      9వ తేదీన జరిగిన ఈ సంఘటనతో  తాత్కాలికంగా స్పందించిన కళాశాల ప్రిన్సిపల్  ఆత్మహత్యగా చిత్రీకరించి  తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంటే వెంటనే రాజీనామా చేసి మరొక కళాశాలకు  ప్రిన్సిపల్ గా పోవడానికి అనుమతిచ్చినటువంటి  ప్రభుత్వం యొక్క చర్యలను కూడా సందేహించవలసి వస్తున్నది.  ఒక దుస్ సంఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు దర్యాప్తు పరిశీలనను వేగవంతం చేసే బదులు ప్రభుత్వం అక్కడి నుండి బుద్ది పూర్వకంగానే ప్రిన్సిపాల్ ను తప్పించినట్లుగా ప్రజా సంఘాలు అఖిలపక్షాలు ఘాటుగా విమర్శిస్తుంటే  ప్రభుత్వము నుండి స్పందన రాలేదని విమర్శ ఉండనే ఉన్నది.  అతిపెద్ద మెడికల్ కళాశాల ఆసుపత్రిలో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి కొన్ని పూర్వాపరాలను గమనించినప్పుడు ప్రతి వ్యవస్థ కూడా ప్రైవేటు రంగంలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది  .పోలీసు రక్షణ  కూడా  ప్రైవేటు విభాగంలో కొనసాగుతుంటే అందుకు సంబంధించిన వ్యక్తి ఈ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ఆలస్యంగా  గుర్తించడం అరెస్టు చేయడాన్ని మనం గమనించాలి  .30 నుండి 36 గంటల విధి నిర్వహణలో మునిగి తేలుతూ అతి  అలసటకు గురైనప్పటికి కూడా  కనీస మైనటువంటి విశ్రాంతి తీసుకునే అవకాశాలు లేనటువంటి వ్యవస్థలో ఈ దేశంలోని వైద్యశాలలున్నట్టు తెలుస్తుంటే  రెండు గంటల ప్రాంతంలో  సెమినార్ హాల్లోనే విశ్రాంతి తీసుకుని సమయంలో ఈ సంఘటన జరిగినట్లు  తెలుస్తున్నది. అయితే అక్కడ జరిగినటువంటి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కనీసం ముగ్గురికి పైగా  అత్యాచారం జరిపి ఉండవచ్చు అని సందేహిస్తుంటే మరికొందరు పదిమంది వరకు  సామూహిక దాడి జరిగినట్లు తెలుస్తున్నది.  ఇలాంటి  దయనీయ సంఘటనను తల్లిదండ్రులు  పచ్చబెంగాల్ హైకోర్టులో  తమ బిడ్డ దుస్థితి పైన సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేసేంతవరకు కూడా న్యాయవ్యవస్థ గాని పాలకులు గాని పట్టించుకోకపోవడం విచారకరo . సంఘటన యొక్క తీవ్రతను ప్రజా ప్రతిఘటనను  సిబ్బంది డాక్టర్ల యొక్క దేశవ్యాప్త సమ్మెకు స్పందించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం  ఆలస్యంగానైనా సుమోటోగా తీసుకోవడాన్ని  (20..08..24)అభినందించవలసిన అవసరం ఉంది వెంటనే  కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ ప్రత్యేక   టాస్క్ ఫోర్స్ కు  ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయడంతో పదిమంది  సభ్యులు గల బృందం విచారణ కోసం ఏర్పడినట్లు తదనంత చర్యల కోసం  ప్రతిపాదించినట్టు తెలుస్తుంటే  రెండు మాసాల వ్యవధి లోపల సంపూర్ణమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించడాన్ని  గమనించినప్పుడు కాగితాల మీద జరినంత పని  క్షేత్రస్థాయిలో జరగడంలేదని తెలుస్తున్నది.  ప్రిన్సిపాల్ తప్పుడు నివేదిక వెంటనే  బదిలీ కావడం, పోలీసుల యొక్క జాప్యం,  పెద్ద ఎత్తున నిరసన వచ్చేంతవరకు కూడా చర్యలు లేకపోవడం,  కేంద్రం కూడా కనీసం స్పందించకపోవడం  సమాజంలో మానవత్వం మచ్చుకు కూడా లేకుండా పోతున్నదని చెప్పడానికి ఆస్కారమేర్పడుతున్నది  .ఈ సంఘటన జరిగి పది రోజులు అయినదో లేదో  ఆగస్టు 20వ తేదీన  మహారాష్ట్రలో పాఠశాల  వ్యాన్ డ్రైవర్ ఇద్దరు చిన్నారుల పైన లైంగిక దాడికి పాల్పడినట్లు  ప్రకటన రానే వచ్చింది అంతేకాదు అనేకచోట్ల దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలోనే ఎన్నో సంఘటనలు జరిగినట్లు మీడియా పత్రికలు ప్రసార మాధ్యమాల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం.  విచారణ పేరుతో కాలయాపన చేయడంతోనే  ప్రచారం ఎక్కువవుతున్నది కానీ చర్యలు నామమాత్రం కావడంతో  వ్యక్తుల్లో కామాందులలో మానసిక పరివర్తన అంతగా రావడం లేదు . అంతేకాదు కలకత్తాలో అరెస్టు చేయబడినటువంటి  వ్యక్తి కూడా  ఉరితీస్తారా తీయండి అని ఘాటుగా స్పందించడాన్ని బట్టి  అత్యాచారాలు హత్యలు, దోపిడీలు దాడులకు ఉన్నంత ఇష్టము ప్రేమ సామాజిక బాధ్యత  సమాజమనుగడపట్ల లేదని మనకు తెలుస్తున్నది. అయినప్పటికీ ఇలాంటి విషయాల లో సంఘటన వరకే పరిమితమై చర్యలు ఉంటున్నాయి తప్ప శాశ్వత ప్రాతిపదిక పైన  కార్యక్రమాలు తీసుకోవడం లేదు అంతేకాదు  మానసిక నీ పుణులు వైద్యులు పోలీసులు విభిన్న వర్గాల నుండి వచ్చిన సూచనలను తాత్కాలికంగా  ప్రస్తావించడమే తప్ప ఆ తర్వాత కాలం లోపల  వాటిని సమన్వయపరిచి తగిన చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఈ దేశంలో లేకపోవడం వల్లనే పుంఖాను పుంకాలుగా ఇలాంటి దుర్మార్గపు సంఘటనలు, మానవత్వం  మచ్చుకైనా లేని  ఆవేదనతో కూడుకున్న  కన్నీటికీ అంతే లేకుండా పోతున్నది.
          పరిశీలనకు వచ్చిన కొన్ని డిమాండ్లు:-

  వైద్యులు సిబ్బంది మహిళా సిబ్బంది ఉన్నచోట  పని పరిస్థితులలో మెరుగుపరచాలి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి విశ్రాంతి కోసం ప్రత్యేక గదులను నిర్మించి అందుబాటులో ఉంచాలి.
-  మహిళల రక్షణకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని  రూపకల్పన చేయడంతో పాటు అమలుకునోచుకోని చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా  ఇలాంటి సంఘటనల పైన ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది  .
--సుప్రీంకోర్టు ఏర్పరిచినటువంటి  టాస్క్ ఫోర్స్ వెంటనే నివేదిక ఇవ్వడం ద్వారా  జాతీయస్థాయిలో తగినటువంటి మార్గదర్శకాలు జారీ చేసి  బాధితులకు భరోసానివ్వడంతో పాటు నేరస్తులకు  కఠిన శిక్షలు విధించే ఏర్పాటు ద్వారా  మానసిక పరివర్తనకు  చొరవ చూపాల్సిన అవసరం ఉంది .
-- ముఖ్యంగా ఆసుపత్రులు జన సమూహం భారీగా ఉండే చోట పని చేసే ఉద్యోగులు ఇతరులు  బస్టాండ్లు కళాశాలలో రైల్వేస్టేషన్లో విమానాశ్రయాలు  ఎక్కడైనా పోలీసు, మహిళా పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేయడం ద్వారా  రక్షణ చర్యలు చేపట్టాలి.  కార్యాలయాలు ఆసుపత్రులు ఇతరత్రా పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బంది వైద్యులు ఉపాధ్యాయులు అన్ని రంగాలకు చెందినటువంటి మహిళా ఉద్యోగులకు  ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు  పని భారాన్ని  తగ్గించడమే కాదు రాత్రిపూట విధి నిర్వహణలో  మించిన భారాన్ని  వేయకుండా ఉండాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి . రాత్రిపూట అలసి సొలసి సొమ్మసిల్లిన సందర్భంలో కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందని అలాగే పాఠశాలలు కళాశాలల పిల్లలను చేరవేసే సందర్భంలో కూడా బస్సు డ్రైవర్లు క్లీనర్లు లేదా తెలిసిన కుటుంబాల వాళ్లే ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్న సందర్భంలో  బహిరంగ శిక్షలను విధించడం ద్వారా  నేర స్వభావాన్ని  నేర మనస్తత్వాన్ని సమాజం నుండి  వెలివేయడానికి తగినటువంటి మార్గాలను ఆలోచించాల్సిన అవసరం మనందరి పైన ఉన్నది. అప్పుడు మాత్రమే  ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది  వ్యక్తిగతమైన మానసిక పరివర్తనను మించిన  పరిష్కారం ఇంకోటి ఉంటది ఆ రకమైన మానసిక పరివర్తనకు దారి తీసే  పరిస్థితులు, పని పరిస్థితులు, చర్యలు,  శిక్షలు,  మానవీయ కోణానికి సంబంధించినటువంటి  ఆలోచనలను సమాజం నిండా విస్తరింప చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది  సమాజంలోని అన్ని వర్గాల యొక్క బాధ్యత  హక్కులకై కలబడడమే కాదు బాధ్యతలకు కూడా నిలబడాలి అనే స్ఫూర్తివంతమైన నినాదానికి అనుగుణంగా  ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చోటు చేసుకోకుండా చూడవలసిన బాధ్యత మన అందరి పైన కూడా ఉన్నది.  అదే సందర్భంలో ప్రభుత్వాలు ,పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మరింత వేగంగా  స్పందించడం వలన కూడా కొంత నేర మనస్తత్వాన్ని ఇలాంటి దుష్ట సంఘటనల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుంది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333